Khakee The Bihar Chapter Web Series Review: ఖాకీ ది బిహార్ చాప్టర్ వెబ్ సిరీస్ రివ్యూ
Khakee The Bihar Chapter Web Series Review కరణ్ టక్కర్, అవినాష్ తివారీ, అభిమన్యుసింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ఖాకీ ది బిహార్ చాప్టర్. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌కు నీరజ్ పాండే కథను అందించాడు. భవ్ ధులియా దర్శకత్వం వహించారు.
ఇటీవల కాలంలో ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించిన వెబ్‌సిరీస్‌లలో ఖాకీ ది బిహార్ చాప్టర్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే కథను అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు భవ్ దులియా దర్శకత్వం వహించాడు. ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా రాసిన బిహార్ డైరీస్ బుక్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. కరణ్ టక్కర్(Karan Tacker), అవినాష్ తివారీ(Avinash Tiwary), అభిమన్యుసింగ్, రవికిషన్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉందంటే...
ట్రెండింగ్ వార్తలు
Khakee The Bihar Chapter Web Series story -బిహార్ కిడ్నాప్ గ్యాంగ్‌ల కథ...
అమిత్ లోధా (కరణ్ టక్కర్) ఐఐటీ గ్రాడ్యుయేట్. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్‌గా సెలెక్ట్ అవుతాడు. తొలి పోస్టింగ్ బిహార్‌లో వస్తుంది. తొలుత వృత్తి నిర్వహణలో ఇబ్బందులు పడిన అమిత్ ఆ తర్వాత ప్రజల మద్దతుతో బీహార్ కిడ్నాప్ గ్యాంగ్‌లను అంతమొందిస్తాడు.
చందన్ మహతో (అవినాష్ తివారీ) అనే గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకునే బాధ్యతను అతడు చేపట్టాల్సివస్తుంది. మహతో లారీ డ్రైవర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి కరుడుగట్టిన క్రిమినల్‌గా మారతాడు. రాజకీయ పార్టీల అండతో షేక్‌ఫురా ప్రాంతంలో పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు. తాను మద్దతు ఇచ్చిన మీతాదేవికి (ఐశ్వర్య సుష్మిత) ఓటు వేయలేదని ఓ ఊరికి చెందిన ఇరవై ఐదు మంది గ్రామస్తుల్ని చంపేస్తాడు చందన్.
షేక్‌పుర ప్రాంతంలో చందన్ మహతోకు ఉన్న రాజకీయ, ప్రజాబలం వల్ల అతడిని పట్టుకోవడం ఈజీ కాదనే విషయం అమిత్ లోదాకు అర్థమవుతుంది. చందన్‌ను పట్టుకోవడానికి అమిత్ వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిలవుతుంటాయి. అయినా పట్టువదలని అమిత్ ఆ డేంజరస్ క్రిమినల్‌ను ఎలా పట్టుకున్నాడు.
ఈ ఆపరేషన్‌లో అతడికి సస్పెండ్ ఎస్ ఐ రంజన్ కుమార్ (అభిమన్యు సింగ్) ఏ విధంగా సహాయం చేశాడు? చందన్ క్రైమ్‌లో అతడి వెన్నంటి నిలిచిన చవన్‌ఫ్రాష్ ఎందుకు అప్రూవర్‌గా మారిపోయాడు? చవన్ ఫ్రాష్ భార్య మీతాదేవితో చందన్‌కు ఉన్న సంబంధమేమిటన్నదే ఖాకీ ది బిహార్ చాప్టర్ కథ.
అమిత్ లోధా రాసిన బుక్…
1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా(Amit Lodha) రాసిన బిహార్ డైరీస్ బుక్ ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఖాకీ ది బిహార్ చాఫ్టర్ కథ రాశారు. 2002 - 06 టైమ్‌లో అశోక్ మహతో, పింటు మహతో గ్యాంగ్ బిహార్‌లో సృష్టించిన అరాచకాలు, అమిత్ లోధా బృందం వారికి చట్టప్రకారం ఎలా శిక్షించింది అన్నదే ఈ సిరీస్ కథ. 2000 దశకం నాటి బిహార్ సామాజిక పరిస్థితులు, క్రిమినల్స్‌కు రాజకీయ నాయకులు అండదండలు ఎలా ఉండేవి? కుల వివక్ష కారణంగా నిమ్న వర్గాల్లో పేరుకు పోయిన అసంతృప్తి సామూహిక హత్యలకు ఏ విధంగా కారణమైందనేది వివరంగా ఈ సిరీస్‌లో చూపించారు నీరజ్ పాండే.
ఏడు ఎసిసోడ్స్...
మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌కు భవ్ ధులియా దర్శకత్వం వహించాడు. ఫస్ట్ ఎపిసోడ్‌లో అమిత్ లోధా ప్రొబెషనరీ ఐపీఎస్‌గా బిహార్‌లో అడుగుపెట్టడం, అక్కడ అతడికి ఎదురైన అనుభవాలతో సాగింది. రెండో ఎపిసోడ్‌లో లారీ డ్రైవర్‌గా నాలుగు వేల రూపాయల జీతంతో జీవితాన్ని మొదలుపెట్టిన చందన్ మహతో బిహార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఎలా మారాడో చూపించారు.
క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ను రెండు ఎపిసోడ్స్‌లో డీటైలింగ్‌గా చూపించారు. ఆ తర్వాత చందన్ మహతో చేసే అరాచకాలు, అతడిని పట్టుకోవడానికి అమిత్ చేసే ప్రయత్నాలతో మిగిలిన ఎపిసోడ్స్ సాగుతాయి. ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. చందన్ మెహతో పట్టుకోవడానికి రంజన్ సహయంతో అమిత్ వేసే ప్లాన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూపించారు దర్శకుడు. ఫోన్ ట్యాపింగ్, కోవర్ట్‌ల సహాయం తీసుకోవడం లాంటి సీన్స్‌ను థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు.
రియలిస్టిక్‌గా...
బిహార్ డైరీస్ బుక్‌లో ఉన్న అంశాలను రియలిస్టిక్‌గా తెరపై తీసుకురావడంలో నీరజ్ చోప్రా, భవ్ దులియా సక్సెస్ అయ్యారు. కమర్షియల్, యాక్షన్ అంశాలపై ఆధారపడకుండా అప్పట్లో ఏం జరిగిందనేది వాస్తవిక కోణంలో ఈ సిరీస్‌లో చూపించారు.
సీనియర్ యాక్టర్స్...
అమిత్ లోధా పాత్రలో కరణ్ టక్కర్ అద్భుతంగా నటించాడు. నీతినిజాయితీలను నమ్ముకొన్న ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. చందన్ మహతోగా అవినాష్ తివారీ డైలాగ్స్‌తోనే విలనిజాన్ని చక్కగా పండించాడు. అతడి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. వృత్తికి, అధికార ఒత్తిడులకు నలిగిపోయే పోలీస్ ఆఫీసర్‌గా అభిమన్యు సింగ్ నటన బాగుంది. రవికిషన్, అశుతోష్ రానా తమ అనుభవంతో పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
Khakee The Bihar Chapter Web Series Review- బిహార్ వాస్తవ పరిస్థితులను...
ఖాకీ ది బిహార్ ఛాప్టర్ సరికొత్త క్రైమ్ డ్రామా సిరీస్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అప్పటి బిహార్ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించే సిరీస్ ఇది.