Jayam Ravi divorce: భార్య ఆరోపణలపై స్పందించిన తమిళ హీరో జయం రవి.. అది నిజం కాదంటూ..
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల వివాదం కొనసాగుతోంది. ఆయనపై భార్య ఆర్తి ఇటీవల ఆరోపణలు చేశారు. వాటిపై జయం రవి తాజాగా స్పందించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించారు.
తమిళ హీరో జయం రవి ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ జోష్‍లో ఉన్నారు. గతేడాది పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం మూడు చిత్రాలు ఆయన లైనప్‍లో ఉన్నాయి. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం సవాళ్లను ఎదుర్కొంటున్నారు జయం రవి. భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు ఆయన ఇటీవలే ప్రకటించారు. అయితే, తనకు చెప్పకుండా ఏకపక్షంగా విడాకులు ఇచ్చారంటూ ఆర్తి ఆరోపించారు.
ముందుగా తనకు, కుటుంబ సభ్యులకు చెప్పకుండా విడాకులు ఇస్తున్నట్టు జయం రవి ప్రకటించారని సెప్టెంబర్ 11న ఆర్తి ఆరోపించారు. దీంతో ఈ విషయంపై వివాదం రేగింది. ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆర్తి చేసిన ఆరోపణలపై జయం రవి ఎట్టకేలకు స్పందించారు. ఈ విషయంపై హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ముందుగా ఆర్తితో పాటు కుటుంబ సభ్యులకు విడాకుల విషయం చెప్పానని, ఆమె చెప్పిన విషయం నిజం కాదని అన్నారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.
అందుకే ప్రకటించా..
తాను ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు సెప్టెంబర్ 9న జయం రవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అందుకలా చేశారో ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. “నేను సెప్టెంబర్ 9 కంటే కొన్ని నెలల ముందే ఆర్తికి లీగల్ నోటీసులు పంపా. కానీ ఆమె స్పందించలేదు. దీంతో విడాకులపై బహిరంగంగా ప్రకటించా. అప్పటికే చాలా రూమర్లు వస్తున్నాయి. నా అభిమానులకు నేను జవాబుదారిగా ఉండాలి. మీడియాలో అందరూ మాట్లాడుతుంటే నేను సైలెంట్‍గా ఎలా ఉండాలి? అప్పటికే నేను లీగల్ చర్యలు మొదలుపెట్టేశా. ఈ విషయం చెప్పాలని నాకు అనిపించింది” అని జయం రవి అన్నారు.
ఆర్తికి ముందుగా చెప్పలేదా?
విడాకుల విషయాన్ని తాను ఆర్తితో పాటు రెండు కుటుంబాలకు ముందే చెప్పానని జయం రవి చెప్పారు. ఆర్తి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. “నేను ఆర్తితో ఈ విషయం గురించి స్పష్టంగా మాట్లాడా. తన కుటుంబంతోనూ చెప్పాలని కోరింది. నేను ఆర్తి తండ్రితో మాట్లాడా. అలాంటప్పుడు అలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు” అని జయం రవి చెప్పారు.
ఆ విషయాలు చెప్పలేను
విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని తాను బహిరంగంగా వివరంగా చెప్పలేనని జయం రవి అన్నారు. కోర్టులే ఆ విషయాన్ని చూసుకుంటాయని అన్నారు. ఓ దశలో తాను భరించలేకపోయానని అన్నారు. అయితే, అందుకు కారణాలను చెప్పలేనని అన్నారు. “నేను కొన్ని నెలల కిందట ఇంటికి నుంచి బయటికి వెళ్లినప్పుడు ఏదీ తీసుకెళ్లలేదు. ఖాళీ చేతులతో బయటికి వచ్చేశా. నేను నా కార్ మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు స్థిర నివాసం కూడా లేదు” అని జయం రవి తెలిపారు.
పిల్లలతో మాట్లాడుతున్నా
తన ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్‍కు తాను అందుబాటులోనే ఉన్నానని జయం రవి చెప్పారు. ప్రస్తుతం తాను ముంబై ఉంటున్నానని, చెన్నైకు వచ్చి వెళుతున్నానని తెలిపారు. జూన్‍లో తన కుమారుడు ఆరవ్ పుట్టిన రోజును జరిపి, అతడితో సమయం గడిపానని తెలిపారు.
తన పెద్ద కుమారుడు ఆరవ్‍కు 14 ఏళ్లని, తనకు ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించానని జయం రవి చెప్పారు. అయాన్ వయసు ఎనిమిదేళ్లేనని, ఇదంతా అర్థం చేసుకునేందుకు చాలా చిన్నోడని అన్నారు.