Murari Re Release: మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆగస్ట్ 9న రానున్నట్లు తెలుస్తోంది. మూవీ లాంఛింగ్, షూటింగ్ డీటెయిల్స్, యాక్టర్స్‌తో పాటు పలు విషయాలపై మహేష్‌బాబు బర్త్‌డే రోజు క్లారిటీ రానున్నట్లు సమాచారం.
ఈ కొత్త మూవీకి సంబంధించిన అప్‌డేట్‌తో పాటు మహేష్ బర్త్ డే రోజు అతడి బ్లాక్‌బస్టర్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మురారి మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్‌బాబు బర్త్‌డే రోజు ఈ మూవీ స్పెషల్ షోస్‌ను తెలుగు రాష్ట్రాలతో ఓవర్‌సీస్‌లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. రీ రిలీజ్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వందలకుపైగా థియేటర్లలో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మురారి మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. మూడు నంది అవార్డులను అందుకున్నది. బెస్ట్ ఫిల్మ్‌గా సిల్వర్ అవార్డుతో పాటు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా లక్ష్మి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు. స్పెషల్ జ్యూరీ కేటగిరీలో మురారి మూవీకిగాను మహేష్‌బాబు కూడా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు.
మురారి మూవీకి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మహేష్‌బాబుకు జోడీగా సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే సోనాలీ బింద్రే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
మహేష్‌బాబు కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌గా మురారి నిలిచింది. ఈ మూవీతోనే మహేష్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యాడు. ముఖ్యంగా ఈ మూవీకి మణిశర్మ అందించిన మ్యూజిక్ ప్లస్సయింది. పాటలు పెద్ద హిట్టయ్యాయి. ఈ సినిమాలోని బంగారు కళ్ల బుజ్జమ్మో అనే పాటలోని కొన్ని లైన్స్‌ను మహేష్‌బాబు పాడాడు. తన కెరీర్ మొత్తంలో మహేష్‌బాబు పాడిన ఒకే ఒక పాట ఇది.
ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేష్‌బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.నిర్మాతలు మాత్రం నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూవీ 300 కోట్ల వసూళ్లను రాబట్టి తమకు లాభాలను తెచ్చిపెట్టిందని ప్రకటించారు.
గుంటూరు కార తర్వాత మహేష్‌బాబు అగ్ర దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం స్పెషల్‌గా మేకోవర్ అవుతోన్నాడు మహేష్‌బాబు.
అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకల్లో లాంగ్ హెయిర్ తో స్టైలిష్ లుక్‌లో మహేష్ కనిపించాడు. రాజమౌళి మూవీలో ఇదే లుక్‌లో మహేష్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఇందులో మహేష్‌బాబు డ్యూయల్ రోల్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.