కార్తీక దీపం 2 నేటి (మే 13, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్నను చేయి పట్టుకొని గదిలోకి లాక్కొస్తుంది పారిజాతం. “దీపను ఎవరితో పొడిపించావో చెప్పు” అని పారు అడుగుతుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎవరు ఆ ముసుగు మనిషి అని పారు అడుగుతుంది. మీ తాత లైసెన్స్డ్ గన్‍లో బుల్లెట్ ఏం చేశావంటూ మరో ప్రశ్న వేస్తుంది. నీకేమైంది, నీకేమైంది గ్రానీ అని జ్యో అంటుంది. ఊరికే నన్ను అనుమానించొద్దని చెబుతుంది. తానేమీ చేయలేదని చెబుతుంది.
నా అనుమానం నిజం కాదంటావా అని పారిజాతం అడుగుతుంది. మరి కార్తీక్ ఇంటికి వచ్చాడని ప్రశ్నిస్తుంది. ఎందుకొచ్చాడో చెప్పాడు కదా అని జ్యో అంటుంది. “ఇంతకు ముందు కార్తీక్‍లా వాడు రాలేదు. ఏదో పద్ధతిగా, ఏదో కొత్త విషయం తెలిసిన వాడిలా మాట్లాడుతున్నాడు. అది నాకెలా తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. మరి వాడు మాట్లాడుతుంటే నువ్వెందుకు భయపడిపోతున్నావని పారు అడుగుతుంది. నువ్వు చూశావా అంటే.. వాడు దీప గురించి చెబుతుంటే నువ్వు భయపడ్డావని అంటుంది. కానీ వాడు అసలు విషయం చెప్పలేదని నాకు అర్థమైందని చెబుతుంది.
నువ్వు ఏదో చేశావ్, వాడు అది అందరి ముందు చెప్పకుండా ఇన్‍డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు అని పారిజాతం అంటుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అడుగుతుంది. కార్తీక్‍తో సంతకాలు పెట్టించుకున్న పేపర్లను పారిజాతానికి చూపిస్తుంది జ్యోత్స్న. బావ అలా మాట్లాడడానికి కారణం ఇది అని చెబుతుంది. ఖాళీ పేపర్లా అని పారు అడిగితే.. బావ సంతకాలు కనిపించడం లేదా అంటుంది.
ఇది ఎందుకు అని పారిజాతం అంటుంది. ఇది బావకు, నాకు జరిగిన అగ్రిమెంట్ అని జ్యోత్స్న అంటుంది. కంగారులో గట్టిగా అరుస్తుంది పారు. ఇంట్లో ఎవరికీ తెలియదు.. గట్టిగా అరవకు అని జ్యో వారిస్తుంది. బావను నా కాళ్ల దగ్గరికి తెచ్చుకోవడానికి ఈ అగ్రిమెంట్ పనికి వస్తుందని జ్యోత్స్న అంటుంది. దీప ఆపరేషన్‍కు రక్తదాతలను పంపేందుకు కార్తీక్‍కు తాను పెట్టిన కండీషన్ల గురించి పారిజాతానికి చెబుతుంది. ఏమైనా చేస్తానని కార్తీక్‍తో పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నానని అంటుంది. వేరే దారి లేక భార్యను కాపాడుకునేందుకు అగ్రిమెంట్‍పై బావ సైన్ చేశాడని జ్యో అంటుంది.
కార్తీక్ గాడిని ఎంత దెబ్బ కొట్టావే.. అంతా నా పోలికలే అని పారిజాతం మురిసిపోతుంది. కానీ దీని గురించి కార్తీక్ ఇంట్లో ఎందుకు చెప్పలేదని అంటుంది. నువ్వు నాకో హెల్ప్ చేయాలని పారిజాతాన్ని జ్యో అడుగుతుంది. ఏదో ప్లాన్ చెబుతుంది. అది నేనే ఎందుకు చేయాలని పారు అడిగితే.. నా కోసమని జ్యో అంటుంది. నాతో మాత్రం అన్నీ చెప్పాలని పారు అడుగుతుంది. ఏదైనా చేస్తే చెప్పవే.. ఇరుక్కోకుండా కాపాడతా అని అంటుంది. ముందు నేను చెప్పింది చెయ్ అంటూ జ్యోత్స్న తప్పించుకుంటుంది. దశరథ్‍కు దీపపై కోపం లేదని, దీప తనను కాల్చలేదని నమ్ముతున్నాడని పారు అంటుంది. మరి ఎవరు కాల్చి ఉంటారే అని అడుగుతుంది. జ్యో నిజం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. మా డాడీకి నా మీదే అనుమానం ఉందని నీకు తెలియదు కదా అని మనసులో అనుకుంటుంది జ్యో.
