Krishna mukunda murari marchi 13th: ముకుంద కోసం మురారి, కృష్ణ వెతుకులాట.. అందరూ మోసం చేశారని బాధపడుతున్న ఆదర్శ్
Krishna mukunda murari serial marchi 13th episode: కృష్ణ చేసిన అవమానం తట్టుకోలేక ముకుంద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తనని ఎలాగైనా వెతికి ఇంటికి తీసుకొస్తామని కృష్ణ, మురారి వెళతారు. ఇక ఇంట్లో అందరూ తనని మోసం చేశారని ఆదర్శ్ బాధపడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Krishna mukunda murari serial marchi 13th episode: ఆదర్శ్ పట్టపగలు నట్టింట్లో మందు తాగుతాడు. రేవతి వచ్చి పొద్దున్నే ఏంటి ఇదని అడుగుతుంది. మధు వద్దని బతిమలాడుతున్నా కూడా వినిపించుకోడు. మురారి, కృష్ణ ముకుంద ఎక్కడ ఉందో తెలుసుకుని ఇంటికి తీసుకురావాలని అనుకుంటారు. ఇంట్లో ఆదర్శ్ చేస్తున్న పని చూసి మురారి ఆపుతాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా వినడు అంట తను చేసింది నచ్చకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతాడంట అని మధు చెప్తాడు. వీడికి మందు ఎక్కువైందని మురారి కోపంగా వెళ్లబోతుంటే కృష్ణ ఆపుతుంది. అప్పుడే రేవతికి భవానీ ఫోన్ చేస్తుంది. నేను మాట్లాడతాను ఇవ్వమని ఆదర్శ్ అంటాడు. ఏం మాట్లాడతావ్ తాగిన మత్తులో ఇక్కడ జరిగింది అంతా వాగేస్తావని ఆపుతుంది.
ముకుంద ఎప్పటికీ మారదు
సుమలత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంతా బాగానే ఉందా రేవతి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అడుగుతుంది. బాగుందని చెప్తుంది. మధు ఆదర్శ్ మాట్లాడకుండా నోరు మూస్తాడు. అక్క వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదని రేవతి టెన్షన్ పడుతుంది. మేము ముకుందని వెతుకుతాము తను ఎక్కడ ఉన్న తీసుకొస్తామని చెప్పి వెళ్లిపోతారు. ఇప్పుడు తనని ఎక్కడని వెతుకుదామని కృష్ణ అంటుంది. తన ఇంటికి వెళ్ళి ఉంటుంది లేదంటే ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్ళి అడుగుదామని మురారి చెప్తాడు. అసలు తను ఎందుకు ఇలా చేసింది ఎంత మంది ఆడపిల్లలు ప్రేమించిన వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న వాడితో సంతోషంగా ఉండటం లేదాని కృష్ణ అంటే ఈ విషయంలో ముకుంద మారదని మురారి అంటాడు.
నేను తప్పు చేశాను ఏమో బయటకి తీసుకొచ్చి చెయ్యి చేసుకోకుండా ఉండాల్సిందని కృష్ణ బాధపడుతుంది. ఇప్పుడు తనని ఇంటికి తీసుకెళ్తే ఆదర్శ్ అంగీకరిస్తాడా? అంటే ఏదో ఒకటి చేయాలని కృష్ణ అంటుంది. ఏం చేయాలి ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా? ముకుందని మార్చడం మన వల్ల కాదు వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం కూడా మన వల్ల కాదు. ఇప్పుడు ముకుందని వెతికేది కూడా తన కోసం కాదు నీకోసం. పెద్దమ్మ వెళ్తూ నీకు ఇంటి బాధ్యతలు అప్పగించింది. ముకుంద ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే నువ్వేం చేస్తున్నావని నిన్ను ప్రశ్నిస్తుంది, నువ్వు నిందలు పడటం నాకు ఇష్టం లేదు అందుకోసం వెతుకుతున్నా తప్ప వాళ్ళని కలపడం కోసం కాదని మురారి చెప్తాడు.
