టైటిల్: మధురం
నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్‌ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు
కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ చికిలే
సంగీతం: వెంకీ వీణ
సినిమాటోగ్రఫీ: మనోహర్ కొల్లి
ఎడిటింగ్: ఎన్టీఆర్
నిర్మాత: ఎం. బంగర్రాజు
విడుదల తేదీ: ఏప్రిల్ 18, 2025
Madhuram Movie Review In Telugu: ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ తెలుగులో హీరో, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమా మధురం. లవ్ రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రాజేష్ చికిలే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో స్కూల్ లవ్ స్టోరీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.
తాజాగా 90 నేపథ్యంలో గోదారి పరిసరాల్లో అప్పటి కాలం మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేలా తెరకెక్కిన మధురం ఇవాళ (ఏప్రిల్ 18) థియేటర్లలో విడుదలైంది. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో నేటి మధురం రివ్యూలో తెలుసుకుందాం.
ఆత్రేయపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మధు (వైష్ణవి సింగ్) పదో తరగతి చదువుతుంది. మధును తన క్లాస్‌మేట్ లవ్ చేస్తుంటాడు. కానీ, ప్రేమ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోదు. దాంతో తొమ్మిదో తరగతి చదువుతున్న తన ఫ్రెండ్ రామ్ (ఉదయ్ రాజ్)కు తన లవ్ గురించి చెప్పమని కోరుతాడు. అప్పటికే రామ్‌ను మధు ప్రేమిస్తుంటుంది. కట్ చేస్తే రామ్, మధు ఇద్దరు లవ్ చేసుకుంటారు.
పదో తరగతి అనంతరం మధు సిటీకి వెళ్తుంది. మధును కలవడానికి వెళ్లిన రామ్ ఆమె మరొకరితో చనువుగా ఉండటం చూసి అపార్థం చేసుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మధు, రామ్ ఎలా కలిశారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటీ? అనేది తెలియాలంటే మధురం సినిమా చూడాల్సిందే.
ప్రేమ కథ సినిమాలు తెలుగులో తరచుగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో ఎక్కువగా స్కూల్ డేస్ లవ్ స్టోరీలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి స్కూల్ డేస్ లవ్ స్టోరీగా వచ్చిందే మధురం. స్కూలింగ్‌లో మొదలైన ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుంది, చివరికి ఏమైంది అనే మెయిన్ పాయింట్స్‌తో మధురం తీశారు.
అయితే, కేవలం లవ్ స్టోరీకి పరిమితం కాకుండా 90స్ కాలంలో స్కూల్ డేస్‌లో విద్యార్థులు ఎలా ఉండేవారు, వారు చేసే పనులు ఎలా ఉండేవి వంటి అంశాలను చక్కగా చూపించారు. చేతులు విడిచిపెట్టి సైకిల్ తొక్కడం, అమ్మాయిల ముందు స్టైల్‌గా బ్రేక్స్ వేసి ఆపడం, విద్యార్థి దశలో సైకిల్‌పై చేసే విన్యాసలు వంటి చాలా సన్నివేశాలు పాత రోజులను గుర్తు చేస్తాయి.
ఇక ప్రేమకథలు అనగానే సీన్స్ రొటీన్‌గానే కనపడతాయి. సో రిపీటెడ్ సీన్స్ అనిపించి లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. మనిషి జీవితంలోని మూడు ఫేజెస్‌ను బాగా చూపించారు. క్లైమాక్స్ ఊహించినట్లుగానే ఉంటుంది. పాత్రల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. సంగీతం బాగుంది. లవ్ స్టోరీలకు కావాల్సిన బీజీఎమ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ అందించారు. రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక హీరో హీరోయిన్స్ కొత్తవారు అయినప్పటికీ బాగా చేశారు. మూడు డిఫరెంట్ గెటప్స్‌లలో ఉదయ్ రాజ్ అలరించే ప్రయత్నం చేశాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన ఉదయ్ రాజ్‌కు ఆ అనుభవం ఉపయోగపడినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ వైష్ణవి సింగ్ చాలా అందంగా గ్లామర్‌గానే కాకుండా నటన పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రలు సైతం మెప్పించే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే 90స్ జ్ఞాపకాలను గుర్తు చేసే మధురమైన ఈ సినిమాపై లుక్కేయొచ్చు.
సంబంధిత కథనం