Keerthy Suresh Baby John teaser: కీర్తి సురేశ్ బేబీ జాన్ టీజర్ వచ్చేసింది.. తెరి హిందీ రీమేక్ ఇది
Keerthy Suresh Baby John teaser: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి కీర్తి సురేశ్ నటిస్తున్న మూవీకి బేబీ జాన్ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ టీజర్ సోమవారం (ఫిబ్రవరి 5) రిలీజైంది.
Keerthy Suresh Baby John teaser: టాలీవుడ్ నటి కీర్తి సురేశ్, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న సినిమాకు బేబీ జాన్ అనే టైటిల్ పెట్టారు. ఇన్నాళ్లూ వీడీ18గా పిలిచిన ఈ మూవీకి ఓ బలమైన టీజర్ తో బేబీ జాన్ అనే టైటిల్ పెట్టినట్లే మేకర్స్ వెల్లడించారు. 65 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో కేవలం వరుణ్ ధావన్ మాత్రమే కనిపించాడు.
తెరి రీమేక్ బేబీ జాన్
తమిళంలో విజయ్ నటించిన తెరి మూవీకి రీమేక్ గా ఈ బేబీ జాన్ వస్తోంది. నిజానికి తెలుగులో పవన్ కల్యాణ్ లేదా రవితేజతో ఈ రీమేక్ వస్తోందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. హిందీలో మాత్రం మూవీ ఇప్పటికే రిలీజ్ కు రెడీ అవుతోంది. బేబీ జాన్ మేకర్స్ టైటిల్, టీజర్ తోపాటు రిలీజ్ డేట్ నూ అనౌన్స్ చేశారు. ఈ మూవీ మే 31వ తేదీన రిలీజ్ కానుంది.
ఈ బేబీ జాన్ మూవీలో కీర్తి సురేశ్ తోపాటు వామికా గబ్బి కూడా నటిస్తోంది. జవాన్ డైరెక్టర్ అట్లీ సినిమాను సమర్పిస్తుండగా.. ప్రియా అట్లీ నిర్మిస్తోంది. కలీస్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. కీర్తి సురేశ్ ఈ మధ్యే ఎల్లో కలర్ శారీలో దిగిన ఫొటోలను అభిమానులను పంచుకుంటూ.. ఈ వీడీ18 మూవీని ట్యాగ్ చేసింది. తాజాగా ఈ మూవీకి బేబీ జాన్ అనే టైటిల్ పెట్టారు.
బేబీ జాన్ టీజర్ ఎలా ఉందంటే?
బేబీ జాన్ టీజర్ లో కీర్తి సురేశ్ గానీ, ఇతర పాత్రలేవీ కనిపించలేదు. కేవలం వరుణ్ ధావన్ మాత్రమే చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ కు హైలైట్ గా చెప్పొచ్చు. టీజర్ ఇంటెన్సిటీకి తగినట్లుగా తమన్ మ్యూజిక్ ఉంది. వరుణ్, కీర్తి, వామికాతోపాటు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
జియో స్టూడియోస్ ఈ బేబీ జాన్ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ థియేటర్లలో రిలీజైన తర్వాత జియో సినిమాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరిసారి జాన్వీ కపూర్ తో కలిసి బవాల్ మూవీలో వరుణ్ ధావన్ నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత రణ్‌వీర్ సింగ్ నటించిన రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.
మరోవైపు వరుణ్.. సమంతతో కలిసి సిటడెల్ వెబ్ సిరీస్ లోనూ నటించాడు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ మధ్యే సమంతతో కలిసి డబ్బింగ్ పనులు కూడా వరుణ్ పూర్తి చేశాడు. ఈ సిరీస్ స్ట్రీమిండ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. ఇక కీర్తి సురేశ్ ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సైరెన్, రఘుతాత, రివాల్వర్ రీటా తమిళ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.