దీపను కార్తీక్ ఇంటికి తీసుకొస్తాడు. అనసూయ వారికి దిష్టి తీస్తుంది. దీపను జాగ్రత్తగా కూర్చొబెడతాడు కార్తీక్. శౌర్యను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది దీప. మళ్లీ ప్రాణాలతో ఈ ఇంటికి వస్తాననుకోలేదు అని ఎమోషనల్ అవుతుంది దీప. నీ పంచ ప్రాణాలు, ఆరో ప్రాణాలు ఇక్కడే ఉన్నాయి కదా అని శౌర్య, కార్తీక్ గురించి అనసూయ అంటుంది. నొప్పిగా ఉందా అని దీపను శౌర్య అడుగుతుంది.
కాంచన మాత్రం కోపంగా ఉంటుంది. ఏమైంది అలా ఉన్నావ్ అని కార్తీక్ అడుగుతాడు. ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి రాకుండా.. ఆ ఇంటికి ఎందుకు వెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అనసూయ. ఉన్న గొడవలు సరిపోవా.. మా నాన్న రెచ్చగొట్టి రావాలా అని ప్రశ్నిస్తుంది.
నీ మేనకోడలు.. జ్యోత్స్న ఫోన్ చేసిందా అని కార్తీక్ అడుగుతాడు. మేనకోడలైనా.. జ్యోత్స్న అయినా అదే కదా అని కాంచన అంటుంది. “కాదమ్మా.. నీ అసలైన మేనకోడలు దీప. జ్యోత్స్న.. దాసు మామయ్య కూతురు. వరసకు అన్నయ్య అవుతాడు కాబట్టి జ్యోత్స్న కూడా నీకు మేనకోడలే. కానీ రక్తబంధం అంటే దీపనే. జ్యోత్స్న కాదు” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. దశరథ్, సుమిత్రల అసలు కూతురు దీపే అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. కానీ ఆ విషయం బయటికి చెప్పడు.
నేను దీపను బతికించుకున్నానని చెప్పడానికే అక్కడికి తీసుకెళ్లానని కార్తీక్ అంటాడు. దీపకు మంచి జరిగితే వాళ్లకు నచ్చదు అని కాంచన అంటుంది. అది దీప పుట్టిల్లు, ఎప్పటికైనా వాళ్లకు దగ్గర చేయాల్సిందేనని ఆలోచిస్తాడు కార్తీక్. నువ్వు చేసింది నచ్చలేదు రా అని కాంచన అంటుంది. దీపను లోపలికి తీసుకెళ్లాలని అనసూయను కార్తీక్ అడుగుతాడు. కాంచన మాత్రం ఇంకా కోపంగానే ఉంటుంది.
“కొన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి.. నీ సంకల్పం గట్టిది. నువ్వు కోరుకున్నదే జరిగింది” అని కార్తీక్ అంటాడు. అర్థం కానట్టు చూస్తుంది కాంచన. మేనకోడలిని కోడలు చేసుకుంటానని పుట్టినప్పుడే దశరథ్‍తో కాంచన చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు కార్తీక్. నేను కోరుకున్నది ఏం జరిగింది రా అని కాంచన అడుగుతుంది. దీప నా పక్కన ఉండాలని గట్టిగా అనుకున్నావ్ కదా.. అదే జరిగిందని కార్తీక్ అంటాడు. అనసూయ అసలైన మేన కోడలు దీపే అనే విషయాన్ని మాత్రం చెప్పడు.
