Like Share Subscribe movie review: ఈ కామెడీ ట్రావెల్ సినిమా లైక్ చేసేలా ఉందా? నవ్వులను షేర్ చేసిందా?
Like Share Subscribe movie review: నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ లైక్, షేర్ అండ్ సబ్‍స్క్రైబ్ సినిమా అనుకున్న స్థాయిలో అలరించిందా.. నవ్వులు పండించిందా ఈ రివ్యూలో చూడండి.
Like, Share & Subscribe Movie Review:
ట్రెండింగ్ వార్తలు
సినిమా: లైక్, షేర్ & సబ్‍స్క్రైబ్
ప్రధాన నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రాహ్మజీ, సుదర్శన్, మైమ్ గోపీ
సినిమాటోగ్రఫీ: ఏ.వసంత్
సంగీత దర్శకులు: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల
ఎడిటర్: రాము
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
కథ, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
కామెడీ ప్రధానంగా ఉండే కథలతో, కాస్త విభిన్నమైన కథనంతో డైరెక్టర్ మేర్లపాక గాంధీ మంచి పేరుతెచ్చుకున్నాడు. కెరీర్‍లో మోస్తరు హిట్‍లతో ముందుకుసాగుతున్నాడు. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‍లో మంచి క్రేజ్ సంపాదించిన సంతోష్ శోభన్ హీరోగా లైక్, షేర్, & సబ్‍స్క్రైబ్ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. ట్రైలర్ కూడా కొత్తగా అనిపిస్తూ ఆకర్షించింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఈ సినిమాకు మరో ఆకర్షణ. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
Like, Share & Subscribe Movie story: కథ ఇదీ
గువ్వ విహారి పేరుతో యూట్యూబ్‍లో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తుంటాడు హీరో విప్లవ్ (సంతోష్ శోభన్). ఈ క్రమంలో జాక్ డానియెల్స్ (సుదర్శన్)తో కలిసి షూటింగ్ చేసేందుకు అరకుకు వెళతాడు. తన ఛానెల్‍కు సబ్‍స్క్రైబర్లను పెంచుకునేందుకు నానాపాట్లు పడుతుంటాడు విప్లవ్. అప్పటికే ఎంతో ఫేమస్ ట్రావెల్ వ్లాగర్ అయిన వసుధ వర్మ (ఫరియా అబ్దుల్లా) కూడా అరకు వస్తుంది. అక్కడ విప్లవ్, వసుధ ఇద్దరూ కలుస్తారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే నక్సల్స్ లాంటి పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పీపీఎఫ్) వల్ల విప్లవ్, వసుధ, సుదర్శన్ చిక్కుల్లో పడతారు. బ్రహ్మన్న (బ్రహ్మాజీ) కూడా చాలా కీలకంగా ఉంటాడు. అసలు విప్లవ్, వసుధ, సుదర్శన్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు? నక్సలైట్లతో వారికి సంబంధమేంటి? ఆ ముగ్గురు ఎలా బయట పడ్డారు? అన్న విషయాలు తెలియాలంటే లైక్, షేర్ అండ్ సబ్‍స్క్రైబ్ సినిమా చూడాల్సిందే.
Like, Share & Subscribe Movie screenplay: కథనం ఎలా సాగిందంటే..
ట్రావెల్ వ్లాగింగ్, నక్సలైట్స్ బ్యాక్‍డ్రాప్ అంశాలతో ఈ సినిమాను దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. గతంలో తీసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లాగానే స్క్రీన్ ప్లేను కాస్త డిఫరెంట్‍గా ప్రయత్నించాడు. ఫ్లాష్‍బ్లాక్, వర్తమానంతో కలిపి కథను హీరో నరేట్ చేస్తున్నట్టుగా సినిమాను నడిపించాడు మేర్లపాక. అయితే స్క్రీన్ ప్లే మాత్రం తన గత సినిమాల స్థాయిలో లేదు. కొన్నిచోట్ల పేలవంగా అనిపిస్తుంది. ఐడియా బాగానే ఉన్నా.. దాని చుట్టూ కథను సరిగా రాసుకోలేకపోయాడు. కొన్ని కామెడీ సీన్స్ బాగా పండాయి. డైలాగ్స్ పర్వాలేదనిపిస్తాయి.
ప్రథమార్ధంలో కొన్ని సీన్లు అలరిస్తాయి. పాటలు మాత్రం ఆకట్టుకోవు. ప్రధానమైన కథలోకి వెళ్లేందుకు సమయం పడుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్‍పై ఇంట్రెస్ట్ పెంచుతుంది. అయితే కిడ్నాప్, పీపీఎల్ గ్రూప్ అన్నీ కలగలిపి.. కథనం దారి తప్పుతుంది.
అయితే బ్రహ్మజీ పాత్రను మాత్రం దర్శకుడు బాగా రాసుకున్నాడు. అతడితో పండించిన కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఎంటర్‍టైన్‍మెంట్ కోసం కొన్ని సిల్లీ సీన్‍లను దర్శకుడు ఉంచడంతో ఎమోషన్ ఎక్కడా పండలేదు. చాలా చోట్ల సీరియస్‍నెస్ మిస్ అయింది. ప్రేక్షకులను దర్శకుడు ఎంగేజ్ చేయలేకపోయాడు. అయితే క్లీన్ కామెడీ ఈ మూవీకి ఓ ప్లస్‍గా ఉంది. క్లైమాక్స్ లోనూ పెద్ద సర్ ప్రైజ్ ఏమీ లేదు.
Like, Share & Subscribe Movie actors' performance: ఆకట్టుకున్న ఆ ముగ్గురు
లైక్, షేర్ & సబ్‍స్క్రైబ్ సినిమాకు హీరో సంతోశ్ శోభన్, ఫరియా అబ్దుల్లా బలంగా నిలిచారు. సంతోష్ నటన ఈ సినిమాలో గతం కంటే మెరుగ్గా ఉంది. లుక్స్ పరంగానూ ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ కూడా ఇంప్రూవ్ అయింది.
ఫరియా అబ్దుల్లా కూడా మంచి యాక్టింగ్‍తో పాటు అందంగా కనిపించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మాజీ గురించి. అమాయకత్వం కలగలిసిన పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ సీన్‍లను బాగా పండించాడు. బ్రహ్మాజీ పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది. బాగా నవ్విస్తుంది. సప్తగిరి కాసేపే మెరిగినా కాస్త నవ్వించాడు. మిగిలిన వారికి పెద్దగా స్కోప్ లేకపోయింది.
Like, Share & Subscribe Movie technical analysis: సాంకేతిక విభాగం
ఏ.వసంత్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‍గా నిలిచింది. అరకు అందాలను ఉన్నంతలో అతడు ఆకర్షణీయంగా చూపించాడు. అటవీ ప్రాంతాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో సఫలీకృతుడయ్యాడు. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఓకే అనిపించినా.. ఏవీ గుర్తు పెట్టుకునేలా లేవు. దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమాను గాడితప్పించాడు. స్క్రీన్‍ప్లే విషయంలో తడబడ్డాడు. ప్రేక్షకులను సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్‍లో ఎడిటర్ రాము తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది.
మొత్తంగా.. ఈ వీకెండ్‍లో క్లీన్ కామెడీ సినిమా చూడాలనుకునే వారు లైక్, షేర్ & సబ్‍స్క్రైబ్ ను ట్రై చేయవచ్చు. అయితే ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశ ఎదురవుతుంది.
మూవీ రేటింగ్ : 2/5
టాపిక్