కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 14: పారిజాతాన్ని తిట్టిపోసిన అనసూయ.. దాసును అడ్డుకున్న కార్తీక్.. జ్యోత్స్నలో భయం-karthika deepam today episode may 14th 2025 karthik stops dasu jyothsna doubt grows star maa tv serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 14: పారిజాతాన్ని తిట్టిపోసిన అనసూయ.. దాసును అడ్డుకున్న కార్తీక్.. జ్యోత్స్నలో భయం

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 14: పారిజాతాన్ని తిట్టిపోసిన అనసూయ.. దాసును అడ్డుకున్న కార్తీక్.. జ్యోత్స్నలో భయం

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 14: మారువేషంలో వచ్చిన పారుజాతాన్ని తిట్టేస్తుంది అనసూయ. దాసు నిజం చెప్పబోతే కార్తీక్ అడ్డుకుంటాడు. జ్యోత్స్నకు ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందేనని అంటాడు. దాసును కలిసేందుకు జ్యో నిర్ణయించుకుంటుది. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 14: పారిజాతాన్ని తిట్టిపోసిన అనసూయ.. దాసును అడ్డుకున్న కార్తీక్.. జ్యోత్స్నలో భయం

కార్తీక దీపం 2 నేటి (మే 14, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. చెత్త ఏరుకునే మనిషిలా మారువేషంలో వచ్చిన పారిజాతం.. వస్తువు కింద పడడంతో అనసూయ వస్తుందేమోనని పారిపోతుంటుంది. ఇంతలో అనసూయ అక్కడికి వస్తుంది. ఏవమ్మా.. ఆగు అంటూ అరుస్తుంది. దీని కంట్లో పడ్డానేంటి.. నన్ను కనిపెట్టేస్తుందా ఏంటి అని పారిజాతం భయపడుతుంది. చెత్త ఏరుకునే దానివి లోపల నీకేంటి పని అని అనసూయ ప్రశ్నిస్తుంది. తలెత్తి మాట్లాడు అని గట్టిగా అంటుంది. గుర్తు పట్టకుండా ఎక్స్ ప్రెషన్స్ మారుతుంది పారిజాతం. లోపలికి ఎందుకు వచ్చావ్ అని అనసూయ అడుగుతుంది. నన్ను గుర్తుపట్టలేదు అని పారిజాతం అనుకుంటుంది.

ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే..

తినడానికి ఏదైనా ఉందేమోనని లోపలికి వచ్చానని మారువేషంలో ఉన్న పారిజాతం అంటుంది. అడిగితే పెట్టేదాన్ని కదా అని అనసూయ అంటుంది. ఈ మధ్య దొంగలు కూడా మారువేషాల్లో తిరుగుతున్నారని చెబుతుంది. నేను దొంగను కాదులే అని పారిజాతం అంటే.. ఈ గొంతు ఎక్కడో విన్నట్టు ఉందని అనూసయ అంటుంది. ఏదో తేడా ఉందని అనుమానిస్తుంది.

చెత్త వాళ్ల దగ్గరే చెత్త ఏరుకునే రకం

నా గొంతులో మీకు గుర్తొచ్చిన ఆ గొప్ప మనిషి ఎవరమ్మా అని పారిజాతం అడుగుతుంది. ఆవిడేం అంత గొప్పది కాదులే అంటూ తిట్ల దండకం మొదలుపెట్టేస్తుంది అనసూయ. ఆవిడ గొప్పది కాదు.. చెత్త వాళ్ల దగ్గరే చెత్త ఏరుకునే రకం అని అంటుంది. ఆవిడ పేరు ఏంటమ్మా అని పారు అడుగుతుంది. పారిజాతం అని ఒక ఆవిడ ఉందిలే అని అనసూయ అంటుంది. “మంగళవారం మంచిది కాదంటారు, పిల్లి ఎదురొస్తే అశుభం అంటారు, కొబ్బరికాయ కుళ్లిపోతే దరిద్రం అంటారు. ఆ మనిషి వీటన్నింటి కంటే ప్రమాదం. ఆవిడ కన్ను పడిందంటే ఏదైనా సర్వనాశనమే” అని తిట్టేస్తుంది అనసూయ. మారువేషంలో వచ్చిన పారిజాతం తనను అన్ని మాటలు అంటున్నా భరిస్తూనే ఉంటుంది.

