Keerthy Suresh Mangalsutra: కీర్తి సురేష్ మెడలో పసుపు తాడే ఎందుకు.. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానన్న బ్యూటీ
Keerthy Suresh Mangalsutra: కీర్తి సురేష్ మెడలో పసుపు తాడే ఎందుకు ఉంది? బంగారు చెయిన్ తో కూడిన తాళి ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని కీర్తి చెప్పింది.
Keerthy Suresh Mangalsutra: కీర్తి సురేష్ ఈ మధ్యే తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. అయితే చాలా మంది నటీమణులలాగా పెళ్లవగానే తన మంగళసూత్రాన్ని పక్కన పెట్టేసి ఆమె తిరగడం లేదు. ఎక్కడికి వెళ్లినా మెడలో తాళితోనే కనిపిస్తోంది. అయితే అది పసుపు తాడే ఎందుకు అన్నది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దీనికి తాజాగా కీర్తి సమాధానం చెప్పింది.
మంగళసూత్రం బదులు పసుపు తాడు అందుకే..
పెళ్లయిన తర్వాత ఎవరైనా బంగారంతో తయారు చేసిన మంగళసూత్రాన్ని ధరించడం సాధారణం. అయితే కీర్తి సురేష్ మాత్రం పెళ్లయి 20 రోజులవుతున్నా.. ఇప్పటికీ మెడలో పసుపు తాడుతోనే కనిపిస్తోంది. ఈ మధ్యే బేబీ జాన్ మూవీలో నటించిన ఆమె.. ఆ సినిమా ఈవెంట్లన్నింటిలోనూ ఇలాగే కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి కారణమేంటో గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి వెల్లడించింది.
"నేను ప్రతి ఈవెంట్ కు ఈ పసుపు తాడుతో వెళ్లడానికి ఓ కారణం ఉంది. దీనిని వెంటనే తీసేయకూడదు. ఓ ప్రత్యేకమైన రోజు వరకు దీనిని తీయకూడదు. కొన్ని రోజుల తర్వాత గోల్డ్ చెయిన్ కు మారడం సహజమే. ఒకవేళ పెళ్లి తర్వాత వారం, పది రోజుల్లో ఆ మంచి రోజు వచ్చి ఉంటే నేను మార్చుకునేదానిని. కానీ ఆ రోజు రాలేదు. జనవరి చివర్లో ఆ రోజు ఉంది" అని కీర్తి చెప్పింది.
ఇది పవిత్రమైనది, శక్తివంతమైనది
ఇక తాను ధరించిన ఆ పసుపు తాడు ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనదని కూడా ఈ సందర్భంగా కీర్తి సురేష్ తెలిపింది. "ఆ మంచి రోజు వచ్చే వరకు నేను దీనినే ధరిస్తాను. కొందరు ప్రమోషనల్ దుస్తుల్లో వద్దనుకుంటే దీనిని వేసుకోకూడదని చెప్పారు. కానీ ఇది ఎప్పుడూ మన గుండెను తాకేలా వేసుకోవాలి.
ఇది పవిత్రమైనది, ఎంతో శక్తివంతమైనది. గోల్డెన్ చెయిన్ కు మారిన తర్వాత ఇది సాధారణంగా కనిపిస్తుంది. కొందరు లోపల కనిపించకుండా వేసుకోమన్నారు. కానీ ఇది హాట్ గా కనిపిస్తుందని నేను అనుకున్నాను. అందుకే కనిపించేలా వేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.
ఆంటోనీ తాటిల్ తో 15 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన కీర్తి.. డిసెంబర్ 12న అతన్ని గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట హిందూ సాంప్రదాయంలో, తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజైంది. తమిళంలో వచ్చిన తేరి మూవీకి ఇది రీమేక్. కానీ హిందీలో మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేదు.