బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్ ఓ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీ శుక్రవారం (జూన్ 27న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే?
ధృవ కుమార్ అలియాస్ ధృవ (విజయ్ ఆంటోనీ) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ముంబాయిలో అడిషనల్ డీజీపీగా పనిచేస్తుంటాడు. తన తెలివితేటలు, ధైర్యసాహసాలతో ఎన్నో క్లిష్టమైన కేసులను ఈజీగా సాల్వ్ చేస్తాడు. హైదరాబాద్ సిటీలో రమ్య అనే యువతి దారుణంగా హత్యకు గురవుతుంది.
ఆమె డెడ్‌బాడీ మొత్తం నలుపు రంగులోకి మారుతుంది. ఆ హత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవు. అదే తరహాలో గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని హత్యలు జరుగుతాయి.
చనిపోయిన వారిలో ధృవ కూతురు ప్రియ కూడా ఉంటుంది. సీరియల్ మర్డర్స్ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను ధృవ చేపడతాడు. ఈ హత్యలకు అరవింద్ (అజయ్ దిషాన్) అనే యువకుడికి సంబంధం ఉందని ధృవ అనుమానిస్తాడు. అతడి అనుమానం నిజమేనా?
అరవింద్‌కు ఉన్న అతీంద్రయ శక్తులు ఏమిటి? ఈ సీరియల్ మర్డర్స్ వెనుక ఎవరున్నారు? రమ్య, వెన్నెల, అఖిల, శృతి, మేఘ అనే అమ్మాయిల గురించి ధృవకు ఎలాంటి నిజాలు తె లిశాయి? అసలైన హంతకుడిని ధృవ ఎలా పట్టుకున్నాడు? తన కూతురు మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
సీరియల్ కిల్లర్ మూవీస్ దాదాపుగా ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. ఎలాంటి క్లూస్ లేకుండా కిల్లర్ హత్యలు చేయడం, హీరో తన తెలివితేటలతో ఆ కిల్లర్‌ను పట్టుకోవడం, ఎవరూ ఊహించని వ్యక్తి హంతకుడు కావడం...అన్నది ఈ థ్రిల్లర్ మూవీస్‌లో కామన్‌గా కనిపిస్తుంది. ఈ రొటీన్ పాయింట్‌ను కొత్తగా చెబితేనే ఆడియెన్స్ థ్రిల్లయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మార్గన్ కథను రాసుకున్నాడు డైరెక్టర్ లియో జాన్ పాల్. సీరియల్ కిల్లర్ ఎవరన్నది చివరి వరకు ఆడియెన్స్ ఏ మాత్రం గెస్ చేయకుండా పకడ్బందీగా స్క్రీన్‌ప్లే సాగుతుంది. ఎవరూ ఊహించని ఓ క్యారెక్టర్‌ను విలన్‌గా చూపిస్తూ సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేయడం బాగుంది.
హీరో ఎలివేషన్లు, ఇంట్రడక్షన్ల పేరుతో టైమ్‌పాస్ చేయకుండా ఫస్ట్ సీన్‌తోనే నేరుగా కథలోకి వెళ్లాడు దర్శకుడు. రమ్య మర్డర్ సీన్‌తోనే మార్గన్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ధృవ కేసు ఇన్వేస్టిగేషన్ చేయడం, అరవింద్‌ను పట్టుకోవడం ఇలా రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఫస్ట్ హాఫ్ సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
అరవింద్ సీరియల్ కిల్లర్ కావచ్చునని ఫిక్సయ్యేలోపు ఊహించని ట్విస్ట్‌తో కథాగమనం మొత్తం మారిపోతుంది. హంతకుడు అనుకున్న అరవింద్...సాయంతోనే ఈ కేసును ధృవ ఎలా సాల్వ్ చేశాడన్నది సెకండాఫ్‌లో చూపించారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని మలుపులు ఆకట్టుకుంటాయి.
చివరలో యూత్‌కు సంబంధించి ఓ మెసేజ్ ఇచ్చారు. హీరోతో పాటు అరవింద్ పాత్రలకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే బాగుండేది. కిల్లర్ మోటీవ్ ఏమిటన్నది అంత కన్వీన్సింగ్‌గా అనిపించదు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా ప్యూర్ థ్రిల్లర్ మూవీ ఫీల్‌ను ఆడియెన్స్‌కు అందించారు డైరెక్టర్. అతడే ఎడిటర్ కావడంతో సినిమాలో అనవసరపు సన్నివేశాలు కనిపించవు.
మార్గన్ మూవీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోనీ ఆదరగొట్టాడు. సీరియస్‌గా సాగే రోల్‌లో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. నెగెటివ్ ఛాయలతో సాగే పాజిటివ్ క్యారెక్టర్‌లో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ నటించాడు. సూపర్ పవర్స్‌తో డిఫరెంట్‌గా అతడి పాత్ర సాగుతుంది. సెకండాఫ్‌లో అతడే సినిమాకు హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది. బ్రిగాడా సాగాతో పాటు మిగిలిన వారి నటన ఓకే అనిపిస్తుంది.
హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు విజయ్ ఆంటోనీ. థ్రిల్లర్ సినిమాకు తగ్గట్లుగా బీజీఎమ్ సాగింది. చాలా చోట్ల సౌండ్‌తోనే ఈ సినిమా ఉత్కంఠను పంచుతుంది. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను మార్గన్ మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5
టాపిక్