Crime Patrol Serial: 2003 మొదలై 2024లో ముగిసింది - 21 ఏళ్లు టీవీలో టెలికాస్ట్ అయిన క్రైమ్ సీరియల్ ఏదంటే?
Crime Patrol Serial: క్రైమ్ పెట్రోల్ సీరియల్ సోనీ మాక్స్ ఛానెల్‌లో 21 ఏళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. అత్యధిక కాలం పాటు టెలికాస్ట్ అయిన క్రైమ్ సీరియల్‌లో రికార్డ్ నెలకొల్పింది. 2003లో ప్రారంభమైన సీరియల్ 2024లో ముగిసింది.
Crime Patrol Serial: బుల్లితెరపై ఓ టీవీ సీరియల్ సక్సెస్ అయితే దానికి కొనసాగింపుగా రెండో, మూడో సీజన్స్ రావడం కామన్‌గా మారింది. మహా అయితే మూడు నుంచి నాలుగు సీజన్స్ తో పదేళ్ల వరకు ఆ సీరియల్ సాగదీయవచ్చు. కానీ ఇరవై ఒక్క ఏళ్లు హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌తో ఓ సీరియల్ టెలికాస్ట్ కావడం అంటే అంత ఈజీ కాదు.ఈ రికార్డ్‌ను క్రైమ్ పెట్రోల్ సీరియల్ నెలకొల్పింది. ఇండియన్స్ సీరియల్స్ అత్యధిక కాలం పాటు టెలికాస్ట్ అయిన క్రైమ్ సీరియల్ గా నిలిచింది.
2003లో ఫస్ట్ ఎపిసోడ్...
క్రైమ్ పెట్రోల్ టీవీ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ మే 9 2003లో సోనీ టీవీ టెలికాస్ట్ అయ్యింది. 19 జనవరి 2024 నాడు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌తో ఈ సీరియల్ ముగిసినట్లు మేకర్స్ ప్రకటించారు. 21 ఏళ్ల పాటు సోనీ మ్యాక్స్‌లో క్రైమ్ పెట్రోల్ టీవీ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. మొత్తం ఏడు సీజన్స్‌లో 2032 ఎపిసోడ్స్ ఇప్పటివరకు రిలీజయ్యాయి. క్రైమ్ పెట్రోల్‌లోని ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి నలభై నిమిషాల వరకు ఉండటం గమనార్హం.
ఏడు సీజన్స్...
2003 నుంచి 2006 వరకు క్రైమ్ పెట్రోల్ ఫస్ట్ సీజన్‌ను టెలికాస్ట్ చేశారు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో వరుసగా ఏడు సీజన్స్ వరకు మేకర్స్ ఈ సీరియల్‌ను నడిపించుకుంటూ వెళ్తారు. ఇందులో నాలుగు సీజన్ ఏడేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. ఐదు సీజన్స్ వరకు ఇంట్రెస్టింగ్‌గా మేకర్స్ ఈ సీరియల్‌ను నడిపించారు. ఆరో సీజన్ నుంచి క్రైమ్ పెట్రోల్ షో పాపులారిటీ పడిపోయింది. ఆరుతో పాటు ఏడో సీజన్‌కు డిజాస్టర్ టీఆర్‌పీ రేటింగ్స్ రావడంతో క్రైమ్ పెట్రోల్‌ను నిలిపివేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రణవీర్ సింగ్ గెస్ట్...
క్రైమ్ పెట్రోల్ సీరియల్‌కు సుబ్రమణియన్ ఎస్ అయ్యర్ క్రియేటర్‌గా వ్యవహరిస్తూనే దర్శన్‌రాజ్‌తో కలిసి దర్శకత్వం వహించారు. రియల్‌గా జరిగిన క్రైమ్ నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సీరియల్‌ను తెరకెక్కించారు. ఈ సీరియల్‌లో దివాకర్ పందిర్, శక్తి ఆనంద్, సాక్షి తన్వర్, అనూస్ సోనీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సీరియల్‌లో బాలీవుడ్ అగ్ర రణ్‌వీర్‌సింగ్‌తో పాటు జాహీ చావ్లా గెస్ట్ పాత్రల్లో కనిపించారు.
వివాదాలు ఎక్కువే...
క్రైమ్ పెట్రోల్ సీరియల్ టీఆర్‌పీ రేటింగ్‌లలో అదరగొట్టడమే కాకుండా కొన్నిసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, శ్రద్ధావాకర్ మర్డర్ కేసుతో పాటు మరికొన్ని ఎపిసోడ్స్ వివాదాస్సదమయ్యాయి. ఈ ఎపిసోడ్స్‌ను పూర్తిగా టెలికాస్ట్ కాకుండానే మధ్యలోనే ఆపేశారు. కొన్నింటిలో నిజాలను వక్రీకరించారంటూ విమర్శలొచ్చాయి. సీఐడీ సీరియల్ స్ఫూర్తితో క్రైమ్ పెట్రోల్ ప్రారంభమైంది. సీఐడీ సీరియల్ 1998లో మొదలై 2018లో ముగిసింది. ఇరవై ఏళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది.