krishna mukunda murari serial march 4th episode: దంపతులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి భర్త పాదాల మీద పాదాలు పెట్టి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని పంతులు చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. అలా చేస్తే దంపతులు కలకాలం కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారని అంటాడు. ఇలాంటివి చేస్తేనే ముకుందకి బుద్ధి వస్తుందని కృష్ణ అనుకుంటుంది. పూజ అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఇదేంటి అసలు ఆదర్శ్ గాలి తగలకూడదని అనుకుంటుంటే మళ్ళీ తనని హత్తుకుని ప్రదక్షిణలు చేయడమా? ఇదంతా మురారి ప్లాన్ కాదు కదా. ఇది అసలు జరగకూడదు ఏదో ఒకటి చేయాలని ముకుంద డిసైడ్ అవుతుంది.
గుడిలో ఇలాంటి ప్రదక్షిణలు చేస్తారా అని ముకుంద అనుమానంగా అడుగుతుంది. దంపతులు ఇద్దరిని దగ్గర చేసే యజ్ఞం లాంటిదని కృష్ణ అంటుంది. అసలు ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దని అంటారా? ముకుంద ఎందుకు వద్దని అంటుందో అర్థం కావడం లేదని మధు అంటాడు. నేనేం వద్దని అనలేదు ఒకరి పాదాల మీద నిలబడటం అంటే నొప్పులు పుడతాయి కదా అని ఆపడానికి చూస్తుంది. కానీ మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకని మురారి, ఆదర్శ్ రెడీ అంటారు. ఎక్కడ దించకుండా ప్రదక్షిణలు చేయలేరని నేను.. చివరి వరకు వదలకుండా ఏసీపీ సర్ పందెం కాసుకుంటున్నాం. ఏం ముకుంద పట్టుకోలేమా చివరి వరకని అడుగుతుంది. ఎందుకు పట్టుకోలేమని ముకుంద సమాధానం ఇస్తుంది.
కృష్ణ మురారి పాదాలు మీద పాదాలు పెడుతుంది. ముకుంద అతి కష్టంగా ఆదర్శ్ మీద చెయ్యి వేసేందుకు ఇబ్బంది పడుతుంది. పెళ్ళిలో చక్రపాదాలు తొక్కినట్టు సుకుమారంగా చేస్తున్నావ్ ఏంటి చాలా గట్టిగా పట్టుకోమని కృష్ణ చెప్తుంది. పరవాలేదు ఈ మాత్రం పాదాలు తగిలితే చాలని ముకుంద అంటుంది. కృష్ణ మాత్రం వదిలిపెట్టకుండా ముకుందని ఆదర్శ్ కి దగ్గరగా చేస్తుంది. మోసేది ఆదర్శ్ అయితే నువ్వు ఇంత బాధపడుతున్నావ్ ఏంటని మధు డౌట్ గా అడుగుతాడు. ఆదర్శ్ కి ఏం కాదు పాదాలు పెట్టమని కృష్ణ దగ్గరుండి మరీ ఎక్కించేస్తుంది. ఆదర్శ్ పట్టుకోకపోయే సరికి ముకుంద ఇబ్బంది పడటానికి నువ్వు మొహమాట పడటానికి సరిపోయింది తనని పట్టుకో అని మురారి కావాలని ఇరికించేస్తాడు. భుజాల మీద చెయ్యి వేసి తనని పట్టుకుంటే అక్కడ కాదు నడుము దగ్గర పట్టుకోమని మరింత ఇబ్బంది పెడతారు.
ఇదే జీవితమంటే సర్దుకుపోవాలని మురారి అంటాడు. ఇక రెండు జంటలు ప్రదక్షిణలు చేసేందుకు వెళతారు. మురారి జంట సంతోషంగా ప్రదక్షిణలు చేస్తారు. ముకుంద మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇంక నా వల్ల కాదు ఈ క్షణమే ఆదర్శ్ నన్ను వదిలేలా ఏదో ఒకటి చేయాలని ముకుంద ప్లాన్ చేస్తుంది. కావాలని తన చేతి గాజులు ముక్కలు చేసి ఆదర్శ్ పాదాలకు గుచ్చుకునేలా దారిలో వేస్తుంది. అవి గుచ్చుకోగానే ఆదర్శ్ తనని వదిలిపెడతాడు. మురారి వచ్చి తన కాలి గాయం చూస్తాడు. గాజులు ఇక్కడికి ఎలా వచ్చాయని కృష్ణ అంటే తన గాజులేనని ముకుంద చెప్తుంది. సారి ఆది ఇదంతా నావల్ల ఎక్కడ పడిపోతానో అనే భయంతో గట్టిగా పట్టుకునేసరికి గాజులు పగిలిపోయాయి ఇదంతా తన వల్లేనని నటిస్తుంది.
కావాలని ఏం చేయలేదు కదా పర్లేదులే అని ఆదర్శ్ అంటాడు. మురారి నువ్వు చెప్పింది నిజమే మీరు ఈజీగా మోయగలుగుతారు కానీ పట్టుకుని ఉండటమే కష్టం పందెంలో వాళ్ళే గెలిచారు నువ్వు ఒడిపోయావ్ సారి అంటుంది. తనకేమి కాలేదని ప్రదక్షిణలు కంటిన్యూ చేద్దామని ఆదర్శ్ అంటే వద్దని ముకుంద చెప్తుంది. నువ్వు బాధపడితే ముకుంద అసలు తట్టుకోలేదు వద్దులే, రెండు ప్రదక్షిణలు చేశాం కదాని మురారి అంటాడు. ముకుంద కావాలని చేసింది కదా కృష్ణ బాధపడుతుంది. గుడిలో కొంతమంది కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు. కోరికలు తీరాలని కోరుకుంటూ ఇలా కాయిన్స్ నిలబెడతారని కృష్ణ, రేవతి చెప్తారు. కాయిన్ నిలబడితే కోరిక తీరుతుంది, పడిపోతే కోరిక నెరవేరదని రేవతి చెప్తుంది. ఇప్పుడు ఇది చేసే ఓపిక ఎవరికి లేదు వెళ్లిపోదామని ఆదర్శ్ అంటే ముకుంద మాత్రం సంతోషంగా నేను చేస్తానని ఆపుతుంది.
కృష్ణ టెన్షన్ పడుతుంది. ఆది నువ్వు జాగ్రత్త మధు నువ్వు తనని వదలకని అంటుంది. కావాలని మురారిని కాయిన్ అడుగుతుంది. కృష్ణ వద్దని సైగ చేస్తుంది. నా కోరిక తీరబోతుందని ముకుంద సంతోషపడుతుంది. మురారి మనసు మారాలి తను నాకే సొంతం కావాలని ముకుంద కాయిన్ నిలబెట్టాలని అనుకుంటుంది. కృష్ణ కూడా కాయిన్ అడుగుతుంది. మన కోరిక ఏంటో తనకి తెలుసు కదా తన కోరిక నెరవేరదు మా కోరిక నెరవేరుతుందని రుజువు చేయాలని కృష్ణ అంటుంది.