టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. రిషబ్ శెట్టి లేటెస్ట్ కన్నడ మూవీ 'కాంతార ఛాప్టర్ 1' చూసి 'మైమరచిపోయానని' అన్నాడు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ సినిమాపై తన రివ్యూను పంచుకున్నాడు. ఇది మంగళూరు సంప్రదాయాలను, ప్రజలను చాలా కచ్చితత్వంతో చూపించిందని ప్రశంసించాడు.
కాంతార ఛాప్టర్ 1 సినిమా సెలబ్రిటీ అభిమానుల జాబితాలో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా చేరిపోయాడు. కర్ణాటకకే చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'కాంతార ఛాప్టర్ 1' టైటిల్ కార్డు పోస్టర్ పోస్ట్ చేశాడు. సినిమా చూసిన తర్వాత తన మతిపోయినట్లు చెప్పాడు. అతడు తన రివ్యూలో ఇలా రాశాడు.
"ఇప్పుడే కాంతార చూశాను. రిషబ్ శెట్టి మరోసారి సృష్టించిన ఈ మాయాజాలానికి మైమరచిపోయాను. మంగళూరు ప్రజలను, వాళ్ల విశ్వాసాలను ఇది హృదయపూర్వకంగా, అద్భుతంగా చూపిస్తుంది" అని రాహుల్ అన్నాడు. దీనికి స్పందిస్తూ రాహుల్ సమీక్షను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీ-షేర్ చేసిన రిషబ్ శెట్టి.. రెండు రెడ్ హార్ట్ ఎమోజీలతో తన కృతజ్ఞతను తెలియజేశాడు.
'కాంతార' పట్ల రాహుల్ తన ప్రేమను వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచినప్పుడు.. ఈ క్రికెటర్ తన హెల్మెట్ తీసి, తన బ్యాట్‌ను నేలకు కొట్టి, దానితో ఒక సర్కిల్ గీశాడు. తరువాత అతను తన ఛాతీని గట్టిగా కొట్టుకుని నేల వైపు తన జెర్సీ వైపు చూపించాడు.
ఆ స్టేడియం తన అడ్డా అన్నట్లుగా చెప్పాడు. తాను అలా చేయడం వెనుక కాంతార మూవీ నుంచి స్ఫూర్తి పొందినట్లు తర్వాత రాహుల్ చెప్పాడు. రాహుల్ బెంగళూరులో పుట్టి పెరిగాడు. అతని మామ సునీల్ శెట్టి అయితే అదే మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి.
'కాంతార ఛాప్టర్ 1' సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇది 2022లో వచ్చిన హిట్ కన్నడ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్. ఈ మూవీలో రిషబ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విడుదలైన తర్వాత ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. విడుదలైన మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగాలాంటి వాళ్లు కూడా రివ్యూలు ఇస్తూ సినిమాను ఆకాశానికెత్తారు.
సంబంధిత కథనం