KBC Quiz Show: ఈ ప్రశ్న విలువ రూ.కోటి.. మీకు స్పోర్ట్స్ నాలెడ్జ్ బాగా ఉందా? అయితే దీనికి సమాధానం చెప్పండి చూద్దాం
KBC Quiz Show: మీకు మంచి స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉందా? అందులోనూ టెన్నిస్ గురించి పూర్తి అవగాహన ఉందా? అయితే రూ.కోటి విలువైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో చూడండి. కేబీసీ క్విజ్ షోలో ఓ కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.
KBC Quiz Show: కేబీసీ.. కౌన్ బనేగా క్రోర్‌పతి 16వ సీజన్ ఈ మధ్యే ప్రారంభమైన విషయం తెలుసు కదా. ఎప్పటిలాగే ఈ షో ఆసక్తికరమైన ప్రశ్నలతో అటు కంటెస్టెంట్లను ఇటు షో చూసే వ్యూయర్స్ ను అలరిస్తోంది. తాజాగా నరేషి మీనా అనే ఓ కంటెస్టెంట్.. రూ.కోటి గెలిచేలా కనిపించినా స్పోర్ట్స్ కు సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే?
రూ.కోటి విలువైన ప్రశ్న ఇదే..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కేబీసీ 16లో నరేషి మీనా అనే ఓ కంటెస్టెంట్ వచ్చారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆమె స్టోరీ విని బిగ్ బీ కూడా కంటతడి పెట్టాడు. ఈ షోలో వచ్చే ప్రైజ్ మనీతో తాను చికిత్స చేయించుకుంటానని ఆమె చెప్పడం విని అమితాబ్ కరిగిపోయాడు. ఆ చికిత్సకు అవసరమైన సొమ్ము తాను ఇస్తానని అతడు చెప్పడం విశేషం.
అయితే ఆ నరేషి మీనా ఈ సీజన్లో తొలి క్రోర్‌పతి అయ్యేలా కనిపించారు. ఆమె ముందు రూ.కోటి విలువైన ప్రశ్న ఉంచాడు బిగ్ బీ. కానీ ఆమె మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే.. "వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ లో లీలా రౌ దయాల్ ఎవరిని ఓడించి ఇండియా తరఫున సింగిల్స్ మ్యాచ్ గెలిచి తొలి భారతీయురాలిగా నిలిచింది?" అని బిగ్ బీ అడిగాడు. దీనికి ఇచ్చిన ఆప్షన్లు.. లాటీ డాడ్, గ్లాడిస్ సౌత్‌వెల్, మే సేటన్, కిట్టీ గాడ్‌ఫ్రే.
సరైన సమాధానం ఏంటంటే?
ఈ ప్రశ్న నరేషిని అయోమయానికి గురి చేసింది. ఆమె ఆప్షన్ బి, డి మధ్య ఏది సరైనదో తేల్చుకోలేక గేమ్ ను క్విట్ చేసింది. దీంతో రూ.50 లక్షలతో ఆమె సరిపెట్టుకుంది. క్విట్ అయిన తర్వాత ఏదో ఒక సమాధానం అంచనా వేయాల్సిందిగా అడగ్గా.. ఆమె ఆప్షన్ ఎ.. లాటీ డాడ్ పేరు చెప్పింది. కానీ ఆ సమాధానం తప్పని తేలింది.
నిజానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం గ్లాడిస్ సౌత్‌వెల్. 1934లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ లో లీలా ఈ ఘనత సాధించింది. ఆమె ఆ మరుసటి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లోనూ రెండో రౌండ్ చేరుకుంది.
ఎవరీ నరేషి మీనా?
కేబీసీ 16 షోలో రూ.50 లక్షలు గెలుచుకున్న కంటెస్టెంట్ నరేషి మీనాది రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్. ఆమె కథ విని షోలో ఉన్న వాళ్లంతా ఎమోషనల్ అయ్యారు. ఓ చిన్న గ్రామం నుంచి ఈ స్థాయికి రావడమే కాదు.. హాట్‌సీట్ పై కూర్చొని రూ.కోటి ప్రశ్న వరకూ వచ్చింది. అయితే 27 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడిందట.
ఈ తాజా ఎపిసోడ్ గురువారం (ఆగస్ట్ 22) టెలికాస్ట్ అయింది. ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. ఇప్పటికే తన ట్యూమర్ కు చికిత్స చేయించుకున్న నరేషి మీనా.. ఈ వచ్చిన డబ్బులతోనూ మిగిలిన చికిత్స చేయించుకుంటానని చెప్పింది.