కిరణ్ అబ్బవరం అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. హనుమాన్ జయంతి రోజే తనకు కొడుకు పుట్టినట్లు అతడు వెల్లడించాడు. గురువారం (మే 22) రాత్రి 10 గంటల సమయంలో అతడు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా ఈ విషయం తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. వాళ్లకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ సంతోషకరమైన విషయాన్ని కిరణ్ తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు.
“మగబిడ్డ పుట్టాడు. హ్యాపీ హనుమాన్ జయంతి. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్” అంటూ అతడు క్యాప్షన్ ఉంచాడు. దీనికి అతడు జత చేసిన ఫొటో ఆకట్టుకుంటోంది. తన అబ్బాయి చిట్టి కాళ్లకు ముద్దు పెడుతున్న ఫొటో అది. హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే తీసిన ఫొటోలా కనిపిస్తోంది.
కిరణ్ అబ్బవరం పోస్టుపై అభిమానులు స్పందిస్తున్నారు. నిమిషాల్లోనే ఈ పోస్టుకు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ మీ ఇంటికి వచ్చాడంటూ ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం. జూనియర్ అబ్బవరం వచ్చారంటూ మరొకరు కామెట్ చేశారు. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనందుకు శుభాకాంక్షలు అని ఇంకొకరు అన్నారు. ఇలా కిరణ్ పోస్టుపై ఎంతో మంది శుభాకాంక్షలు చెబుతున్నారు.
కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ నే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో వీళ్ల పెళ్లి జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. రాజావారు రాణిగారు సినిమాతోనే కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పరిచయమయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరు అయ్యారు. ఆ తర్వాత కొద్ది నెలలకు రహస్య ప్రెగ్నెంట్ అంటూ కిరణ్ అనౌన్స్ చేశాడు. క మూవీ రిలీజ్ సమయంలోనూ ప్రమోషన్లకు కిరణ్ తో కలిసి రహస్య హాజరైంది.