నువ్వు మోసగాడివి
వాళ్ళని కలపకపోతే మన జీవితంలో ఏదో లోటుగానే అనిపిస్తుందని కృష్ణ బాధపడుతుంది. నాకు వాళ్ళు కలవాలని ఉంది కానీ వాళ్ళని కలిపే క్రమంలో నువ్వు ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందోనని నాకు బాధగా ఉందని అంటాడు. మధు ఆదర్శ్ ని తాగొద్దని బతిమలాడుతూ ఉంటాడు. గుండెల్లో బాధ తగ్గడం లేదని చెప్తాడు. నువ్వు ఒక మోసగాడివని మధుని తిడతాడు. నీకు నేను ఎప్పుడు కనిపించినా తొండ గురించి చెప్పమని అడిగే వాడివి కదా అంటే అవును నువ్వు చెప్పలేదు కదా అంటే అసలు అక్కడ తొండ లేదని నీకు తెలుసు కదా తొండ మొహమోడా అని ఆరోజు జరిగింది చెప్తాడు. ముకుందకి నేనంటే ఇష్టం లేదనే అనుమానం నీకు ఉంది కదా. నాకు తెలుసు నువ్వు వాళ్ళలో ఒకడివే అందరూ కలిసి నన్ను మోసం చేశారని బాధపడతాడు.
ముకుందకి నేనంటే ఇష్టం లేదని ఈ ఇంట్లో అందరికీ తెలుసు కానీ నాకు చెప్పకుండా మోసం చేశారని అంటాడు. ఎవరూ మోసం చేయలేదని మధు కన్వీన్స్ చేస్తాడు. ముకుంద గురించి ఎవరికి తెలియదని అంటున్నారు ఇంక ఎక్కడికి వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తారు. తన గురించి చిన్న ఆచూకీ కూడా తెలియడం లేదు నాకెందుకో భయంగా ఉందని కృష్ణ టెన్షన్ పడుతుంది. ముకుందకి ఏం కాదు నీ ముందు నాముందే కాకుండా అందరి ముందు అవమానం జరిగింది కదా అందుకె మొహం చాటేసి ఉంటుంది. కానీ తను మాత్రం ఇంటిని వదిలి ఉండలేదని మురారి ధైర్యం చెప్తాడు. మురారి వాళ్ళు టీ తాగుతున్న దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి ఎవరో ఒక అమ్మాయి ట్రైన్ కి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకుందని మొహం కూడా గుర్తు పట్టలేనట్టుగా మారిందని అంటుంటాడు.
ముకుంద ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు
అది విని కృష్ణ కంగారుగా మనం వెళ్ళి చూద్దామని అంటుంది. ముకుంద ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మురారి ధైర్యంగా ఉంటాడు. ఆదర్శ్ గదిలో ముకుంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది. ముకుంద చెప్పకనే చెప్తూనే ఉంది కానీ వీళ్ళ మాటలు నమ్మి నేను పొరపాటు పడుతున్నా అనుకుని తప్పు చేశాను. అప్పుడే కళ్ళు తెరిచి ఉంటే ఇంత అవమానం బాధ ఉండేది కాదు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను ఏ తప్పు చేశానని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కబోర్డ్ లో ముకుంద చీరల మీద ఉన్న మురారి, ముకుంద ఫోటోస్ ఆదర్శ్ చూస్తాడు. కోపంగా వాటిని తగలబెట్టేస్తాడు.
మధు, రేవతి గదిలోకి వచ్చేసరికి ఫోటోస్ కాలిపోతూ ఉంటాయి. వాటిని మధు ఆపబోతుంటే అవి కాలిపోతే కానీ నా గుండెల్లో మంట చల్లారదని అంటాడు. మంటల్లో మురారి నవ్వుతున్న మొహం కనిపిస్తుంది.