Ghilli Re Release: రీ రిలీజ్ కాబోతున్న మ‌హేష్ బాబు ఒక్క‌డు త‌మిళ్ రీమేక్‌ - ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో-mahesh babu okkadu tamil remake thalapathy vijay ghilli re release in theaters on this date okkadu vs ghilli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ghilli Re Release: రీ రిలీజ్ కాబోతున్న మ‌హేష్ బాబు ఒక్క‌డు త‌మిళ్ రీమేక్‌ - ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో

Ghilli Re Release: రీ రిలీజ్ కాబోతున్న మ‌హేష్ బాబు ఒక్క‌డు త‌మిళ్ రీమేక్‌ - ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో

Nelki Naresh Kumar HT Telugu
Apr 04, 2024 12:21 PM IST

Ghilli Re Release: మ‌హేష్‌బాబు ఒక్క‌డు మూవీని గిల్లి పేరుతో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళంలో రీమేక్ చేశాడు. విజ‌య్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఏప్రిల్ 20న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతోంది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ గిల్లి రీ రిలీజ్‌
ద‌ళ‌ప‌తి విజ‌య్ గిల్లి రీ రిలీజ్‌

Ghilli Re Release: రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్‌లో చాలా పాపుల‌ర్ అయ్యింది. మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఎన్టీఆర్‌తో పాటు ప‌లువురు స్టార్ హీరోలు న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలు థియేట‌ర్ల‌లో రీ రిలీజై కోట్ల‌లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. కొత్త సినిమాల‌కు ధీటుగా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్నాయి.

ఒక్క‌డు రీమేక్ రీ రిలీజ్‌..

ఈ రీ రిలీజ్ ట్రెండ్ కోలీవుడ్‌కు విస్త‌రించింది. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ గిల్లి రీ రిలీజ్ కాబోతోంది. విజ‌య్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ 2004లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన ఒక్క‌డు మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కిన గిల్లి త‌మిళంలో థియేట‌ర్ల‌లో 200 రోజుల‌కుపైగా ఆడింది. 2004లో కోలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

ఏప్రిల్ 20న...

విజ‌య్ యాక్టింగ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన గిల్లి మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకువ‌స్తోంది. గిల్లి రిలీజై ఇర‌వై ఏళ్లు అయిన సంద‌ర్భంగా ఏప్రిల్ 20న ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌బోతున్నారు.గిల్లి రీ రిలీజ్ డేట్‌ను ప్రొడ‌క్ష‌న్ హౌజ్ మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. త‌మిళ‌నాడుతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో గ‌ల్లి స్పెష‌ల్ షోస్‌న ప్లాన్ చేస్తున్నారు.

గిల్లి రీ రిలీజ్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రీ రిలీజ్ క‌లెక్ష‌న్స్‌లో గ‌త రికార్డుల‌న్ని గిల్లి బ్రేక్ చేస్తుంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఏప్రిల్ 20న థియేట‌ర్ల‌లో మాస్ ర‌చ్చ ఖాయ‌మ‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

తెలుగులో భూమిక‌..త‌మిళంలో త్రిష‌...

ఒక్క‌డు సినిమాలో భూమిక హీరోయిన్‌గా న‌టించింది. గిల్లిలో భూమిక రోల్‌లో త్రిష న‌టించింది. ఒక్క‌డు కంటే క‌మ‌ర్షియ‌ల్‌గా గిల్లి పెద్ద హిట్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఒక్క‌డు 39 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌గా గిల్లి 2004లోనే యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి కోలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. తెలుగులో ఒక్క‌డు సినిమాకు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించ‌గా త‌మిళంలో గిల్లికి విద్యాసాగ‌ర్ సంగీతం స‌మ‌కూర్చాడు.

గిల్లి సినిమాలో విజ‌య్ యాక్టింగ్‌, అత‌డిపై తెర‌కెక్కించిన క‌బ‌డ్డీ ఫైట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

విక్ర‌మ్‌తో చేయాల్సింది...

గిల్లి రీమేక్‌ను తొలుత విక్ర‌మ్‌తో చేయాల‌ని నిర్మాత ఏఎమ్ ర‌త్నం ప్లాన్ చేశారు. అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశాడు. విక్ర‌మ్‌కు జోడీగా జ్యోతిక‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నాడు. గిల్లీ రీమేక్‌కు ముందు ఏఎమ్ ర‌త్నం బ్యాన‌ర్‌లో విక్ర‌మ్ న‌టించిన ధూళ్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ రిజ‌ల్ట్ కార‌ణంగా గిల్లీని విక్ర‌మ్‌తో కాకుండా విజ‌య్‌తో తెర‌కెక్కించాడు ఏఎమ్ ర‌త్నం. ఒక్క‌డుతో పాటు మ‌హేష్‌బాబు పొకిరి సినిమాను కూడా ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళంలో రీమేక్ చేశాడు.

గోట్‌లో డ్యూయ‌ల్ రోల్‌...

ప్ర‌స్తుతం విజ‌య్ గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న గోట్‌లో విజ‌య్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. గోట్‌లో మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌శాంత్‌, ప్ర‌భుదేవా, ఎస్‌జే సూర్య‌తో పాటు ప‌లువురు కోలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న 68వ మూవీ ఇది.