Mahesh Babu - Pawan Kalyan: పవన్ కల్యాణ్‍ను అభినందించిన మహేశ్ బాబు.. ఈ గెలుపు నిదర్శనం అంటూ..
Mahesh Babu on Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనాని పవన్ కల్యాణ్‍కు అభినందనలు తెలిపారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Mahesh Babu - Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలువగా.. ఆయన పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించింది. దీంతో టాలీవుడ్ నుంచి చాలా మంది సెలెబ్రిటీలు పవన్‍కు అభినందనలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు (జూన్ 5) పవన్ కల్యాణ్‍కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రజల నమ్మకానికి నిదర్శనం
పవన్ కల్యాణ్‍పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి ఆయన గెలుపే నిదర్శనమని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. “అద్భుతమైన విజయం సాధించిన పవన్‍కల్యాణ్‍కు శుభాకాంక్షలు. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకానికి, విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనం. మన ప్రజల కోసం మీ కలలు నెరవేరేలా మీ పాలన సాగుతుందని కోరుకుంటున్నా” అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి అధిష్టించనున్న తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా అభినందనలు తెలిపారు మహేశ్ బాబు. “ఆంధ్రప్రదేశ్ సీఎంగా అద్భుత విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఏపీ అభివృద్ధి, శ్రేయస్సుతో మీ పదవీ కాలం విజయవంతంగా నిండాలని ఆకాంక్షిస్తున్నా” అని మహేశ్ పోస్ట్ చేశారు.
ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీకి కూడా శుభాకాంక్షలు చెప్పారు మహేశ్. పటిష్టమైన, ఉజ్వల భారత నిర్మాణంలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు మహేశ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు మంగళవారం (జూన్ 4) వెల్లడి కాగా.. నేడు ట్వీట్స్ చేశారు మహేశ్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలిచింది. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్‍సభ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లలో గెలిచింది. దీంతో, ఏపీలోని 175 స్థానాల్లో కూటమి 164 స్థానాలను దక్కించుకొని.. అధికారం కైవసం చేసుకుంది.
ఎన్టీఆర్ ట్వీట్
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‍ను అభినందిస్తూ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నేడు ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక విజయం సాధించిన ప్రియమైన చంద్రబాబు మావయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తుందని ఆశిస్తున్నట్టు రాసుకొచ్చారు. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేశ్, బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్‍కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
సినిమాలు ఇలా..
సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా (SSMB 29) చేయనున్నారు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ప్రస్తుతం సంసిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లేకపోతే సెప్టెంబర్‌లో మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. కాగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు.