Laapata Ladies OTT: లాపతా లేడీస్ మూవీకి రివ్యూ ఇచ్చిన ఆలియా భట్.. ఏమన్నారంటే..
Alia Bhatt - Laapata Ladies OTT: లాపతా లేడీస్ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ స్పందించారు. ఈ సినిమాపై తన రివ్యూను వెల్లడించారు. ఈ చిత్రంపై ఆమె ఏమన్నారో ఇక్కడ చూడండి.
Laapata Ladies OTT: లాపతా లేడీస్ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శలకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఈ మూవీకి సూపర్ మంచి స్పందన వచ్చింది. రూ.4కోట్లలోపు బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ మూవీకి రూ.20 కోట్ల వసూళ్లు వచ్చాయి. లాతపతా లేడీస్ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. లాపతా లేడీస్ చిత్రం ఇటీవలే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ మూవీపై స్పందించారు.
అద్భుతంగా.. అందంగా..
లాపతా లేడీస్ సినిమా ఏప్రిల్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలో చూసిన వారి నుంచి ఈ చిత్రానికి చాలా మంచి స్పందన వస్తోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఆ జాబితాలో చేరారు. లాపతా లేడీస్ చిత్రం తనకు బాగా నచ్చిందంటూ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు.
లాపతా లేడీస్ సినిమా చాలా బ్యూటిఫుల్‍గా ఉందని, నటీనటులు అద్భుతంగా చేశారని ఆలియా భట్ ప్రశంసించారు. సినిమాల్లో చాలా అందమైన సమయం గడిపానని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించి ప్రతిభ రత్న, స్పర్శ్ శ్రీవాత్సవ, రవికిషన్, నితాషీ గోయెల్‍ను అభినందించారు. వారు తన మనసులో నిలిచిపోయారని ఆలియా భట్ రాసుకొచ్చారు. “కిరణ్ రావ్ (డైరెక్టర్).. చాలా అందమైన సినిమా. నటీనటుల నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్. అందరికీ అభినందనలు” అని ఆలియా భట్ రాశారు.
సన్నీ డియోల్ కూడా..
బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ కూడా లాపతా లేడీస్ చిత్రంపై స్పందించారు. తాను తాజాగా ఈ మూవీని చూశానని తెలిపారు. హృదయాన్ని, అమాయమైన చిత్రాన్ని చూసి చాలా కాలమైందని ఆయన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశారు. ఈ అద్బుతమైన సినిమాను అందరూ చూడాలంటూ రెకమెండ్ చేశారు.
లాపతా లేడీస్ చిత్రంలో నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ, ప్రతిభ రత్న, ఛాయా కదం, రవికిషన్‍తో పాటు గీతా అగర్వాల్, సతేంద్ర సోనీ, అబీర్ జైన్, దవూద్ హుసేన్, దుర్గేశ్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతీ దేశ్‍పాండే ఈ మూవీని నిర్మించారు. కామెడీతో పాటు సామాజిక అంశాలతో మెప్పించే విధంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కిరణ్ రావ్ తెరకెక్కించారు. ఈ మూవీకి రాం సంపత్ సంగీతం అందించారు.
లాపతా లేడీస్ స్టోరీ బ్యాక్‍డ్రాప్
2001లో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో లాపతా లేడీస్ మూవీ సాగుతుంది. కొత్తగా పెళ్లయిన రెండు జంటల్లో.. ఒకరి భార్య ఒకరికి మారుపోతారు. ఈ అంశం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. దీపక్ కుమార్ (స్పర్శ్ శ్రీవాత్సవ), ఫూల్ (నితాన్షి గోయల్)కు వివాహం అవుతుంది. ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ రైలు ఎక్కుతారు. వేరే జంటల పక్కన దీపక్, ఫూల్ కూర్చుంటారు. అయితే, అక్కడ కొత్తగా పెళ్లయిన వధువులకు కూడా ముఖానికి ముసుగు ఉంటుంది. దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు. అయితే, రైలు దిగే ముందు తొందరలో తన భార్య కాకుండా వేరే వధువు పుష్ప రాణి (ప్రతిభ రత్న) చేయి పట్టుకొని రైలు దిగేస్తాడు దీపక్. ఇంటికి వెళ్లాక వధువు మారిందని అతడు, బంధువులు గుర్తిస్తారు. దీంతో తప్పిపోయిన తన భార్య ఫూల్ కోసం దీపక్ వెతుకుతాడు. మరి అతడికి పూల్ మళ్లీ దొరికిందా.. ఎదురైన పరిస్థితులు ఏవనేదే లాపతా లేడీస్ మూవీలో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. ఎంటర్‌టైన్‍మెంట్‍తో పాటు సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా ఈ చిత్రంలో మేకర్స్ చూపించారు.