దశరథ్‍కు జ్యూస్ తెచ్చి ఇస్తుంది జ్యోత్స్న. దశరథ్ అనుమానంగా చూస్తాడు. జ్యూస్ తాగేందుకు కూడా ఆలోచిస్తాడు. జ్యోత్స్న నన్ను చంపాలనుకుంటుంది అన్నయ్య అని దాసు చెప్పిన మాటలను, తనకు బుల్లెట్ తగిలిన విషయాలను దశరథ్ గుర్తు చెసుకుంటాడు. ఎవరు స్వార్థపరులో.. ఎవరు నిజాయితీపరులో తొందరలోనే అన్నీ తేలతాయని కార్తీక్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు. జ్యూస్‍లో ఏమైనా కలిపానని డాడీ అనుకుంటున్నాడా అని జ్యో అనుకుంటుంది. జ్యోత్స్న మీద నాకు ఎందుకు అనుమానం వస్తోంది. దాసును చంపాలని ప్రయత్నించినందుకే అనుమానమా.. లేక ఆ ముసుగు మనిషి జ్యోత్స్ననేనా” అని దశరథ్ మనసులో అనుకుంటాడు.
జ్యూస్ తాగకుండా జ్యోత్స్న ముఖం చూస్తున్నారేంటి అని సుమిత్ర అడుగుతుంది. నాపై నా కూతురికి ఎంత ప్రేమో అని చూస్తున్నానని దశరథ్ అంటాడు. మీ లాంటి పేరెంట్స్ దొరకడం మా అదృష్టమని జ్యోత్స్న అంటుంది. దొరకడం ఏంటే.. మేమేదో నిన్ను పెంచుకున్నట్టు అని సుమిత్ర అడుగుతుంది. అంటే నా అభిప్రాయం వేరు అని జ్యో తడబడుతుంది. మంచి పిల్లలు ఉండడం కూడా అదృష్టమే అని సుమిత్ర అంటుంది. “అలా అయితే మనం దురదృష్టులం సుమిత్ర. మన కూతురి బుద్ధి మంచిది కాదు. దాసుకు గతం గుర్తొస్తే కానీ తన అసలు స్వరూపం తెలియదు. తన ఎందుకు మర్డర్ చేయాలనుకుందో కూడా తెలియదు” అని జ్యో గురించి మనసులోనే ఆలోచిస్తాడు దశరథ్.
“దీప మిమ్మల్ని షూట్ చేసి చంపేందుకు ప్రయత్నించింది. మీకు తగలకపోయి ఉంటే ఆ బుల్లెట్ నాకు తగిలేదేమో. నేను చనిపోయే దాన్ని ఏమో” అని జ్యోత్స్న అంటుంది. అలాంటి మాటలు వద్దు అని సుమిత్ర అంటుంది. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన దీపను ఏమనాలి మమ్మీ అని జ్యోత్స్న కుటిలంగా మాట్లాడుతుంది. దీపను ఎందుకు పలుకరించారు డాడీ అని దశరథ్‍ను జ్యోత్స్న అడుగుతుంది.
అసలు నువ్వు గన్ ఎందుకు తీశావ్ అని జ్యోత్స్నను దశరథ్ ప్రశ్నిస్తాడు. దీంతో జ్యో షాక్ అవుతుంది. నువ్వు గన్ తీసుకునందుకే కదా దీప దాన్ని తీసుకుందని అంటాడు. దీప ఏదైనా చేస్తుందన్న భయంతో అలా చేశానని జ్యో బదులిస్తుంది. దీపకు కూడా అదే భయంతో గన్ తీసుకొని ఉండొచ్చు కదా అని లాజిక్ మాట్లాడతాడు. దీప ఓ మనిషిని చంపలేదని, అలాంటి పని చేయలేదని అంటాడు.
గన్ తీసుకోవడమే కాదు.. షూట్ చేసింది. బుల్లెట్ తరిగిన మీకే ఆ విషయం బాగా తెలుసు అని జ్యో అంటుంది. ఆ గన్ లైసెన్స్డ్ గన్‍లో నుంచి రాలేదని కోర్టులో ప్రూవ్ అయింది కదా అని దశరథ్ అంటాడు. ఇంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు. షూట్ చేసింది దీపే, కార్తీక్ కాపాడాడని అంటాడు. దీపపై దాడి జరిగింది అది కూడా క్లియరే అని చెబుతాడు.
