సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీ 15 ఏళ్ల కిందట రిలీజైనా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం మొదలుపెట్టింది. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడల్లా మంచి రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడీ మూవీని మే 30వ తేదీన రీరిలీజ్ చేయబోతున్నారు.
ఖలేజా మూవీ మే 30న రీరిలీజ్ కానుండగా ఇప్పటికే బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గంటకు 13 వేల టికెట్ల చొప్పున అమ్ముడవుతుండటం విశేషం. ఈ స్థాయి రెస్పాన్స్ ను అసలు ఎవరూ ఊహించలేదు. అసలు రీరిలీజ్ మూవీస్ విషయంలో ఇదో సరికొత్త రికార్డు. గతంలో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ సమయంలో గంటకు గరిష్ఠంగా 5.5 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.
కానీ ఇప్పుడు ఖలేజా మూవీకి అంతకంటే ఎంతో ఎక్కువ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. వారం రోజుల ముందే ఈ పరిస్థి ఉంటే మూవీ రీరిలీజ్ దగ్గర పడే సమయంలో మరే స్థాయిలో ఈ టికెట్ల అమ్మకాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ లెక్కన బాక్సాఫీస్ రికార్డులు కూడా తిరగరాయడం ఖాయం.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు, అనుష్క జంటగా ఈ ఖలేజా మూవీ వచ్చింది. 2010, అక్టోబర్ 7న మూవీ రిలీజైంది. అయితే భారీ అంచనాల మధ్య ఏకంగా రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర షేర్ మాత్రం కేవలం రూ.18 కోట్లే వచ్చాయి. దీంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. అయితే తర్వాత అనూహ్యంగా మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడం మొదలైంది.
దీంతో ఐఎండీబీలో 7.6 రేటింగ్ నమోదైంది. తమను కాపాడటానికి ఆ దేవుడే దిగి వస్తాడంటూ పాలి అనే ఓ మారుమూల గ్రామ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఊళ్లో ఒక్కొక్కరుగా కన్నుమూస్తుంటే.. తమను కాపాడే ఆ దేవుడి కోసం వెతుకుతుంటారు. అప్పుడే వాళ్లకు ట్యాక్సీ డ్రైవర్ సీతారామరాజు (మహేష్ బాబు) రూపంలో ఆ దేవుడు దొరుకుతాడు.
అసలు ఆ గ్రామంలో ఎందుకలా మృత్యువాత పడుతున్నారు? దీని వెనుక ఉన్నదెవరు? పాలి గ్రామస్థులు దేవుడిగా భావించే సీతారామరాజు వాళ్లను కాపాడతాడా అన్నదే ఈ ఖలేజా మూవీ స్టోరీ. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, డైరెక్షన్, మహేష్ నటన, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తొలిసారి రిలీజైనప్పుడు నష్టాలనే మిగిల్చిన ఈ మూవీ.. రీరిలీజ్ లో మాత్రం భారీగా లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.
సంబంధిత కథనం