Keerthy Suresh: ఆ డిజాస్టర్ మూవీ కోసం ఛావా సినిమాకు కీర్తి సురేశ్ నో చెప్పారట!
Keerthy Suresh: ఛావా సినిమాకు ముందుగా కీర్తి సురేశ్‍నే మేకర్స్ అనుకున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి. అదే సమయంలో ఆమె చేసిన మరో సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది.
బిజీగా ఉండడం వల్లనో, పాత్ర సూటవకపోవటం వల్లనో లేకపోతే ఇతర కారణాలతో కొందరు సినీ తారలు కొన్ని చిత్రాలను తిరస్కరిస్తుంటారు. ఒకవేళ వాళ్లు వద్దనుకున్న సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయిందంటే దాని గురించి చర్చ జరుగుతుంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ విషయంలో ఇది జరుగుతోంది. భారీ బ్లాక్‍బస్టర్ అయిన ఛావా చిత్రంలో ముందు కీర్తి సురేశ్‍కు అవకాశం వచ్చిందట. ఆమె వేరే మూవీ కోసం ఈ ఆఫర్ తిరస్కరించారనే రూమర్లు వస్తున్నాయి.
బేబీజాన్ కోసం ఛావాకు నో!
ఛావా సినిమాలో రష్మిక మందన్నా పోషించిన యేసుభాయి పాత్ర కోసం ముందుగా కీర్తి సురేశ్‍నే మేకర్స్ సంప్రదించారట. కానీ బేబీజాన్ చిత్రంలో బిజీగా ఉన్న కీర్తి.. ఈ ఆఫర్ వద్దన్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బేబీజాన్ కోసం ఛావాకు కీర్తి నో చెప్పారనే పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
బేబీజాన్ డిజాస్టర్.. ఛావా భారీ బ్లాక్‍బస్టర్
బేబీజాన్ చిత్రంతోనే బాలీవుడ్‍లోకి కీర్తి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ ధావన్ సరసన ఈ మూవీలో హీరోయిన్‍గా నటించారు. తమిళ మూవీ తేరికి హిందీ రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కలీస్. గతేడాది డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదలైన బేబీజాన్ భారీ డిజాస్టర్ అయింది. సుమారు రూ.180కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.60కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోంది. బాక్సాఫీస్ వద్ద భారీగా ఫెయిల్ అయింది.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఛావా చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమా ఇప్పటి వరకు రూ.750కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛత్రవతి సంభాజీ మహరాజ్‍గా విక్కీ నటించగా.. ఆయన భార్య యేసుభాయి పాత్రను రష్మిక చేశారు. సుమారు రూ.130కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది.
డిజాస్టర్ బేబీజాన్ కోసం ఛావా చిత్రాన్ని కీర్తి సురేశ్ వద్దనుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం రూమర్లు గుప్పుమంటున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందనేది భవిష్యత్తులో కీర్తి నుంచి కానీ, ఛావా టీమ్ నుంచి కానీ బయటికి వస్తుందేమో చూడాలి.
కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నవీడి అనే రెండు తమిళ చిత్రాలు చేస్తున్నారు. రివాల్వర్ రీటా చిత్రంలో కీర్తిదే లీడ్ రోల్. ఈ యాక్షన్ కామెడీ మూవీకి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్‍స్లే, జాన్ విజయ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్క అనే ఫీమేల్ గ్యాంగ్‍స్టర్ వెబ్ సిరీస్ కూడా కీర్తి లైనప్‍లో ఉంది. ఈ సిరీస్‍లో రస్టిక్ గ్యాంగ్‍స్టర్ పాత్రను కీర్తి పోషిస్తున్నారు. రాధికా అప్టే, తన్వి అజ్మీ కూడా కీరోల్స్ చేస్తున్నారు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది.
సంబంధిత కథనం