Keerthy Suresh: కీర్తి సురేష్‌ను దసరా డైరెక్టర్ అలా పిలవడం నచ్చలేదన్న నెటిజన్ - క్లారిటీ ఇచ్చిన వెన్నెల
Keerthy Suresh Srikanth Odela:యాక్టింగ్‌లో తనకు తల్లి మేనక స్ఫూర్తి అని చెప్పింది కీర్తి సురేష్. శనివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చాట్ చేసిన కీర్తిసురేష్ వారు అడిగిన పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పింది.

Keerthy Suresh Srikanth Odela: దసరా సినిమాలో వెన్నెల పాత్రలో సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మనసుల్ని కొల్లగొట్టింది కీర్తిసురేష్. గ్లామర్ హంగులకు దూరంగా సాగిన ఈ పాత్రలో తెలంగాణ యాసలో కీర్తి సురేష్ డైలాగ్స్ చెప్పిన తీరుతో ఆమె డ్యాన్స్‌లు, నటన బాగున్నాయంటూ ప్రశంసలు లభిస్తోన్నాయి.
ఈ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తోంది కీర్తిసురేష్. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్ సంఖ్య పదిహేను మిలియన్స్ చేరుకున్న సందర్భంగా శనివారం అభిమానులతో చాట్ చేసింది కీర్తిసురేష్. ఈ సందర్భంగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా ప్రమోషన్స్‌లో మిమ్మల్ని మీరు అని కాకుండా నువ్వు అని పిలచాడు కదా. అలా పిలవడం మీకు ఓకేనా అంటూ నెటిజన్ కీర్తి సురేష్‌ను అడిగాడు.
ఈ ప్రశ్నకు ...శ్రీకాంత్ అలాంటి ఊరిలో నుంచే వచ్చాడు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రేమతో అలానే పిలుస్తారు. నేను కూడా మా అమ్మతో పాటు గ్రాండ్ మదర్‌ను నువ్వు అనే పిలుస్తాను. అలాగని వారిపై రెస్పెక్ట్ లేదని కాదు. నా మీద ప్రేమ, అభిమానంతోనే శ్రీకాంత్ అలా పిలిచాడు అంటూ క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. మీపట్ల గౌరవం లేని వారిని ఎలా చూస్తుంటారు అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు తాను మాత్రం వారికి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటానంటూ రిప్లై ఇచ్చింది.
మహానటి, దసరా లో ఏ రోల్ ఎక్కువగా ఛాలెంజింగ్‌గా అనిపించిందని అడగ్గా...పాత్రల పరంగా రెండు ఛాలెంజింగ్‌గానే నిలిచాయని తెలిపింది. మహానటి లో సావిత్రి బయోపిక్‌గా న్యాయం చేయడానికి కష్టపడ్డానని, అలాగే దసరాలో వెన్నెల అనే తెలంగాణ అమ్మాయిగా కనిపించానని, ఈ పాత్ర కోసం తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడానికి చాలా శ్రమించాల్సివచ్చిందని కీర్తిసురేష్ చెప్పింది. నటన పరంగా తల్లి మేనక తనకు స్ఫూర్తి అని చెప్పింది.
సమంత గురించి చెప్పమని కీర్తిసురేష్‌ను ఓ నెటిజన్ అడిగాడు. సమంత అన్‌స్టాపబుల్. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధృడ మనస్తత్వం ఆమెది అంటూ సమంతపై కీర్తిసురేష్ ప్రశంసలు కురిపించింది.