పరిగెత్తిచ్చి కొట్టేదాన్ని

మీరు ఇలా అంటున్నారని ఆ మనిషికి తెలిస్తే ఊరుకుంటుందా అని పారిజాతం అంటుంది. వెనకాలి వాళ్ల ముఖం చూసి ఆవిడ దగ్గర తగ్గి ఉండడమే కానీ కానీ, లేకపోతే ఆ పేడ ముఖం దాన్ని చీపురుకట్ట విరిగేలా పరిగెత్తిచ్చి.. పరిగెత్తిచ్చి కొడతా అని అనసూయ అంటుంది. మా మీద మససులో ఎంత కక్ష పెట్టుకున్నావే అని పారిజాతం అనుకుంటుంది. అనసూయ మాత్రం తిట్టేస్తూనే ఉంటుంది. ఆ చెడాలం గురించి నీకు ఎందుకులే అని అంటుంది. మిగిలిన టిఫిన్ పెడతానంటే.. పారిజాతం వద్దంటుంది. నువ్వేమైనా చుట్టానివా వేడివేడిగా పెట్టేందుకు అని అనసూయ విసుక్కుంటుంది.

మారువేషంలో ఉన్నా కాబట్టి వదిలేశాను కానీ.. లేకపోతే బత్తాయి పిండినట్టు పిండేసే దాన్ని అని పారిజాతం అనుకుంటుంది. దీప వచ్చిందని చేసిన పాయసం తెచ్చి ఇస్తుంది. నా మేనకోడలు కోలుకున్నందుకు చేశామని అంటుంది. అది చచ్చి ఉంటే మేం ఇంకా గట్టిగా సెలెబ్రేట్ చేసుకునే వారం అని మనసులో అనుకుంటుంది పారిజాతం. స్పూన్ తెచ్చి ఇవ్వాలని అడిగితే.. చేత్తో తిని అనసూయ మళ్లీ చిరాకు పడుతుంది. పక్కకు వెళ్లి తింటానని పారు చెబుతుంది.

అమ్మా అని పిలిచిన దాసు.. పారు వణుకు

ఇంతలో దాసు, కాశీ, స్వప్న ఆటో దిగి కార్తీక్ ఇంట్లోకి వస్తుంటారు. దీంతో తనను గుర్తు పడతారేమోనని పారిజాతం కంగారు పడుతుంది. గుర్తు పట్టేలోపు పక్కకు వెళ్లాలని అనుకుంటుంది. ఇంతలో మారువేషంలో ఉన్న పారిజాతాన్ని అమ్మా అని దాసు పిలుస్తాడు. దీంతో నన్ను గుర్తు పట్టేశాడా అని పారిజాతం వణికిపోతుంది. ఇలా రా అని దాసు మళ్లీ పిలుస్తాడు. అక్కడ ఎవరో వాటర్ బాటిల్స్ తాగి పడేశారు.. అవి తీయకుండా వెళ్లిపోతున్నావ్ అని దాసు అంటాడు. వాటర్ బాటిలా.. గుర్తు పట్టాడేమోనని భయపడ్డానని మనసులో అనుకుంటుంది పారిజాతం.

వీళ్లంతా ఇక్కడ మీటింగ్ పెట్టారంటే ఏదో జరగబోతోంది.. మనవరాలా నీ అంచనా కరెక్టే.. మనకు ఏదో కొత్త విషయం తెలియబోతోందని ఆలోచిస్తుంది పారు.

