Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ - నో లాజిక్ - ఓన్లీ ఫన్ - సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే?
మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ మూవీ మార్చి 28న (నేడు) థియేటర్లలోకి వచ్చింది. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
రెండేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన మ్యాడ్ పెద్ద హిట్టయింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. ఈ సీక్వెల్‌లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సీక్వెల్ ఉలా ఉంది? ఫస్ట్ పార్ట్‌కు మించి నవ్వించిందా? లేదా? అంటే?
ముగ్గురు స్నేహితుల కథ...
ఇంజినీరింగ్ పూర్తయిన మూడేళ్ల తర్వాత డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్) జీవితాలు మలుపులు తిరుగుతాయి. తన ఆస్తుల కోసం అశోక్ కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. డీడీ సర్పంచ్‌గా పోటీ చేయాలని కలలు కంటాడు. ఊరి ప్రజల మెప్పు కోసం అతడు చేసే పనులన్నీ మిస్ ఫైర్ అవుతుంటాయి. మనోజ్‌లో లవ్‌లో ఫెయిలవుతాడు.
లడ్డు తమకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకొని అతడికి పెళ్లికి అటెండ్ అయ్యి స్నేహితుడిని సర్‌ప్రైజ్ చేయాలని ముగ్గురు అనుకుంటారు. డీడీ, మనోజ్, అశోక్ తిక్క పనులు చేసి తన పెళ్లిని ఎక్కడ చెడగొడతారోనని లడ్డు భయపడతాడు.
మరికొద్ది సేపట్లో తాళికట్టబోతుండగా డీడీ, మనోజ్, అశోక్‌లతో పాటు వచ్చిన ఓ ఫ్రెండ్‌తో లడ్డు పెళ్లిచేసుకోబోయే అమ్మాయి లేచిపోతుంది. పెళ్లి బాధ నుంచి బయటపడటానికి నలుగురు ఫ్రెండ్స్ గోవా వెళతారు.
గోవాలో విలువైన పురాతన లాకెట్‌ను మ్యాక్స్ గ్యాంగ్ కొట్టేస్తుంది. కానీ మ్యాక్స్ దగ్గర నుంచి అనుకోకుండా లాకెట్ మిస్సవుతుంది. డీడీ, మనోజ్, అశోక్ దగ్గరే ఆ లాకెట్ ఉందని మ్యాక్స్‌కు తెలుస్తుంది.
ఆ లాకెట్ కోసం లడ్డు తండ్రిని కిడ్నాప్ చేస్తాడు మాక్స్. ఆ తర్వాత ఏమైంది? మాక్స్ దగ్గర నుంచి లడ్డు తండ్రిని ముగ్గురు స్నేహితులు ఎలా వినిపించారు? నిజంగానే మాక్స్ లాకెట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ దొంగతనం చేశారా? గోవాలో లడ్డు జీవితంలోకి వచ్చిన లైలా ఎవరు అన్నదే మ్యాడ్ స్వ్కేర్ మూవీ కథ.
నో లాజిక్స్ ఓన్లీ ఫన్...
మ్యాడ్ స్వ్కేర్ కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా అని ప్రమోషన్స్‌లో నిర్మాత నాగవంశీ చెప్పాడు. ఇందులో కథ, లాజికల్‌లను వెతకొద్దని ముందే హింట్ ఇచ్చాడు. నిర్మాత చెప్పినట్లే ఈ మూవీ సాగుతుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. సినిమా నిండా ఫన్ కోసమే క్రియేట్ చేసిన క్యారెక్టర్లు, సీన్లు కనిపిస్తాయి.
లడ్డు పెళ్లి హంగామా...
మ్యాడ్‌కు కొనసాగింపుగానే ఈ సీక్వెల్ సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మూడేళ్ల తర్వాత డీడీ, అశోక్, మనోజ్ ఏం చేస్తున్నారది చూపిస్తూ కథను మొదలుపెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీపడేందుకు డీడీ చేసే పనులు నవ్విస్తాయి.
