Kerala High Court on Movie Reviews: సినిమా రిలీజైన వారం తర్వాతే రివ్యూలు - కేరళ హైకోర్టు కొత్త రూల్
Kerala High Court on Movie Reviews: సినిమా నెగెటివ్ రివ్యూస్‌పై కేరళ హైకోర్టు సీరియస్ అయ్యింది. సినిమా రిలీజైన వారం తర్వాతే రివ్యూస్ రాయాలని సూచించింది.
Kerala High Court on Movie Reviews: సినిమా రివ్యూలపై కేరళ హైకోర్టు సీరియస్ అయ్యింది. నెగెటివ్ రివ్యూస్ వల్ల సినీ పరిశ్రమకు ఎంతో నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించింది. సినిమా రిలీజైన రోజు కాకుండా వారం తర్వాతే రివ్యూలు రాసేలా కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని హైకోర్టు సూచించింది. ఇటీవల మలయాళంలో రిలీజైన అరోమాలింతే అద్యతే ప్రాణాయామ్ మూవీని ఉద్దేశించి క్రిటిక్స్ నెగెటివ్ రివ్యూస్ రాయడంపై సినిమా డైరెక్టర్ ముబీన్ రౌఫ్ హైకోర్టును ఆశ్రయించారు.
ముఖ్యంగా సోషల్ మీడియా రివ్యూస్‌కు అడ్డుకట్టవేయాలని అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అతడి పిటిషిన్‌పై స్పందించిన కోర్టు పలు సూచనల్ని జారీ చేసింది. విడుదల రోజు నెగెటివ్ రివ్యూస్ రాయడం వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని దర్శకుడు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. సినిమా రిలీజైన రోజు కాకుండా వారం తర్వాత రివ్యూలు రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఓ సినిమాపై వందలాది మంది కష్టం, ప్రతిభ, జీవితాలు ఆధారపడి ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని విమర్శనాత్మక కోణంలో రివ్యూస్ రాయాలని సూచించింది. అప్పుడే దర్శకనిర్మాతలు, నటీనటులు తాము చేసే తప్పుల్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొన్నది.
అలా కాకుండా కక్షపూరితంగా రివ్యూస్ రాసిన వారిపై చట్టప్రకారం చర్యతీసుకోవడమే కాకుండా పరువునష్టం దావా వేసే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా పోలీసులకు హైకోర్టు సూచించింది. డైరెక్టర్ పిటిషన్‌ఫై అక్టోబర్ 10న తుది తీర్పు వెలువడనుంది.