Arulmani Passes Away: ప్రముఖ తమిళ నటుడు అరుళ్‌మణి (65) గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తమిళంలో సూర్య సింగం, రజనీకాంత్ లింగతో పాటు తాండవకోనే, అళగితో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు అరుళ్ మణి. రాజకీయాల కారణంగా గత కొన్నాళ్లుగా అరుణ్‌మణి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అన్నాడీఎంకే పార్టీలో వ్యవహారాల్లో చాలా ఏళ్లుగా చురుకుగా పాలుపంచుకుంటున్నాడు. పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా గత పది రోజులుగా అన్నాడీఎంకే తరఫున తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు అరుళ్‌మణి. విశ్రాంతి కోసం గురువారమే అతడు చెన్నైకి తిరిగివచ్చినట్లు సమాచారం.
చెన్నై వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అప్పటికే అరుళ్ మణి కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించినట్లు కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం. గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిసింది.
అరుళ్ మణి మృతితో తమిళ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్నికల ప్రచారమే ఆయన ప్రాణం తీసినట్లు పలువురు నెటిజన్లు, సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు సినీ నటులను ఉపయోగించుకుంటున్నాయని, అది సరైన పద్ధతి కాదంటూ పేర్కొంటున్నారు.
అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్న అరుళ్‌మణి పలు తమిళ సినిమాల్లో విలన్‌గా నటించాడు. అజకి, తేన్‌రాల్, అరు మజాల్ 4 సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేశాడు. సూర్య సింగం, సింగం 2 సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో ఓ సభ్యుడిగా అరుళ్ మణి నటించాడు.
తమిళ చిత్రసీమలో వరుణ మరణాలు అభిమానులను కలవరపెడుతోన్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశాడు. అతడు మరణించిన కొద్దిరోజుల్లోనే ఇప్పుడు అరుళ్‌మణి మృత్యువాతపడటం కోలీవుడ్ సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.