కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: జ్యోపై జాలిపడిన దీప.. కార్తీక్‍కు నిజం చెప్పిన దశరథ్.. 'ఏమైపోతావో మామయ్య'-karthika deepam today episode june 6 dasarath tells truth to karthik deepa in tears star maa tv serial jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: జ్యోపై జాలిపడిన దీప.. కార్తీక్‍కు నిజం చెప్పిన దశరథ్.. 'ఏమైపోతావో మామయ్య'

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: జ్యోపై జాలిపడిన దీప.. కార్తీక్‍కు నిజం చెప్పిన దశరథ్.. 'ఏమైపోతావో మామయ్య'

కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ జూన్ 6: దీపను సుమిత్ర నానా మాటలు అంటుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్యోత్స్నపై జాలి కూడా చూపిస్తుంది. దాసు గురించి వెతకాలని దశరథ్‍ను పారు అడుగుతుంది. దాసుపై దాడి గురించి తనకు తెలిసిన నిజాన్ని కార్తీక్‍కు దశరథ్ చెప్పేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 6: కళ్లారా చూశా: కార్తీక్‍కు నిజం చెప్పిన దశరథ్

కార్తీక దీపం 2 నేటి (జూన్ 6, 2025) ఎపిసోడ్‍లో.. నన్ను అమ్మా అని పిలవొద్దని, అసలు ఎదురుపడడం కూడా ఇష్టం లేదని దీపతో అంటుంది సుమిత్ర. తన సొంత కూతురు అని తెలియకపోవడంతో నానా మాటలు అంటుంది. జ్యోత్స్న నిశ్చితార్థం చెడగొట్టడం తప్ప నా భార్య ఏ తప్పు చేసిందత్తా అని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. మళ్లీ తన వల్లే నిశ్చితార్థం జరుగుతోందని కదా అని అంటాడు. ఇదంతా నిజమని తాను అనుకోవడం లేదని సుమిత్ర చెబుతుంది.

నాటకమైతే ఇక్కడితో ఆపెయ్

దీంతో అబద్ధం ఏముందని దీప అడుగుతుంది. ఇప్పుడు నా కూతురు జ్యోత్స్న అవసరం ఉంది కాబట్టి.. నిశ్చితార్థం జరిగేలా చేస్తున్నావని సుమిత్ర అంటుంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఎటైనా మారిపోగలవు అని దీపను నిందిస్తుంది. "ఆరోజు గౌతమ్ కాలర్ పట్టుకున్నావ్.. ఇప్పుడు క్షమాపణ చెప్పావ్.. ఇదంతా నిజమైతే సంతోషమే. ఇది కూడా నువ్వు ఆడబోయే నాటకమైతే ఇక్కడితో ఆపెయ్” అని సుమిత్ర అంటుంది. తాను ఎందుకు నాటకం ఆడతానని, జ్యోత్స్నకు మంచి చేయాలనేది తన ఆరాటమని దీప అంటుంది.

నటించడం కూడా నేర్చుకున్నట్టున్నావ్

“జ్యోత్స్న సంతోషంగా ఉంటే.. మీరు సంతోషంగా ఉంటారని, మీకు మంచి జరగాలి అంతే” అని దీప అంటుంది. వంటలతో పాటు నటించడం కూడా బాగా నేర్చుకున్నట్టున్ననావ్ అని సుమిత్ర అంటుంది. నీతో నాకు ఏం బంధం ఉందని దీపను అడుగుతుంది. నీ కన్నకూతురే అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మనకు రుణానుబంధం ఉందని, తీర్చుకోవాలని దీప చెబుతుంది. ఏం బంధం మిగల్లేదని సుమిత్ర కోపంగా అంటుంది. జ్యోత్స్నను బాధపెట్టాలని చూస్తే.. నేను కావాలనే రివాల్వర్ పట్టుకోవాల్సి వస్తుందని దీపకు వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటివి మనం చాలా చూడాలి దీప అని కార్తీక్ అంటాడు.

