Kollywood: తమిళ్ హీరో జయం రవి తండ్రి చేసిన తెలుగు సినిమాలు ఇవే - అన్నీ హిట్లే!
Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తండ్రి ఎడిటర్ మోహన్ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. చిరంజీవి హిట్లర్‌తో పాటు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బావ బావమరిది, మామగారుతో పాటు ఎడిటర్ మోహన్ ప్రొడ్యూస్ చేసిన పలు తెలుగు సినిమాలు శతదినోత్సవాలను పూర్తిచేసుకున్నాయి.
Kollywood: తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు జయం రవి. తని ఒరువన్, పొన్నియన్ సెల్వన్, కోమలితో పాటు కోలీవుడ్‌లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు చేశాడు జయం రవి. అతడు హీరోగా నటించిన బ్రదర్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.
చిరంజీవి గాఢ్ ఫాదర్...
జయం రవి అన్నయ్య మోహన్‌రాజా కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు. తెలుగులో చిరంజీవితో గాడ్‌ఫాదర్‌తో పాటు అర్జున్, జగపతిబాబు హీరోలుగా నటించిన హనుమాన్ జంక్షన్‌కు మోహన్‌రాజా దర్శకత్వం వహించాడు.
ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు...
జయం రవి, మోహన్‌రాజాల తండ్రి ఎడిటర్ మోహన్ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు ప్రొడ్యూసర్‌గా, ఎడిటర్‌గా పనిచేయడం గమనార్హం. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు పలువురు హీరోలతో పనిచేశాడు ఎడిటర్ మోహన్.
అసిస్టెంట్ ఎడిటర్‌గా...
అసిస్టెంట్ ఎడిటర్‌గా...ఎడిటర్ మోహన్ సినీ జర్నీ ప్రారంభమైంది. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన గురువును మించిన శిష్యుడు సినిమా అసిస్టెంట్ ఎడిటర్‌గా మోహన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో నవగ్రహ పూజామహిమ, అగ్గిపిడుగు, కదలడు వదలడు, చిక్కొడు దొరకడుతో పాటు పలు జానపద సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. అందులో ఎక్కువగా ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలే ఉండటం గమనార్హం.
ఆరని మంటలుతో...
ఎడిటర్‌గా పనిచేసిన అనుభవంతో ప్రొడ్యూసర్‌గా మారాడు మోహన్. తొలుత తెలుగు సినిమాలను తమిళంలోకి...తమిళ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి విజయాల్ని అందుకున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆరని మంటలును తమిళంలోకి డబ్ చేశాడు. ఈ డబ్బింగ్ మూవీతోనే చిరంజీవి తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం గమనార్హం. అరవై డబ్బింగ్ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.
చిరంజీవి హిట్లర్...
సుదీర్ఘ కెరీర్‌లో ప్రొడ్యూసర్‌గా పదిహేను సినమాలను నిర్మించాడు ఎడిటర్ మోహన్. అందులో పది తెలుగు సినిమాలే కావడం గమనార్హం. ఎడిటర్ మోహన్ ప్రొడ్యూస్ చేసిన తెలుగు సినిమాల్లో చాలా వరకు హిట్లే ఉన్నాయి. ఎడిటర్ మోహన్ నిర్మించిన తెలుగు సినిమాల్లో చిరంజీవి హిట్లర్ ఒకటి. వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న చిరంజీవి గట్టెక్కించిన మూవీ ఇది.
హిట్లర్‌తో పాటు సుమన్, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో నటించిన బావ బావమరది, దాసరి నారాయణరావు మామగారు, హనుమాన్ జంక్షన్, మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి సినిమాలతో తెలుగులో ప్రొడ్యూసర్‌గా విజయాల్ని అందుకున్నాడు ఎడిటర్ మోహన్. బావ బావమరిది, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడు.