Kushboo Sundar: యానిమల్ మూవీ చూడొద్దని నా కూతుళ్లు చెప్పారు.. ఇలాంటి సినిమాలు హిట్ కావడమేంటో: ఖుష్బూ
Kushboo Sundar: సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ వంటి అశ్లీల చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడంపై నటి ఖుష్బూ సుందర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సినిమా చూడొద్దని తనకు తన కూతుళ్లు చెప్పారని ఆమె వెల్లడించింది.
Kushboo Sundar: నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల టీవీ9 నిర్వహించిన విట్: ఫిమేల్ హీరో - ది న్యూ హీరో సదస్సులో మాట్లాడారు. యానిమల్ వంటి సినిమాల విజయం గురించి అడిగినప్పుడు, తన కూతుళ్లు ఈ సినిమా చూడవద్దని హెచ్చరించారని ఆమె వెల్లడించింది.
నేను దర్శకుడిని నిందించను: ఖుష్బూ
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన.. రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్ నటించిన యానిమల్ సినిమాను తాను చూడలేదని ఖుష్బూ స్పష్టం చేశారు. అయితే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా వేధింపులు, వైవాహిక అత్యాచారం, ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో కేసులు చూశానని, అది చట్టవిరుద్ధమని, యానిమల్ లాంటి అశ్లీల చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందంటే, దాన్ని విజయవంతం చేసే వ్యక్తుల మనస్తత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే ఈ సినిమా తీసినందుకు సందీప్ ను నిందించడానికి ఖుష్బూ నిరాకరించింది. ఆ బాధ్యతను ఈ సినిమా చూసిన ప్రేక్షకులపై ఆమె మోపారు. 'కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో మాకు పెద్ద సమస్య వచ్చింది. కానీ నేను దర్శకుడిని నిందించను. ఎందుకంటే అతని వరకూ విజయమే ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. సమాజంలో ఏం జరుగుతుందో సినిమాల్లో చూపిస్తాం. మహిళల పట్ల గౌరవం గురించి మాట్లాడుతూనే.. ప్రజలు ఇలాంటి సినిమాలు చూస్తున్నారు.
మా అమ్మాయిలు సినిమా చూడాలని నేను కోరుకోను. కానీ అదేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు చూశారు. మూవీ నుంచి తిరిగి వచ్చి 'అమ్మ.. ప్లీజ్ సినిమా చూడొద్దు' అన్నారు. ఇలాంటి సినిమాలకు రిపీట్ ఆడియన్స్ ఉన్నప్పుడు మనం ఎటువైపు వెళ్తున్నామని ప్రశ్నించారు.
యానిమల్‌పై విమర్శలు
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న రిలీజైంది. తొలి రోజు నుంచే సినిమాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆడవాళ్లపై హింస, ఆల్ఫా మేల్ పాత్రను ఎక్కువ చేసి చూపించడం, అశ్లీలత, విపరీతమైన హింసలాంటి వాటిని మూవీ ప్రోత్సహించేలా ఉందని చాలా మంది ప్రముఖులు కూడా విమర్శించారు.
అయినా ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.900 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. అందులోనూ చాలా రోజుల పాటు సినిమా టాప్ ట్రెండింగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా.. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటంపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా ఖుష్బూ సుందర్ కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. గతంలో జావెద్ అక్తర్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. ఓ మహిళను తన బూట్లు నాకాల్సిందిగా చెప్పే హీరో పాత్రను ఏమనాలి? అలాంటి సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అన్న విమర్శలు యానిమల్ సినిమాపై ఉన్నాయి.