Akshay Kumar: నాలుగేళ్లలో 12 ఫ్లాపులు - అయినా సెట్స్‌పై పది సినిమాలు - అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డ్ వేరే లెవల్
Akshay Kumar: గత నాలుగేళ్లలో అక్షయ్ కుమార్ నటించిన 12 సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినా పది సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో బిజీయోస్ట్ హీరోగా అక్షయ్ కొనసాగుతోన్నాడు
Akshay Kumar: ఇండస్ట్రీలో ఫ్లాపుల్లో ఉన్న హీరోకు అవకాశాలు రావడం కష్టమని చెబుతుంటారు. ఓ హీరోకు వరుసగా మూడు, నాలుగు ఫ్లాపులొస్తే అతడి నెక్స్ట్ మూవీ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అతడితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా వెనకడుగు వేస్తుంటారు. కానీ బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది.
నాలుగేళ్లలో 14 సినిమాలు...
2020 నుంచి 2024 వరకు నాలుగేళ్లలో అక్షయ్ కుమార్ 14 సినిమాలు చేశాడు. అందులో పన్నెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. నిర్మాతలకు వందల కోట్లలో నష్టాలను మిగిల్చాయి. అయినా అక్షయ్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతోన్నారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తోన్న ఎనిమిది సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.
మరో రెండు సినిమాలకు అక్షయ్ కుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాల షూటింగ్ మొదలుకాబోతోంది. అతడి ట్రాక్ రికార్డ్ బాలీవుడ్ సినీ వర్గాలను విస్మయపరుస్తోంది. అక్షయ్‌ని ఫ్లాపులు ఏం చేయలేవంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
2019లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లు...
2019 వరకు తిరుగులేని విజయాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎదురులేని హీరోగా అక్షయ్‌కుమార్ నిలిచాడు. 2019లో అతడు నటించిన గుడ్‌న్యూస్, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4 సినిమాలు కలిసి ఏడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి.
2020 నుంచి బ్యాడ్‌టైమ్...
2020లో వచ్చిన లక్ష్మి నుంచి అక్షయ్ కుమార్ బ్యాడ్‌టైమ్ స్టార్టయింది. తమిళంలో విజయవంతమైన కాంచన రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత వచ్చిన బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా భందన్, రామ్‌సేతు, సెల్ఫీతో పాటు పలు సినిమాలు వరుసగా డిజాస్టర్స్‌గా నిలిచాయి.
పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ నాలుగేళ్లలో ఓ మై గాడ్ ఒక్కటే బ్లాక్‌బస్టర్‌గా నిలవగా అట్‌రంగీరే, సూర్యవన్షీ హిట్స్ అనిపించుకున్నాయి. ఇటీవల రిలీజైన భడే మియా ఛోటా మియా కూడా ఈ ఫెయిల్యూర్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది.
పది సినిమాలు సెట్స్...
12 ఫెయిల్యూర్స్ ఎదురైన బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ క్రేజ్, జోరుకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం పది సినిమాల్లో నటిస్తూ అక్షయ్ కుమార్ బిజీగా ఉన్నాడు. సింగం అగైన్, స్కై ఫోర్స్, వెల్‌కమ్ టూ ది జంగిల్, శంకర, ఖేల్ ఖేల్ మే తో పటు మరో ఐదు సినిమాల్లో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ ఏడాది సర్ఫారితో పాటు స్కైఫోర్స్, సింగం అగైన్‌తో పాటు మరో రెండు సినిమాలనుప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అక్షయ్ ప్లాన్ చేస్తున్నాడు.
తొలిరోజు పదిహేను కోట్లు...
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన భడే మియా ఛోటా మియా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద 15.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించాడు. యాక్షన్ సన్నివేశాలు మినహా ఈ సినిమా కథ , కథనాల్లో కొత్తదనం లేదంటూ అభిమానులు విమర్శిస్తోన్నారు.