Lal Salaam FDFS: రజనీకాంత్‌కు షాక్.. తెలుగులో లాల్ సలామ్ మార్నింగ్ షోలు రద్దు.. ఇదీ కారణం
Lal Salaam FDFS: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు ప్రేక్షకులు షాకిచ్చారు. అతడు నటించిన లాల్ సలామ్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కాగా.. పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో చాలా వరకూ మార్నింగ్ షోలు రద్దయ్యాయి.
Lal Salaam FDFS: రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది జైలర్ మూవీతో సూపర్ స్టార్ మళ్లీ గాడిలో పడటంతో ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం ముందు నుంచీ ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకపోగా.. తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
లాల్ సలామ్.. నో బజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాను తమిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం మేకర్స్ ఎలాంటి ప్రమోషన్లు నిర్వహించలేదు. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. హైదరాబాద్ లో ఏఎంబీ, ఏఏఏ, జీపీఆర్ లాంటి మల్టీప్లెక్స్ లకు వెళ్లి లాల్ సలామ్ చూద్దామనుకున్న కొందరు అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఆన్‌లైన్ లో ఇప్పటికే కొంత మంది బుక్ చేసుకోగా.. వాటిని కూడా క్యాన్సిల్ చేసి వాళ్లకు డబ్బులు రీఫండ్ చేస్తుండటం గమనార్హం. ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఉండటంతో మిగిలిన షోల సంగతేంటన్నది అర్థం కావడం లేదు. తెలుగులో యాత్ర 2, ఈగల్ సినిమాలు ఈ లాల్ సలామ్ కు పోటీగా రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా లాల్ సలామ్ ను దెబ్బకొట్టాయని చెప్పొచ్చు.
జైలర్ అలా.. లాల్ సలామ్ ఇలా..
అయితే ఇది మాత్రం నిజంగా ఊహించని పరిణామమే. రజనీకాంత్ తమిళంలో సూపర్ స్టార్ అయినా తెలుగులోనూ అతని సినిమాలను బాగా ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ ఇక్కడ కూడా మంచి వసూళ్లే సాధించింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించి ఆశ్చర్యపరిచింది.
కానీ లాల్ సలామ్ కు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం షాక్‌కు గురి చేసింది. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటించగా.. రజనీ అతిథి పాత్రలో కనిపించాడు. ముంబై అండర్ వరల్డ్ డాన్ మొయిద్దీన్ భాయ్ గా రజనీ నటించాడు. రెండు గ్రామాల మధ్య రేగిన మత ఘర్షణలను ఓ క్రికెట్ టోర్నీ ద్వారా రజనీ ఎలా పరిష్కరించాడన్నది ఈ సినిమా స్టోరీగా కనిపిస్తోంది.
కూతురికి రజనీ బెస్ట్ విషెస్
మరోవైపు లాల్ సలామ్ మూవీ రిలీజైన రోజే తన కూతురు, ఈ మూవీ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ కు ఎక్స్ ద్వారా రజనీ బెస్ట్ విషెస్ చెప్పాడు. "నా ప్రియమైన తల్లి ఐశ్వర్యకు నమస్కారం. నీ సినిమా లాల్ సలామ్ ఘన విజయం సాధించాలని ఆ సర్వ శక్తిమంతుడైన దేవుడిని వేడుకుంటున్నాను" అని రజనీ తమిళంలో ట్వీట్ చేశాడు.
ఈ లాల్ సలామ్ మూవీ కోసం రజనీ కాంత్ ఏకంగా రూ.40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సినిమాలో 40 నిమిషాలు కనిపించిన అతడు.. నిమిషానికి రూ.కోటి వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
టాపిక్