Vishnu Vishal: సాదాసీదా సినిమాల్లో నేను నటించను: హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో తమిళ నటుడి బోల్డ్ స్టేట్‌మెంట్
Vishnu Vishal: లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ నటుడు విష్ణు విశాల్ తాను సాదాసీదా సినిమాల్లో నటించనని ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.
Vishnu Vishal: తమిళ నటుడు విష్ణు విశాల్ ఏదో సాదాసీదాగా నడిచే సినిమాల్లో నటించడట. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. లాల్ సలామ్ మూవీ రిలీజ్ కు ముందు హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడిన ఈ నటుడు.. తాను ఎప్పుడూ ఓ మంచి సినిమాలోనే నటించాలని అనుకుంటానని స్పష్టం చేశాడు.
లాల్ సలామ్ మూవీలో కూడా ఏదో రజనీకాంత్ నటిస్తున్నాడని కాకుండా.. తాను పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాతే అంగీకరించినట్లు అతడు చెప్పడం విశేషం.
రజనీకాంత్‌తో పని చేయడంపై..
సూపర్ స్టార్ రజనీకాంత్ తో పని చేయడం తన కల నిజం కావడం లాంటిదని విష్ణు విశాల్ అన్నాడు. లాల్ సలామ్ మూవీలో అతనితోపాటు విక్రాంత్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక రజనీ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ మూవీ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ తనకు ఐదు గంటల పాటు స్టోరీని నెరేట్ చేసిన తర్వాతే మూవీకి అంగీకరించినట్లు అతడు చెప్పాడు. మొదట ఆమె స్క్రిప్ట్ ను ఏదో బ్రీఫ్ గా చెప్పినా.. రజనీ సర్ సంతకం చేసిన తర్వాత తాను కూడా స్క్రిప్ట్ పూర్తిగా వినాలని భావించినట్లు తెలిపాడు.
సాదాసీదా సినిమా చేయను
ఇక తాను ఎప్పుడూ మంచి సినిమాలే చేయాలని అనుకుంటానని, ఏదో సాదాసీదా సినిమా చేయబోనని విష్ణు విశాల్ స్పష్టం చేశాడు. ఓ సినిమాకు బిజినెస్ కూడా ముఖ్యమని, 80 శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతుంటాయని అతడు చెప్పాడు. అంతేకాదు తాను ఎప్పుడూ సైడ్ క్యారెక్టర్ పాత్రలకు అంగీకరించని, హీరో పాత్రలే చేయాలని అనుకుంటానని కూడా తెలిపాడు. ఎంతో మంది పెద్ద హీరోలు నటించే సినిమాల్లో ఇలాంటి అవకాశాలు వచ్చినా తాను నో చెప్పినట్లు విష్ణు విశాల్ వెల్లడించాడు. తన సినిమాల్లో 72 శాతం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయినట్లు కూడా అతడు చెప్పాడు.
లాల్ సలామ్ మూవీపై..
లాల్ సలామ్ మూవీ తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏమీ కాదని తాను అన్నట్లుగా వస్తున్న వార్తలను విష్ణు విశాల్ ఖండించాడు. ఈ సినిమాలో తాను హీరో కాదని, రజనీ సర్ పాత్ర కీలకమని అతడు చెప్పాడు. తాను ప్రతి సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తానని, గతేడాది వచ్చిన గట్టు కుస్తీ మూవీ తన నటన, డ్యాన్స్, ఫైట్స్ వల్లే అంత పెద్ద సక్సెస్ అయిందని అన్నాడు. లాల్ సలామ్ మూవీ ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ సత్తా ఏంటో చూపిస్తుందని, ఈ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని అతడు తెలిపాడు.
రాజకీయాల్లోకి వస్తాడా?
ఈ మధ్యే దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు కదా.. మీకు కూడా ఆ ఆలోచన ఉందా అని అడిగితే.. తనకు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. తన ఫ్రెండ్ ఉదయనిధి స్టాలిన్, అతని తండ్రి, తమిళనాడు సీఎం స్టాలిన్ ఎలా పని చేస్తారో తాను చూశానని, వాళ్ల జీవితం మొత్తం ప్రజలకు అంకితం అన్నట్లుగా వాళ్లు వ్యవహరిస్తారని, అది చాలా కష్టమని అన్నాడు. ఇక రాజకీయాలపై తనకు అసలు అవగాహన లేదని కూడా ఈ సందర్భంగా విష్ణు విశాల్ తెలిపాడు.
టాపిక్