Kasthuri Shankar: తెలుగు వాళ్లపై నోరు జారి కనిపించకుండా పోయిన తమిళ నటి.. కస్తూరి ఎక్కడ?-kasthuri shankar tamil actress gone hiding after her disrespectful comments on telugu people ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kasthuri Shankar: తెలుగు వాళ్లపై నోరు జారి కనిపించకుండా పోయిన తమిళ నటి.. కస్తూరి ఎక్కడ?

Kasthuri Shankar: తెలుగు వాళ్లపై నోరు జారి కనిపించకుండా పోయిన తమిళ నటి.. కస్తూరి ఎక్కడ?

Hari Prasad S HT Telugu
Nov 12, 2024 03:14 PM IST

Kasthuri Shankar: తమిళ నటి కస్తూరి శంకర్ కనిపించకుండా పోయింది. ఈ మధ్య తెలుగు వారిపై నోరు పారేసుకున్న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచీ కస్తూరి కనిపించడం లేదన్న వార్తలు వస్తున్నాయి.

తెలుగు వాళ్లపై నోరు జారి కనిపించకుండా పోయిన తమిళ నటి.. కస్తూరి ఎక్కడ?
తెలుగు వాళ్లపై నోరు జారి కనిపించకుండా పోయిన తమిళ నటి.. కస్తూరి ఎక్కడ?

Kasthuri Shankar: ఒకప్పుడు నాగార్జునతో కలిసి అన్నమయ్య మూవీలో నటించిన కస్తూరి గుర్తుందా? ఆ తర్వాత కూడా ఎన్నో తెలుగు సినిమాలు, సీరియల్స్ తో తెలుగువారికి దగ్గరైన తమిళ నటి ఆమె. ఈ మధ్యే తెలుగు వారిపై నోరు పారేసుకోవడంతో ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి పలు కేసులు నమోదు కావడంతో కస్తూరి కనిపించకుండా పోయిందని మనీకంట్రోల్ రిపోర్టు వెల్లడించింది.

కస్తూరి శంకర్ ఎక్కడ?

తమిళనాడుకు చెందిన కస్తూరి కొన్ని రోజుల కిందట తెలుగు వారి గురించి అభ్యంతరకర రీతిలో మాట్లాడింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పినా.. అక్కడి తెలుగు వాళ్లు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. కస్తూరిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఆమెను వెతుక్కుంటూ పోలీసులు ఇంటికి వెళ్లగా.. తాళం వేసి ఉంది.

ఆమె మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉన్నట్లు తేలింది. అభ్యంతరకర వ్యాఖ్యలు, అగౌరవపరిచేలా వ్యవహరించిందన్న ఆరోపణల నేపథ్యంలో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. అయితే కస్తూరి అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత కూడా కస్తూరి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంది. ఆమె ఎక్కడ ఉందన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

అసలు కస్తూరి ఏమన్నదంటే?

కస్తూరి ఈ మధ్య అక్కడి డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తెలుగువారి ప్రస్తావన తీసుకొచ్చింది. కొన్ని వందల ఏళ్ల కిందట రాజుల కాలంలో తెలుగు వారు తమిళనాడుకు వచ్చి అక్కడి అంత:పురాలలోని మహిళలకు సేవలు చేసేవారని, అలా వచ్చిన వాళ్లు ఇప్పుడు తమను తాము తమిళులుగా చెప్పుకుంటున్నారని కస్తూరి కామెంట్ చేసింది. తమిళనాడులో బ్రాహ్మణులపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఆమె ఇలా మాట్లాడింది.

అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కస్తూరి వెనక్కి తగ్గింది. తాను కూడా తెలుగు వ్యక్తినే అని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది. తెలుగు వాళ్లపై తాను చేసిన వ్యాఖ్యలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు కూడా చెప్పింది. అయినా అక్కడి తెలుగు వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమెపై కేసులు నమోదు చేయడంతో ఇప్పుడు కస్తూరి కనిపించకుండా పోయింది.

ఎవరీ కస్తూరి శంకర్?

కస్తూరి శంకర్ ఓ సీనియర్ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళం సినిమాలు, సీరియల్స్ లో నటించింది. 1991లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 1992లో వచ్చిన గ్యాంగ్ వార్ అనే సినిమా ద్వారా తెలుగు వాళ్లకు పరిచయమైంది.

ఆ తర్వాత భారతీయుడు, అన్నమయ్యలాంటి సినిమాల ద్వారా పేరు సంపాదించింది. ఈ మధ్యే తెలుగులో వచ్చిన సింబా అనే మూవీలోనూ కనిపించింది. పలు తెలుగు టీవీ సీరియల్స్ లోనూ నటించింది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తోపాటు పలు ఇతర టీవీ షోలలోనూ కనిపించింది.

Whats_app_banner