దీప గాయానికి డ్రెస్సింగ్ చేస్తుంటాడు కార్తీక్. నర్సును రమ్మనాల్సిందని స్వప్న అంటుంది. అయినా నా భార్యకు నేను డ్రెస్సింగ్ చేస్తే తప్పు ఏముందని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఎలా ఉంది వదినా అని దీపను స్వప్న అడుగుతుంది. బావ ఆసుపత్రికి రావొద్దన్నాడు అని కాశీ అంటాడు. మీరు బాధపడతారనే రావొద్దంది లే అని కార్తీక్ అంటాడు. ఎలా ఉన్నారు బాబాయ్ అని దాసును దీప పలుకరిస్తుంది. వీరి మాటలను పారిజాతం చాటుగా వింటూ ఉంటుంది.

పోలీసులు ఇంకా పట్టుకోకపోవడం ఏంటి!

దీపకు ఏం జరగనుందుకు సంతోషంగా ఉంది.. కానీ ఇంటికి వచ్చి మరీ చంపే ప్రయత్నం చేశారంటే సంతోషించే విషయం కాదు అని దాసు అంటాడు. ఇవన్నీ బాబాయికి ఎలా తెలుసు అని దీప అంటే.. నేనేం చెప్పలేదక్కా అని కాశీ అంటాడు. ఎవరు చెబితే ఏంలే అని దాసు అంటాడు. పొడిచిన వెధవను తొందరలోనే పోలీసులు పట్టుకుంటారని అనసూయ అంటుంది. పొడిచింది ఎవరో తెలిశాక ఇంకా పోలీసులు పట్టుకోకపోవడం ఏంటి అని దాసు అంటాడు. వదినను ఎవరు పొడిచారో మీకు తెలుసా మామయ్య అని స్వప్న అడిగితే.. నాకు అన్నీ తెలుసు అని దాసు అంటాడు.

నిజం చెప్పకుండా దాసును ఆపిన కార్తీక్

దాసు మామయ్య అన్నీ చెప్పేసేలా ఉన్నాడేంటి అని కార్తీక్ కంగారు పడతాడు. అంటే నాకు అంతా గుర్తొచ్చిందా, నిన్ను ఎవరు కొట్టారో గుర్తొచ్చిందా నాన్న అని కాశీ అడుగుతాడు. దాసు ఏం చెబుతాడో అని పారిజాతం చాటుగా టెన్షన్‍గా చూస్తుంటుంది. అంతా గుర్తుంది.. అన్నీ గుర్తున్నాయ్ అని దాసు అంటాడు. దాసుకు గతం గుర్తొచ్చింది అని పారు అనుకుంటుంది. ఎవరు నిన్ను కొట్టింది కాశీ అడిగితే.. నన్ను కొట్టింది అని జ్యోత్స్న పేరు చెప్పబోతాడు దాసు. అయితే, నిజాలు చెప్పకుండా కార్తీక్ అడ్డుకుంటాడు. దాసు భుజంపై చేయి వేసి ఎవరు నిన్ను కొట్టింది అని అడిగి.. చెప్పొద్దు అనేలా తల ఊపుతాడు. దాసు నిజం చెప్పకుండా కార్తీక్ ఆపేస్తాడు. ఇది అర్థం చేసుకున్నా దాసు మళ్లీ గతం మరిచిపోయినట్టుగా కావాలనే మాట్లాడతాడు. ఎవరైనా ఎందుకు కొడతారు అని తికమకగా మాట్లాడతాడు.

వీడేంటి మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు అని పారిజాతం అనుకుంటుంది. ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో కంగారు పడుతుంది. ఎక్కడో ఫోన్ రింగ్ అవుతుందని శౌర్య అంటే.. నాదే అయి ఉంటుందిలే అని కార్తీక్ అంటాడు. మామయ్య ఇలా రా అని దాసును పిలుస్తాడు కార్తీక్. బావా.. నాన్నకు ఏదో గుర్తొచ్చింది.. అక్కడ ఎవరు పొడిచాడో తెలుసని నాన్న అంటున్నాడు అని కాశీ అంటాడు. మామయ్య పరిస్థితి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి కాశీ అని కవర్ చేస్తాడు కార్తీక్. నిన్ను ఎవడే ఫోన్ చేయమన్నాడని ఫోన్‍తో జ్యోత్స్నపై చిరాకు పడుతుంది పారిజాతం. వచ్చాక చెబుతానని కాల్ కట్ చేస్తుంది. ఇక్కడి నుంచి బయటపడాలి అంటూ వెళ్లిపోతుంది.

