Leonardo DiCaprio | అమ్మమ్మ దేశానికి.. ఆర్థిక సాయాన్ని ప్రకటించిన టైటానిక్ హీరో-leonardo dicaprio donates 10 million dollars to ukraine ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Leonardo Dicaprio | అమ్మమ్మ దేశానికి.. ఆర్థిక సాయాన్ని ప్రకటించిన టైటానిక్ హీరో

Leonardo DiCaprio | అమ్మమ్మ దేశానికి.. ఆర్థిక సాయాన్ని ప్రకటించిన టైటానిక్ హీరో

Maragani Govardhan HT Telugu
Mar 08, 2022 08:04 PM IST

తన అమ్మమ్మ దేశమైన ఉక్రెయిన్‌తు భారీ విరాళాన్ని ప్రకటించాడు లియోనార్డో డికాప్రియో. 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు స్పష్టం చేశాడు ఈ టైటానిక్ హీరో. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతున్నారు.

<p>లియనార్డో డికాప్రియో&nbsp;</p>
లియనార్డో డికాప్రియో (REUTERS)

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొరుగుదేశాలకు వలస పోతున్నారు. ఆకలి కేకలు నలుమూలలా వినిపిస్తున్నాయి. వీరిని ఆదుకునేందుకు హాలీవుడ్ ప్రముఖులు ఒక్కక్కరిగా ముందుకొస్తున్నారు. కొంతమంది వ్యక్తిగత కారణాలతో ముందుకు వస్తుంటే.. మరికొంతమంది తమ తాత, ముత్తాతల మాలాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయని ఆ దేశానికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టైటానిక్ హీరో లియనార్డో డికాప్రియో కూడా చేరిపోయారు. ఉక్రెయిన్‌కు మద్ధతుగా 10 మిలియన్ల అమెరికన్ డాలర్లు(దాదాపు రూ.77 కోట్లు) విరాళంగా ప్రకటించాడు.

లియనార్డో డికాప్రియో అమ్మమ్మ హెలెనే ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లో 1917లో జన్మించారు. అనంతరం జర్మనీకి వలస వచ్చారు. ఆమె కుమార్తే(డికాప్రియో తల్లి) అక్కడ జన్మించారు. డికాప్రియోకు తన అమ్మమ్మతో అనుబంధం ఎక్కువ. చిన్నతనంలో ఆమె వద్దే ఎక్కువగా పెరిగారు. అంతేకాకుండా అతడి సినీ కెరీర్ బిగినింగ్‌లో ఆమె ఎంతగానో మద్దతు ఇచ్చారు. సినిమాల్లో మనువడు, మనుమరాలు ఇద్దరి విజయాలను చూసిన హెలెనే 93 ఏళ్ల వయస్సులో 2008లో మరణించారు.

తాజాగా ఉక్రెయిన్‌కు మద్దతుగా 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు లియో. ఈ సాయాన్ని ప్రత్యక్షంగా చేయకుండా అంతర్జాతీయ సమాజానికి ఆర్థిక సహాయాన్ని అందించే వైస్ గ్రాడ్ గ్రూప్ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్నాడు.

ఆరు సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఈ హీరో రెవనెంట్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నాడు. నటనతో పాటు పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యత నిర్వహ్తిస్తున్నాడు. పర్యావరణ శాస్త్రవేత్త(Ecologist)గా కాలమ్స్‌ కూడా రాస్తున్నాడు.

వాతావరణ విపత్తును ఎదుర్కునే కార్యక్రమాల్లో లియనార్డో పాల్గొంటూ సమాజానికి తన వంతు సందేశాన్ని ఇస్తున్నాడు. 1998లో 25 ఏళ్ల వయస్సులో కుటుంబంతో కలిసి తన పేరుతో లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్‌ను స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధికి మద్దతు ఇచ్చాడు.

ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటీ, నటులు ఉక్రెయిన్‌కు బాహాటంగానే మద్దతు పలుకుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ దిగ్గజం రాబర్ట్ డినీరో రష్యా దురాక్రమణను ఖండించారు. ర్యాన్ రీనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ లాంటి హీరోలు నిధుల సేకరణలో పాల్గొన్నారు. విరాళాలను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఇక సొంత దేశమైన ఉక్రెయిన్ సంక్షోభాన్ని చూసి నటి మిలా జోలావిచ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్, రష్యన్ రెండు దేశాల మూలాలున్న ఈ హీరోయిన్ రెండు రకాలుగా నలిగిపోతున్నానని వీడియోను పోస్ట్ చేసింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా 3 మిలియన్ డాలర్లను ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.

Whats_app_banner