SSMB 29 Launch: మహేశ్ బాబు - రాజమౌళి గ్లోబల్ రేంజ్ మూవీ లాంచ్‍కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే!
SSMB 29 Launch: మహేశ్ బాబు - రాజమౌళి సినిమా లాంచ్‍కు డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షురూ కానుందని సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‍లో మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి విపరీతంగా ఉంది. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో మహేశ్‍తో మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు ఆయన నిర్ణయించారు. ఎస్ఎస్ఎంబీ29 అని ఈ ప్రాజెక్టును పిలుస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే నిరీక్షణ మాత్రం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ సినిమా లాంచ్‍కు డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది.
లాంచ్ డేట్ ఇదే!
మహేశ్ - రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ రేపు (జనవరి 2, 2025) లాంచ్ అవుతుందనే సమాచారం బయటికి వచ్చింది. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, రేపు ఈ సినిమా లాంచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ చక్కర్లు కొడుతోంది.
ఎస్ఎస్ఎంబీ29 లాంచ్ బజ్‍తో సోషల్ మీడియాలో మళ్లీ మోతెక్కుతోంది. ప్రారంభం మాత్రమే ఉంటుందా… రాజమౌళి ప్రెస్‍మీట్ కూడా ఏమైనా పెడతారా అనే ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రతీ సినిమా ప్రారంభం ముందు మీడియాకు వివరాలు వెల్లడిస్తారు రాజమౌళి. ఈసారి కూడా అదే ఫాలో అవుతారా.. లేదా అనేది చూడాలి.
వెయ్యి కోట్ల బడ్జెట్
మహేశ్, రాజమౌళి కాంబినేషన్‍లో ఈ చిత్రానికి సుమారు రూ.1,000 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. గ్రాండ్ స్కేల్‍లో హాలీవుడ్ సినిమాల రేంజ్‍లో తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేశారట. ఈ చిత్రం కోసం లుక్‍ను మహేశ్ బాబు మార్చేశారు. లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపిస్తున్నారు. కండలు కూడా ఎక్కువగా పెంచేశారు. ఈ లుక్‍లో మహేశ్ అద్భుతంగా ఉన్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని ఇటీవలే ఆయన చెప్పారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. గ్లోబల్ రేంజ్ మూవీ కావడంతో ఈ సినిమాలో నటీనటులు ఎవరు ఉంటారనే ఆసక్తి విపరీతంగా ఉంది.
రాజమౌళి తెరకెక్కించే భారీ ఈ భారీ యాక్షన్ చిత్రంలో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‍గా నటిస్తారనే రూమర్లు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. హాలీవుడ్‍లో ప్రియాంక పాపులర్. దీంతో ఆమెతో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రావొచ్చు.
సంబంధిత కథనం