గతం గుర్తురానట్టే నటించాలి

నిజం గుర్తు లేనట్టే ఉండాలి అని చెప్పా కదా అని దాసుతో కార్తీక్ అంటాడు. దీపను ఆ పరిస్థితిలో చూసి బాధగా అనిపించింది.. తట్టుకోవడం నాకు కాలేదు అని దాసు చెబుతాడు. దీపపై హత్యాయత్నం చేయించింది జ్యోత్స్నే అని నాకు అనిపిస్తోందని అనుమానిస్తాడు. జ్యోత్స్నకు మనమే తప్పు చేసే అవకాశం ఇస్తున్నామా అనిపిస్తుందని అంటాడు. అగ్రిమెంట్ రాయించుకున్న సంతోషంలో జ్యోత్స్న ఉంటుందని, ఇలా ఆవేశపడి నిజాలు బయటపెడితే అసలు ఏం జరిగిందో తెలియకుండా పోతుందని కార్తీక్ అంటాడు. దీపను కత్తితో పొడిచిన మనిషిని జ్యోత్స్న పంపించిందని రుజువేంటి అని కార్తీక్ అంటాడు. అంతా తెలుసుకోకుండా ఆవేశపడితే జ్యోత్స్న జాగ్రత్త పడుతుందని చెబుతాడు. అది కూడా నిజమేనని దాసు అంటాడు. జ్యోత్స్నకు బుద్ధి వచ్చేలా చేయాలంటే నువ్వు గతం గుర్తు రానట్టే నటించాలని దాసుకు కార్తీక్ చెబుతాడు.

వినేసిన కాశీ.. కార్తీక్ కంగారు

దీప.. సుమిత్రత్త కూతురు అనే విషయం ఎవరికీ తెలియకూడదు అని కార్తీక్ అంటాడు. ఇంతలో అక్కడికి కాశీ వస్తాడు. వినేశాడా అని కార్తీక్, దాసు కంగారు పడతారు. ఏంటి బావ.. ఎవరికీ తెలియకూడదని అంటున్నావ్ అని కాశీ అడుగుతాడు. వినలేదులే అని కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు. ట్యాబ్లెట్స్ గురించి అని కార్తీక్ కవర్ చేస్తాడు. మామయ్యను ఏమీ అడిగి ఇబ్బంది పెట్టకు కాశీ అని అంటాడు.

మామయ్యను ఆపడం కష్టమే.. నిజం చెప్పేలోపు జ్యోత్స్న స్థానంలో దీపను పెట్టాలి.. ముక్కలు అయిపోయిన ఈ కుటుంబాన్ని కలపాలని కార్తీక్ అనుకుంటాడు.

జ్యోకు వీడియో చూపించిన పారిజాతం

నాకు అన్నీ తెలుసు అంటూ దాసు మాట్లాడిన మాటలను మారువేషంలో వచ్చిన పారిజాతం ఫోన్‍లో వీడియో రికార్డు చేసి ఉంటుంది. దీన్ని జ్యోత్స్నకు చూపిస్తుంది. దీపను ఎవరు పొడిచాడో, వాడిని ఎవడు కొట్టాడో తెలుసు అంటాడు.. కానీ సడెన్‍గా చెప్పడం ఆపేశాడు. చూస్తే పక్కన కార్తీక్ ఉన్నాడు అని పారిజాతం అంటుంది.

