Mahesh Babu: ఆ ప్రశ్నలు తలెత్తాయి: వెబ్ సిరీస్‍కు రివ్యూ ఇచ్చిన మహేశ్ బాబు
Poacher series review by Mahesh Babu: పోచర్ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతోంది. ఈ సిరీస్‍ను చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Poacher Web Series: ‘పోచర్’ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఫిబ్రవరి 23వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అడవుల్లో ఏనుగులపై జరిగిన దాడులు, దారుణాలు, స్మగ్లింగ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఎమీ అవార్డు విన్నర్ రిచీ మెహతా ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సిరీస్‍కు సహ నిర్మాతగా వ్యవహరించారు. పోచర్ సిరీస్‍కు సిరీస్‍పై ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ పోచర్ సిరీస్ చూశారు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.
ఏనుగులను చంపి, వాటి దంతాలు, అవయవాలను స్మగ్లింగ్ చేసిన ముఠా గురించి ఈ సిరీస్‍లో మేకర్స్ చూపించారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక చాలా సేపు తన మెదడులో కొన్ని ప్రశ్నలు తిరిగాయని మహేశ్ బాబు తెలిపారు.
ప్రశ్నలు తిరుగుతున్నాయి
పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన అభిప్రాయాన్ని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు మహేశ్. “ఎవరైనా అలా ఎలా చేయగలుగుతారు? మానవత్వం అనేది ఉండదా? వారి చేతులు వణకవా? ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక నా మెదడులో ఈ ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి” అని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. ఏనుగులపై స్మగ్లర్లు అంత దారుణంగా ఎలా దాడి చేయగలిగారనేలా మహేశ్ రాసుకొచ్చారు.
పోచర్ సిరీస్‍ను యథార్థ ఘటనల ఆధారంగా మేకర్స్ రూపొందించారు. కేరళ అడవుల్లో ఏనుగులపై జరిగిన దాడుల అంశాన్ని చూపించారు. అక్రమ స్మగ్లింగ్‍ను అడ్డుకునేందుకు కొందరు అటవీ అధికారులు, అటవీ సంరక్షణ కార్యకర్తలు చేసిన సాహసాన్ని తెరకెక్కించారు.
పోచర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో నిమిష సంజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య, కనీ కుశృతి ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు రిచీ మెహతా ఈ సిరీస్‍ను తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సిరీస్‍కు రివ్యూలు, స్పందన పాజిటివ్‍గానే వస్తోంది.
పోచర్ సీజన్ 1లో ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం సహా మరిన్ని భాషల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ప్రస్తుతం టాప్-10లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ చాలా బాగుందంటూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఆలియా భట్, ప్రేరణా సింగ్, ఎడ్వర్డ్ హెచ్ హమ్, రేమండ్ మాన్స్‌ఫీల్డ్ సంయుక్తంగా పోచర్ సిరీస్‍ను నిర్మించారు. జోహాన్ హెర్లిన్ సినిమాటోగ్రఫీ చేశారు.
మహేశ్ నెక్ట్స్ సినిమా
కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా (SSMB29) చేయనున్నారు. గ్లోబల్ రేంజ్‍లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. మరో రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో మహేశ్ బాబుతో చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించాలని ఆయన డిసైడ్ అయ్యారు. సుమారు రూ.1,000కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతుందని అంచనాలు ఉన్నాయి.