Lucky Baskhar First Review: దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ ఖాయమంటూ..
Lucky Baskhar First Review: దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ మలయాళ స్టార్ నటించిన ఈ తెలుగు మూవీ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజ్ కానుండగా.. అప్పుడే కొందరు సినీ ప్రముఖుల నుంచి ఫస్ట్ రివ్యూ రావడం విశేషం.
Lucky Baskhar First Review: లక్కీ భాస్కర్.. ఈ దీపావళి సందర్భంగా రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా. మలయాళ స్టార్ హీరో, సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ నిర్మాత స్వప్న దత్ తోపాటు మరికొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
లక్కీ భాస్కర్ ఫస్ట్ రివ్యూ
లక్కీ భాస్కర్ ఓ పీరియడ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. 2018లో వచ్చిన తొలి ప్రేమతో దర్శకుడిగా పరిచయమై.. గతేడాది ధనుష్ సార్ మూవీతో పెద్ద హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో దీనిపై అంచనాలు పెరిగాయి.
అక్టోబర్ 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను నిర్మాత స్వప్న దత్ ఇప్పటికే చూసేసింది. దుల్కర్ నటించిన మహానటి మూవీని ప్రొడ్యూస్ చేసిన ఆమె.. ఇప్పుడీ లక్కీ భాస్కర్ ఓ బ్లాక్ బస్టర్ అంటూ తన రివ్యూ ఇచ్చింది. హైదరాబాద్ లో వేసిన ప్రివ్యూ షోని చూసిన ఆమె.. తర్వాత ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం ఖాయమని ఆమె చెప్పడం విశేషం.
స్వప్న దత్ లక్కీ భాస్కర్ రివ్యూ
లక్కీ భాస్కర్ మూవీ ప్రివ్యూ చూసిన తర్వాత స్వప్న దత్ ట్వీట్ చేసింది. "ఈ దివాలీకి బ్లాక్ బస్టర్ భాస్కర్ వచ్చేస్తున్నాడు. నా ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్.. ఎప్పటిలాగే భాస్కర్ పాత్రలో అదరగొట్టేశాడు. వెంకీ అట్లూరి చాలా బాగా తీశాడు. మీనాక్షి చౌదరి కూడా బాగుంది.
భాస్కర్ ప్రపంచం చాలా కూల్ గా ఉంది" అని స్వప్న దత్ ట్వీట్ చేసింది. అటు నటి రమ్య గున్నం కూడా ఈ మూవీ చూసి తన రివ్యూ చెప్పింది. "లక్కీ భాస్కర్.. ఎంతో మంచి ఫన్ మూవీ. ఎంతో బాగా తీసిన ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను" అని తన పోస్టులో రమ్య తెలిపింది.
లక్కీ భాస్కర్ మూవీ గురించి..
లక్కీ భాస్కర్ సినిమా ఓ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఉద్యోగి చుట్టూ తిరిగే కథ. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆ చిరుద్యోగి సులువుగా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కొని.. అలా కోట్లు సంపాదించి, వాటిని క్షణాల్లో ఖర్చు చేసేసి వార్తల్లో నిలుస్తాడు. ఇందులో భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు.
అటు అతని భార్య సుమతిగా మీనాక్షి కనిపించింది. ఈ సినిమాలో హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, రాంకీలాంటి వాళ్లు కూడా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా లక్కీ భాస్కర్ మూవీని తెరకెక్కించాయి. అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.