జ్యోలో భయం

“చూస్తుంటే గ్రానీ కొడుక్కి గతం గుర్తొచ్చినట్టు ఉంది, బావను చూడగానే ఆగడం ఏంటి. దీపను దీసుకొని బావ ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏవో నిజాలు తెలిసినట్టుగా మాట్లాడాడు. ఏం జరిగింది” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నీ కొడుకును చూస్తుంటే నీకు అనుమానం రావడం లేదా అని జ్యో అడుగుతుంది. ఆ వాడికి ఏ గతం గుర్తు రాలేదని పారిజాతం అంటుంది. గెటప్ గురించి ఇద్దరూ కౌంటర్లు వేసుకుంటారు. తన అసలైన తండ్రి దాసుకు గతం గుర్తొచ్చిందేమోనన్న భయం జ్యోత్స్నలో మొదలైపోయింది.

రేపు నాన్న దగ్గరికి వెళ్లాలి

రేపు ఒకసారి నాన్న దగ్గరికి వెళ్లాలని జ్యోత్స్న అంటుంది. ఏ నాన్న, ఎవరమ్మా అని పారిజాతం అంటుంది. దాసు అని జ్యో చెబుతుంది. మళ్లీ ప్రేమ పుట్టుకొచ్చిందా అని పారు అంటే.. పోతే కదా అని జ్యో అంటుంది. మొన్న నాన్న అంటే తిట్టావ్ అని పారు అంటే.. అప్పుడు చిరాకులో ఉన్నానని కవర్ చేస్తుంది జ్యో. రేపు మనం నాన్న దగ్గరికి వెళుతున్నాం.. ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది జ్యోత్స్న. అందరి కంటే నాకు ఇదే డేంజరస్‍గా కనిపిస్తోందని పారిజాతం అనుకుంటుంది. దీప ఏదో ఒకటి అయితే గాని ఇది ప్రశాంతం ఉండదని ఆలోచిస్తుంది.

మీరు చెప్పిన అబద్ధాల గురించి..

దీపతో శౌర్య మాట్లాడుతుంటుంది. ఏంటి రౌడీ ఏం మాట్లాడుతున్నావ్ అని కార్తీక్ అడిగితే.. మీరు చెప్పిన అబద్ధాల గురించి అని శౌర్య బదులిస్తుంది. అమ్మ గురించి అడిగితే.. ఎవరికో బాగోలేదని నానమ్మ చెప్పింది, అది నేను నిజమే అనుకున్నానని శౌర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని కార్తీక్ అంటాడు. అమ్మను నువ్వు ఇంటికి తీసుకొచ్చే ముందు చెప్పింది.. ఎవరో పొడిచారని, అప్పుడు నేను ఏడ్చాను అని శౌర్య అంటుంది. ఇంటికి తీసుకొస్తున్నారని చెప్పాక బాధంతా పోయిందని చెబుతుంది.

ఇప్పటికైనా అర్థమైందా బాధలు మనతో ఉండవని కార్తీక్ అంటాడు. దేనికి బాధపడకూడదని అంటాడు. అమ్మకు గాయం మానేవరకు కింద పడుకుందామని చెబుతాడు. నానమ్మ దగ్గర పడుకుంటానని వెళుతుంది శౌర్య. దీపకు ట్యాబ్లెట్స్ ఇస్తాడు కార్తీక్. తొందరలోనే కోలుకుంటావని డాక్టర్ చెప్పాడులే అని కార్తీక్ అంటాడు. మీరు ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తొందరగా కోలుకోకుండా ఎలా ఉంటానని దీప అంటుంది. శౌర్య లాకెట్ ఇక్కడ వదిలేసినట్టు ఉందని దీప అంటాడు. ఆ లాకెట్ చూస్తూ.. సుమిత్ర, దశరథ్‍ల అసలైన కూతురు, ఆ ఆస్తికి వారసురాలు దీపే అని దాసు చెప్పిన నిజాన్ని మళ్లీ గుర్తు చేసుకుంటాడు కార్తీక్. దీప వైపు తదేకంగా చూస్తాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 14) ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం