Madhavan: గజిని సినిమాలో నేనే మొదట హీరో.. మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో మాధవన్ ఇటీవలే కోలీవుడ్ నటుడు సూర్యతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా గజిని చిత్రంలో తాను మొదట హీరో అని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

కోలీవుడ్ హీరో సూర్య కెరీర్‌లో గజిని అతడి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా తప్పకుండా నిలుస్తుంది. సూర్యను తమిళంతో పాటు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా చేసిన చిత్రం ఇదే అనడంలో సందేహం లేదు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా హిందీలోనూ రీమేక్ అయి అక్కడ భారీ వసూళ్లను సాధించింది. అయితే 2005లో విడుదలైన ఈ చిత్రంలో హీరో మొదట సూర్య కాదట. ముందు మాధవన్‌తో ఆ సినిమాను మురుగదాస్ తెరకెక్కించనుకున్నారట. ఈ విషయాన్ని మాధవనే స్వయంగా తెలిపాడు. ఇటీవలే సూర్యతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించిన మాధవన్.. గజిని చిత్ర తన వద్దకు ఎలా వచ్చిందో తెలియజేశాడు.
ఏఆర్ మురుగదాస్.. తనకు ముందు కథ చెప్పినప్పుడు సెకాండాఫ్ నచ్చలేదని.. దీంతో తను సినిమాను తిరస్కరించినట్లు మాధవన్ సూర్యతో చెప్పాడు. అయితే అనంతరం ఇందులో సూర్య కష్టాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. కనీసం ఓ వారం పాటు ఉప్పు కూడా తినకుండా, సినిమా కోసం అతడు పడిన కష్టాన్ని మాధవన్ గుర్తు చేశాడు. గజిని సినిమా సూపర్ హిట్ కావడం చాలా పెద్ద విషయని సూర్యను ప్రశంసించాడు.
2005లో విడుదలైన ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సేలం చంద్రశేఖరన్ నిర్మించిన ఈ సినిమాలో అసిన్ హీరోయిన్‌గా చేసింది. నయనతార కీలక పాత్రలో నటించింది. ప్రదీప్ రావత్, రియాజ్ ఖాన్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ విడుదల చేశారు.
అనంతరం 2008లో ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో కూడా అసిన్ హీరోయిన్‌గా చేయగా.. జియా ఖాన్, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. మాతృకను తెరకెక్కించిన ఏఆర్ మురగదాసే ఈ సినిమానూ రూపొందించారు.
మాధవన్, సూర్య ఇద్దరూ కలిసి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ చిత్రంలో నటించారు. ఈ సినిమాను 2004లో విడుదలైంది. అనంతరం చాలా కాలం తర్వాత మాధవన్ ముఖ్య పాత్ర పోషించిన ది రాకెట్రీ సినిమాలో అతిథి పాత్రలో మెరిశారు సూర్య.
సంబంధిత కథనం
టాపిక్