లడ్డు పెళ్లి వేడుకలోకి ఈ ముగ్గురు స్నేహితులు అటెండ్ అయినతర్వాత వచ్చే కామెడీ సీన్లు హిలేరియస్‌గా నవ్విస్తాయి. పెళ్లి వేడుకలో అశోక్, డీడీ, మనోజ్ చేసే సందడి, పెళ్లి కూతురి ఫ్యామిలీతో లడ్డు, అతడి తండ్రి సాగించే సంభాషణలు ఆకట్టుకుంటాయి. లడ్డు పెళ్లి చుట్టే ఫస్ట్ కథను నడిపించి ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు దర్శకుడు.
గోవాకు షిప్ట్...
సెకండాఫ్ కథను గోవాకు షిఫ్ట్ చేశాడు. అక్కడ విలువైన లాకెట్ మిస్సింగ్, మ్యాక్స్ గ్యాంగ్ కారణంగా స్నేహితులు పడే తిప్పలు, లడ్డు తండ్రిని విడిపించడానికి చేసే ప్రయత్నాల చుట్టూ క థను నడిపించాడు. క్రైమ్ డ్రామాను కూడా ఫన్నీగానే రాసుకున్నాడు దర్శకుడు. కొంత గ్లామర్ కూడా యాడ్ చేసి యూత్ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు. సెకండాఫ్‌లో అశోక్ క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ బాగుంది.. మ్యాడ్ స్వ్కేర్‌లో కొన్ని ట్రాక్స్ నాచురల్‌గా అనిపిస్తే...మరికొన్ని ఫోర్స్‌డ్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
కామెడీ టైమింగ్...
మ్యాడ్ స్క్వేర్‌లో ప్రతి ఒక్కరూ తమ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. సంగీత్ శోభన్ పంచ్ డైలాగ్స్ హిలేరియస్‌గా నవ్విస్తాయి. పంచ్‌లు, ప్రాసలతో ఆద్యంతం నవ్వించాడు. మ్యాడ్‌లో సీరియస్‌గా కనిపించిన నార్నే నితిన్...ఇందులో మాత్రం ఫన్ బాగా పండించాడు. అతడి డైలాగ్స్ కొన్ని నవ్వులను పంచుతాయి.
రొమాంటిక్ బాయ్ రోల్‌లో రామ్ నితిన్ పర్వాలేదనిపించాడు. కామెడీ పరంగా ఈ సినిమాకు విష్ణు క్యారెక్టర్ హైలైట్‌గా నిలిచింది. లడ్డు పాత్రలో చెలరేగిపోయాడు. మురళీధర్ కామెడీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. అనుదీప్, సత్యం రాజేష్, సునీల్ క్యారెక్టర్స్ నుంచి చక్కటి ఫన్‌ను డైరెక్టర్ రాబట్టుకున్నాడు.
తమన్ బీజీఎమ్...
భీమ్స్ సిసిరోలియో పాటలు, తమన్ బీజీఎమ్ కూడా సినిమాకు బాగా కుదిరాయి. స్వాతి రెడ్డి పాట ప్లస్ పాయింట్‌గా నిలిచింది. దర్శకుడు రాసుకున్న డైలాగ్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. సినిమా రన్ టైమ్ కూడా తక్కువే కావడం ప్లస్‌గా మారింది.
టైమ్‌పాస్...
కథ, కథనాలు, లాజిక్స్ గురించి ఆలోచించకుండా టైమ్‌పాస్ కోసం థియేటర్‌లో అడుగుపెట్టే ఆడియెన్స్‌ను హిలేరియస్‌గా మ్యాడ్ 2 నవ్విస్తుంది. మ్యాడ్‌కు మించి ఫన్ ఉన్న మూవీ ఇది.
రేటింగ్: 2.75/5