Yash on Prabhas Kalki: డార్లింగ్‌ను చూస్తుంటే అద్భుతంగా అనిపించింది: కల్కి 2898 ఏడీపై కేజీఎఫ్ స్టార్ ప్రశంసల వర్షం
Yash on Prabhas Kalki: కల్కి 2898 ఏడీ మూవీపై కేజీఎఫ్ మూవీ స్టార్ యశ్ ప్రశంసల వర్షం కురిపించాడు. డార్లింగ్ ప్రభాస్ తోపాటు ఇతర నటీనటులందరినీ స్క్రీన్ పై చూడటం చాలా అద్భుతంగా అనిపించిందని అతడు అన్నాడు.
Yash on Prabhas Kalki: ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు నటించిన కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (జూన్ 27) రిలీజైన విషయం తెలుసు కదా. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాపై ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది.

ప్రభాస్ కల్కి 2898 ఏడీపై యశ్ ట్వీట్
సుమారు రూ.600 కోట్ల బడ్జెట్, భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కి 2898 ఏడీ మూవీ ఊహించినట్లే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ మేకర్స్ లో ఉత్సాహాన్ని నింపింది. దీనికితోడు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం (జూన్ 28) కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా స్పందించాడు.
"విజువల్ గా ఓ అద్భుత దృశ్యకావ్యాన్ని క్రియేట్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్ కు శుభాకాంక్షలు. మరింత క్రియేటివ్ గా స్టోరీలు చెప్పడానికి ఈ సినిమా దారి చూపుతుంది. మరింత మంది ఓ పెద్ద అడుగు వేసేలా నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ విజన్ స్ఫూర్తిగా నిలవనుంది. డార్లింగ్ ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్ సర్, కమల్ హాసన్ సర్, దీపికా పదుకోన్, ఇతర అతిథి పాత్రలను కలిసి చూడటం ఎంతో అద్భుతమైన అనుభవం. ఇది నిజంగా స్క్రీన్ ను మరింత ప్రకాశించేలా చేసింది" అని యశ్ ట్వీట్ చేయడం విశేషం.
రికార్డులపై కల్కి ప్రొడ్యూసర్లు ఏమన్నారంటే..
కల్కి 2898 ఏడీ మూవీని భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఊహించినట్లే తొలి రోజే రూ.191 కోట్ల వసూళ్లతో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇది చూసి రికార్డులు బ్రేకయ్యాయా అని చాలా మంది అడుగుతున్నారని, అయితే తమకు రికార్డులు ముఖ్యం కాదని స్వప్న దత్ చెబుతోంది.
శుక్రవారం (జూన్ 28) ఆమె ఓ ట్వీట్ చేసింది. "ఎంతో మంది ఫోన్ చేసి మనం రికార్డులు బ్రేక్ చేశామా అని అడుగుతున్నారు. ఇది చూస్తే నవ్వొస్తోంది. ఎందుకంటే ఆ రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లు ఆ రికార్డుల కోసం సినిమాలు చేయలేదు. మేము ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తాం. సినిమాపై ప్రేమతో చేస్తాం. మేమూ అదే చేశాం" అని ఆమె అనడం విశేషం.
కల్కి మూవీ ఆర్ఆర్ఆర్ రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఆ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.221 కోట్లు వసూలు చేసింది. ఇక బాహుబలి 2 కూడా రూ.215 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ రికార్డులకు కల్కి 2898 ఏడీ చాలా దూరంలోనే నిలిచిపోయింది. అయితే మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో ఫస్ట్ వీకెండ్లో మాత్రం ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.