నువ్వు అన్నట్టే ఆలోచిద్దామని దశరథ్ అంటాడు. జ్యూస్ తాగాలని జ్యోత్స్నకు ఇస్తాడు. అనుమానం వస్తుందేమోనని జ్యూస్ తాగేస్తుంది జ్యో. నీ మీద రోజురోజుకు నమ్మకం పోతోందని దశరథ్ మనసులో అనుకుంటాడు. “నా మీద హత్యాయత్నం దీప చేయలేదు. దీప బయటికి వచ్చిన రెండు రోజులకే దీపపై హత్యాయత్నం జరిగింది. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతోంది. నాకు, దీపకు ఎవరో కామన్ శత్రువు ఉన్నారు” అని దశరథ్ అంటాడు. దీంతో జ్యోత్స్న భయపడిపోతుంది. దశరథ్‍ను సత్తిపండుతో కాల్పించింది, గౌతమ్‍ను రెచ్చగొట్టి దీపపై దాడి చేయించింది తెలుస్తుందా అని కంగారు పడుతుంది.
నువ్వేమంటావు జ్యోత్స్న అని దశరథ్ అడుగుతాడు. మీ ఇద్దరికి కామన్ శత్రువు ఎందుకు ఉంటాడు డాడీ అని జ్యో అంటుంది. ఎందుకు ఉండకూడదు అని దశరథ్ అంటాడు. “దీపపై దాడి చేసింది ఎవరు. ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడినట్టుగా అనిపిస్తోంది. ఎవరో ఒకరు దొరకాలి. అప్పుడే ముసుగు వెనుక ఉన్న రూపం ఎవరిదో తెలుస్తుంది” అని దశరథ్ అంటాడు. జ్యో కంగారు పడుతూనే ఉంటుంది. “డాడీకి నా మీద అనుమానం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుంతో తెలుసుకోమని గ్రానీని ఆ ఇంటికి పంపా. ఏం జరుగుతుందో ఏమో” అని మనసులో అనుకుంటుంది జ్యో.
దీప ఇంటికి వచ్చిందుకు వంట గదిలో పాయసం చేస్తూ ఉంటుంది అనసూయ. ఇంతలో అక్కడ ఎవరో వెళ్లినట్టు గమిస్తుంది. ఎవరో వెళ్లినట్టు అనిపిస్తుందే.. చూడడానికి చెత్త ఏరుకునే మనిషిలా ఉందే అనుకుంటుంది. ఆ చెత్త ఏరుకునే మనిషి రూపంలో వచ్చింది పారిజాతమే. కార్తీక్ ఇంట్లో ఏం జరుగుతుందో చాటుగా తెలుసుకోవాలని జ్యోత్స్న చెప్పడంతో ఎవరూ గుర్తు పట్టుకుండా.. పాత దుస్తులు, భుజాన సంచి వేసుకొని చెత్త ఏరుకునే మనిషిలా మారువేషంలో వస్తుంది పారిజాతం.
మనవరాలా.. చివరికి నీ కోసం ఈ గెటప్ వేయాల్సి వచ్చింది కదే అని అనుకుంటుంది పారిజాతం. కార్తీక్ ఇంటికి ముందుకు వస్తుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కోవాలని అన్నావ్.. నాకు ఇంత కంంటే బెటర్ ఐడియా రాలేదని అనుకుంటుంది. ఏమైనా అనుకున్న పని పూర్తి చేయాల్సిందే అంటూ ఇంట్లోకి వెళుతుంది. చెత్త ఏరుకునే మనిషి ఇంట్లోకి ఎందుకు వస్తుందని, నేను ఏదో పొరపాటు పడి ఉంటానని అనసూయ ఆలోచిస్తుంది. ఫొటోలు తీసేందుకు పారు ప్రయత్నిస్తుంది. ఇంతలో సంచి తగిలి ఓ వస్తువు కిందపడి శబ్దం వస్తుంది. దీంతో కంగారు పడుతుంది. చెత్త ఏరుకునే మనిషి ఇంట్లోకి వచ్చిందా ఏంటి అని అనసూయ అనుకుంటుంది. ఎక్కడ దొరికిపోతానో అని పారయ్యేందుకు పరుగెడుతుంది పారిజాతం. ఏమమ్మా.. ఆగు అని అనసూయ అరుస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 13) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం