Lambasingi OTT Release Date: లంబసింగి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Lambasingi OTT Release Date: బిగ్ బాస్ ఫేమ్ దివి నక్సలైట్ గా నటించిన లంబసింగి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Lambasingi OTT Release Date: దివి, భరత్ రాజ్ నటించిన లంబసింగి మూవీ 20 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు ఆదరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లంబసింగి స్ట్రీమింగ్ కానుంది.
లంబసింగి ఓటీటీ రిలీజ్ డేట్
బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి దివి, భరత్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించిన లంబసింగి మూవీ ఏప్రిల్ 2 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలోకి వస్తోంది. లంబసింగి ఈ ప్యూర్ లవ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్ తో ఈ నెలలోనే థియేటర్లోకి వచ్చింది. నవీన్ గాంధీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ నక్సలైట్ కూతురు మధ్య ప్రేమకథే ఈ లంబసింగి మూవీ.
గ్లామర్ పాత్రలే కాదు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనూ తాను ఒదిగిపోగలనని ఈ సినిమా ద్వారా దివి నిరూపించింది. లంబసింగి మూవీ మొత్తం దివి పాత్ర చుట్టే తిరుగుతుంది. ఓ నక్సలైట్ కూతురు, నర్సు అయిన హరిత పాత్రలో దివి ఈ సినిమాలో నటించింది. ఆమె కోసమే ఈ మూవీ చూడొచ్చంటూ లంబసింగి రిలీజైన సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
లంబసింగి స్టోరీ ఏంటంటే?
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ మూవీస్ ఎక్కువగా వచ్చాయి. ఈ సీరియస్ ఇష్యూను కమర్షియల్ కోణంలో చెప్పే సాహసాన్ని దర్శకులు ఎక్కువ చేయలేకపోయారు. లంబసింగితో దర్శకుడు నవీన్ గాంధీ ఆ రిస్క్ చేశారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కు స్వచ్ఛమైన ప్రేమకథను జోడించి లంబసింగి సినిమాను తెరకెక్కించాడు. ఓ లేడీ నక్సలైట్‌తో ప్రేమలో పడిన కానిస్టేబుల్ పాయింట్‌తో ఈ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్‌ను కన్వీన్సింగ్‌గా చెప్పడంలో కొంత వరకు డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
కానిస్టేబుల్ అయిన వీరబాబు ప్రేమకు నో చెప్పే హరిత.. అతడు పని చేసే పోలీస్ స్టేషన్ పైనే ఇతర నక్సలైట్లతో కలిసి దాడి చేస్తుంది. అందులో హరిత ఉండటం చూసి ఆమె నర్సు కాదు నక్సలైట్ అని అతడు తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతడు ఏం చేశాడు? వీరబాబు ప్రేమను హరిత అర్థం చేసుకుందా? హరితను దళం సభ్యులు ఎందుకు అనుమానించారు? వీరబాబు ప్రేమ కోసం ఆమె ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది? అన్నదే లంబసింగి కథ.
లంబసింగి అందాలను జతచేస్తూ లవ్ స్టోరీని ఆహ్లాదభరితంగా నడిపించారు. హరిత క్యారెక్టర్ సంబంధించి వచ్చే ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండాఫ్‌లో తన ప్రేమను దక్కించుకోవడానికి వీరబాబు చేసే ప్రయత్నాలు చుట్టూ నడుస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది. రొటీన్ లవ్ స్టోరీస్‌కు భిన్నంగా విషాదాంతంగా ఎండ్ చేశారు.