Love Me Collections: లవ్ మీ సినిమాకు బంపర్ ఓపెనింగ్.. తొలి రోజు భారీగా కలెక్షన్లు.. జోరు కొనసాగించగలదా?-love me day 1 box office collections ashish vaishnavi chaitanya romantic horror movie gets huge opening ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me Collections: లవ్ మీ సినిమాకు బంపర్ ఓపెనింగ్.. తొలి రోజు భారీగా కలెక్షన్లు.. జోరు కొనసాగించగలదా?

Love Me Collections: లవ్ మీ సినిమాకు బంపర్ ఓపెనింగ్.. తొలి రోజు భారీగా కలెక్షన్లు.. జోరు కొనసాగించగలదా?

Chatakonda Krishna Prakash HT Telugu
May 26, 2024 02:14 PM IST

Love Me day 1 Box office Collections: లవ్ మీ సినిమా మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. ఈ రొమాంటిక్ హారర్ చిత్రానికి తొలి రోజు అంచనాలకు మించి వసూళ్లు వచ్చాయి.

Love Me day 1 Collections: లవ్ సినిమాకు బంపర్ ఓపెనింగ్.. తొలి రోజు భారీ వసూళ్లు.. జోరు కొనసాగించగలదా?
Love Me day 1 Collections: లవ్ సినిమాకు బంపర్ ఓపెనింగ్.. తొలి రోజు భారీ వసూళ్లు.. జోరు కొనసాగించగలదా?

Love Me Collections: లవ్ మీ సినిమా మొదటి నుంచి ఆసక్తిని రేపింది. దెయ్యాన్ని హీరో ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్ హారర్ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్, బేబీ చిత్రంతో బ్లాక్‍బస్టర్ సాధించిన వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా ఉండటంతో మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాయిదాలు పడిన ‘లవ్ మీ.. ఇఫ్ యూ డేర్’ మూవీ ఎట్టకేలకు శనివారం (మే 25) థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి ఓపెనింగ్ అందుకుంది. ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే..

తొలి కలెక్షన్లు ఇలా..

లవ్ మీ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించింది. ఫస్ట్ డే వసూళ్లతో పోస్టర్ రిలీజ్ చేసింది. “లవ్ మీ - ఇఫ్ యూ డేర్’ బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. సింగిల్ స్క్రీన్‍లకు మళ్లీ వైభవం తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.4.5కోట్ల వసూళ్లను దక్కించుకుంది” అని మూవీ టీమ్ వెల్లడించింది.

లవ్ మీ చిత్రానికి తొలి రోజు థియేటర్లలో ఆక్యుపేషన్ బాగానే కనిపించింది. మోస్తరు బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీకి ఓపెనింగ్ డే మంచి వసూళ్లు వచ్చాయి. కాగా, సరైన రిలీజ్‍లు లేక కొంతకాలంగా మూతపడిన కొన్ని సింగిల్ స్క్రీన్‍లు ఈ మూవీతో తెరుచుకున్నాయి. వచ్చే వారం నుంచి కూడా వరుస రిలీజ్‍లు ఉండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అలాగే కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

లవ్ మీ జోరు కొనసాగిస్తుందా?

లవ్ మీ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ బాగా వచ్చింది. కథపరంగా కొత్తగా ఉన్నా స్క్రీన్‍ప్లే తికమకగా ఉందంటూ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలా చోట్ల లాజిక్‍లు మిస్ అయ్యాయనే కామెంట్లు వస్తున్నాయి. ఈ తరుణంలో బాక్సాఫీస్ వద్ద లవ్ మీ జోరు కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఆదివారం వసూళ్లు బాగానే వచ్చినా.. సోమవారం ఈ చిత్రానికి అసలైన అగ్నిపరీక్ష ఉండనుంది.

లవ్ మీ మూవీలో ఆశిష్, వైష్ణవితో పాటు రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు టీమ్ జోరుగా ప్రమోషన్లను చేసింది. ఆశిష్, వైష్ణవి చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

లవ్ మీ చిత్రాన్ని దిల్‍రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు. లవ్ మీ మూవీకి సీక్వెల్‍ను కూడా మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది. ‘కిల్ మీ.. ఇఫ్ యూ లవ్’ అంటూ సీక్వెల్ టైటిల్ కూడా వెల్లడించింది.

లవ్ మీ స్టోరీ లైన్

అర్జున్ (ఆశిష్), ప్రియ (వైష్ణవి చైతన్య) ప్రేమలో ఉంటారు. దెయ్యాలు లేవంటూ తన యూట్యూబ్ ఛానెల్‍లో వీడియోలు చేస్తుంటాడు అర్జున్. ఇక మిస్టరీలను ఛేదించడాన్ని ఇష్టపడుతుంటాడు. ఈ క్రమంలో దివ్యావతి అనే దెయ్యం గురించి అర్జున్‍కు ప్రియ చెబుతుంది. దివ్యావతి కథ విన్నాక ఆ దెయ్యాన్ని ప్రేమించాలని నిర్ణయించుకుంటాడు అర్జున్. ఆ దెయ్యం ఉన్న పాడుబడ్డ భవనానికి వెళతాడు. ఆ తర్వాత అర్జున్‍కు ఎదురైన పరిస్థితులు ఏంటి.. దివ్యావతి వెనకున్న కథేంటి.. అర్జున్‍కు దివ్యావతి గురించి ప్రియ ఎందుకు చెప్పింది అనేదే లవ్ మీ మూవీలో ప్రధాన అంశాలు ఉంటాయి.

టీ20 వరల్డ్ కప్ 2024