కొంతకాలంగా తమిళ స్టార్ హీరో విశాల్ అనారోగ్యంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన హెల్త్ సరిగ్గా లేదని తెలిసిందే. తాజాగా విశాల్ స్టేజీపైనే కుప్పకూలడం కలకలం రేపింది. తమిళనాడులో ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయిన ఈ హీరో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై తాజా అప్‌డేట్ వచ్చింది.
విల్లుపురంలోని కూవగం కూతాండవర్ టెంపుల్ ఫెస్టివల్ సందర్భంగా సౌత్ ఇండియా ట్రాన్స్జెండర్ ఫెడరేషన్ తరఫున ఈవెంట్ నిర్వహించారు. విల్లుపురంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ గ్రౌండ్లో మిస్ ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది.ఈ కార్యక్రమంలో నటుడు విశాల్, మాజీ మంత్రి పొన్ముడి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
వేదికపై మాట్లాడి ఫోటోలు తీస్తున్న సమయంలో విశాల్ అకస్మాత్తుగా స్పృహతప్పి కింద పడిపోయారు. దీంతో షాక్ కు గురైన మాజీ మంత్రి పొన్ముడి తదితరులు నటుడు విశాల్ ను కారులో ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఈవెంట్ లో విశాల్ స్పృహతప్పి పడిపోవడంపై ఆయన మేనేజర్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. ఆదివారం (మే12) మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. భోజనం చేయకపోవడంతో నీరసంతో విశాల్ స్పృహతప్పి పడిపోయారన్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారని, ప్రస్తుతం విశాల్ బాగానే ఉన్నారని వెల్లడించారు. టైమ్ కు ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పారని మేనేజర్ పేర్కొన్నారు.
స్టేజీపై కుప్పకూలిన తర్వాత విశాల్ దాదాపు గంట పాటు విశ్రాంతి తీసుకున్నారని, తిరిగి ఈవెంట్ కు హాజరయ్యారని తమిళ మీడియా పేర్కొంది.
వివిధ కారణాల వల్ల దాదాపు 12 ఏళ్ల పాటు ఆగిపోయిన విశాల్ నటించిన మధగజరాజా మూవీ జనవరిలో విడుదలై ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ సినిమా ప్రమోషన్లలో విశాల్ చాలా వీక్ గా కనిపించారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
అప్పుడు ఆ సినిమా కార్యక్రమానికి హాజరైన నటుడు విశాల్ వణుకుతున్న చేతులతో, అనారోగ్యంతో స్టేజ్ పై మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచే విశాల్ హెల్త్ పై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆయన స్టేజీపైనే కుప్పకూలడంతో విశాల్ కు ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సంబంధిత కథనం