Kovai Sarala: కమల్‌హాసన్ సరసన కోవై సరళ హీరోయిన్‌గా నటించిన కామెడీ మూవీ ఇదే - తెలుగులో పెద్ద హిట్
Kovai Sarala: కోలీవుడ్ కమెడియన్ కోవై సరళ హీరోయిన్‌గా కమల్‌హాసన్‌కు జోడీగా సతీలీలావతి అనే సినిమా చేసింది.ఈ కామెడీ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ పెద్ద హిట్టయింది.
Kovai Sarala: తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ కమెడియన్స్‌లో ఒకరిగా కొనసాగుతోంది కోవై సరళ. తెలుగులో . బ్రహ్మానందం, కోవైసరళ కాంబినేషన్‌కు స్పెషల్ క్రేజ్ ఉంది. పలు బ్లాక్‌బస్టర్ మూవీలో ఈ జోడీ తమ కామెడీతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
కమల్ మూవీలో హీరోయిన్...
కమెడియన్‌గానే కాకుండా కోవై సరళ హీరోయిన్‌గా తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. వాటిలో సతీలీలావతి ఒకటి. కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు బాలు మహేంద్ర దర్శకత్వం వహించాడు. హీరోగా నటిస్తూనే కమల్‌హాసన్ స్వయంగా సతీలీలావతి మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఇందులో కమల్‌హాసన్‌కు జోడీగా కోవై సరళ హీరోయిన్‌గా నటించింది.
రమేష్ అరవింద్, హీరా కీలక పాత్రలు పోషించారు. 1995లో మోస్తారు అంచనాలతో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కమల్‌హాసన్, కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ అభిమానులను అలరించాయి.
తెలుగులోనూ డబ్...
తెలుగులోనూ సతీలీలావతి పేరుతోనే ఈ మూవీని డబ్ చేయగా ఇక్కడ కూడా హిట్ టాక్‌ను తెచ్చుకున్నది. అభిప్రాయభేదాలతో విడిపోయిన ఓ జంటను కలిపే భార్యాభర్తలుగా సతీలీలావతి మూవీలోకమల్‌హాసన్, కోవై సరళ నటించారు.
కమల్ హాసన్ పట్టుపట్టి...
కమెడియన్‌గా బిజీగా ఉన్న కోవై సరళను పట్టుపట్టి సతీలీలావతి సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు కమల్‌హాసన్. కోవై సరళను హీరోయిన్‌గా తీసుకోవాలనే కమల్‌హాసన్ నిర్ణయాన్ని దర్శకుడు బాలుమహేంద్ర వ్యతిరేకించారట. . అయినా కమల్ హాసన్ వెనక్కి తగ్గలేదు.
ఆరు నెలల పాటు కష్టపడి బాలుమహేంద్రను ఒప్పించి కోవై సరళ చేత ఈ సినిమా చేయించారు కమల్‌హాసన్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కోవై సరళ చెప్పింది. కమల్‌హాసన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమాకు బెస్ట్ కమెడియన్‌గా తమిళనాడు రాష్ట్ర అవార్డును కోవై సరళ అందుకున్నది. సతీలీలావతి సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
హాలీవుడ్ రీమేక్...
సతీలీలావతి సినిమాలో కమల్‌హాసన్ క్యారెక్టర్‌కు తెలుగులో ఫస్ట్ టైమ్ సింగర్ మనో డబ్బింగ్ చెప్పాడు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యాన్ని కాదని మనో చేత ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పించుకున్నారు కమల్‌హాసన్.
సతీలీలావతి సినిమాకు ఇళయారాజా మ్యూజిక్ అందించాడు. హాలీవుడ్ మూవీ షీ డెవిల్ ఆధారంగా బాలుమహేంద్ర సతీలీలావతి సినిమాను మూతెరకెక్కించాడు.
బాలీవుడ్‌లో హిట్...
సతీలీలావతి సినిమా హిందీలో బీవీ నంబర్ 1 పేరుతో రీమైకైంది. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, కరిష్మాకపూర్, టబు, సుస్మితాసేన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. 1999 ఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కన్నడంలో రామా శామ భామ పేరుతో రమేష్ అరవింద్ రీమేక్ చేశాడు.
కమల్ హాసన్ ఐదు సినిమాలు...
ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తోన్నాడు కమల్‌హాసన్. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రభాస్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్ 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది. 1996లో రిలీజైన ఇండియన్‌కు సీక్వెల్‌గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది.మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేస్తోన్నాడు కమల్‌హాసన్. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.