Murari Re-release record: రీరిలీజ్‌లోనూ రికార్డులు కొల్లగొడుతున్న మహేష్ బాబు మురారి.. టికెట్ల అమ్మకంలో సరికొత్త రికార్డు
Murari Re-release record: మహేష్ బాబు మురారి మూవీ రీరిలీజ్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 9న రిలీజ్ కానుండగా.. బుక్ మై షోలో రికార్డు టికెట్లు అమ్ముడుపోయాయి.
Murari Re-release record: మహేష్ బాబు, కృష్ణ వంశీ కాంబినేషన్ లో 23 ఏళ్ల కిందట వచ్చిన సెన్సేషనల్ మూవీ మురారి. ఈ రీరిలీజ్‌ల కాలంలో ఇప్పుడు మహేష్ బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 9న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే రీరిలీజ్ లోనూ ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ కు మూడు రోజుల ముందే బుక్ మై షోలో రికార్డు టికెట్ అమ్మకాలు జరగడం విశేషం.
మురారి రీరిలీజ్ రికార్డు
గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. ప్రతి స్టార్ బర్త్ డేకు వాళ్ల కెరీర్లో మైల్‌స్టోన్ గా నిలిచిపోయిన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా మహేష్ బాబుకు చెందిన ఒక్కడు, పోకిరి, బిజినెస్‌మ్యాన్ సినిమాలు కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఈసారి మహేష్ మరో హిట్ మూవీ మురారి రీరిలీజ్ కాబోతోంది.
అయితే ఈ కల్ట్ క్లాసిక్ మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బెంగళూరు, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మంగళవారానికే (ఆగస్ట్ 6) టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. మురారి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా ఫ్యాన్స్ మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
మహేష్ రెండో రీరిలీజ్ కూడా..
మహేష్ బాబుకు చెందిన బిజినెస్‌మ్యాన్ మూవీ గతేడాది రీరిలీజ్ అయింది. ఆ సినిమాకు కూడా బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇలా రీరిలీజ్ మూవీస్ లో రెండుసార్లు బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం మహేష్ బాబుకే సాధ్యమైంది. ఇంతకుముందు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మూవీ గిల్లీకి కూడా లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి.
నిజానికి అది కూడా మహేష్ బాబు ఒక్కడు మూవీకి రీమేకే. అయితే ఇలా రెండు వరుస రీరిలీజ్ లలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా మహేష్ నిలిచాడు. ఇవి కాకుండా థియేటర్ల దగ్గర కూడా మురారి టికెట్లు భారీగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన మహేష్ ఖాతాలో మరో రికార్డు చేరడం ఖాయం.
మురారి మూవీ గురించి..
మహేష్ బాబుకు టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఇంకా రాకముందు రిలీజైన మూవీ మురారి. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2001లో వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. సొనాలి బింద్రె ఫిమేల్ లీడ్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా ఇందులో మహేష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఈ సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే పాట ఇప్పటికీ చాలా పెళ్లిళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాకుగాను స్పెషల్ జ్యూరీ అవార్డు కింద మహేష్ నంది అవార్డు అందుకున్నాడు.