ఇంతకంటే ఎక్కువ బాధపడతావ్

నీ మాటలు దీప గుండెలకు బుల్లెట్లలా తగిలాయని సుమిత్రతో దశరథ్ అంటాడు. రక్తం కంటే మనసులో నుంచి వచ్చే కన్నీరే మనిషిని ఎక్కువగా బాధ పెడతాయని చెబుతాడు. దీప వల్ల చాలా బాధలు పడడ్డానని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జ్యోత్స్న గురించి నిజాలు తెలిసినప్పుడు మరింత బాధపడతావని, దీప ఏం తప్పు చేయలేదని నా మనసు చెబుతుందని దశరథ్ అనుకుంటాడు.

దీప కన్నీరు.. డిప్ప పగిలేలా కొడదామన్న కార్తీక్

బయటికి వచ్చాక దీప కన్నీరు పెట్టుకుంటుంది. “ఆవిడకు, నీకు మధ్య ఉన్న బంధం గురించి తెలియకనప్పుడే ఓ మాట అంటే కన్నళ్లు పెట్టుకున్నావ్.. ఆవిడ నీ కన్నతల్లి అని తెలిశాక అమ్మ అని అనొద్దంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను” అని కార్తీక్ చెబుతాడు. సుమిత్ర అన్న మాటలకు కాదని, జ్యోత్స్న కోసం కన్నీరు పెట్టుకుంటున్నానని దీప అంటుంది. గౌతమ్‍ను అడ్డుపెట్టుకొని నిన్ను శత్రువును చేసిందో.. అదే గౌతమ్‍ను అడ్డుపెట్టుకొని జ్యోత్స్నను డిప్ప పగిలేలా కొడదామని కార్తీక్ చెబుతాడు.

జ్యోత్స్న మీదే అనుమానం

అడ్డు వచ్చాడని కన్నతండ్రినే చంపేయాలని చూసిన జ్యోత్స్న.. గౌతమ్‍ను మనం లైన్‍లోకి తెస్తే ఊరుకుంటుందా అని కార్తీక్ అంటాడు. నిజాలు చెప్పేందుకు వెళ్లిన నిన్ను మామయ్యను షూట్ చేసిన కేసులో ఇరికించింది కదా అని చెబుతాడు. నీ మీద అటాక్ కూడా ఎవరు చేశాలో తెలియదు, ఇవి జ్యోత్స్న చేసినట్టు నా అనుమానం అని అంటాడు. జ్యోత్స్న, గౌతమ్‍కు జరిగే ఎంగేజ్‍మెంట్‍లో ఇవన్నీ బయటపడతాయని అనుకుంటున్నానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న తప్పులు బయటపడితే ఇంట్లో వాళ్లకు క్లారిటీ వస్తుందని చెబుతాడు. జ్యోత్స్నకు బుద్ధి చెప్పి ఎలా దారిలోకి తీసుకురావాలో ఆలోచించాలని అంటాడు.

జాలి పడిన దీప

జ్యోత్స్నను చూస్తే జాలేస్తోంది కార్తీక్ బాబు అని దీప అంటుంది. “జాలా.. నీ హృదయం కరుణా సముద్రం కదా.. నీకు చెడు తలపెట్టాలని చూసినా జాలి కలుగుతోంది. జ్యోత్స్న లాంటి వాళ్లపై జాలి చూపకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే” అని కార్తీక్ అంటాడు. కుబేరతో తాను ఉన్న జ్ఞాపకాలను దీప గుర్తు చేసుకుంటుంది. ఇన్నేళ్లు నా సొంత తల్లిదండ్రులు అనుకున్న వారు, సొంతం కాదని తెలిశాక చాలా బాధగా అనిపించింది, తట్టుకోవడం కష్టంగా ఉందని దీప అంటుంది.

వాళ్ల గుండెలు తట్టుకోగలవా

నా పరిస్థితే ఇలా ఉంటే.. నిజాలన్నీ బయటపడిన రోజు నా కన్న తల్లి పరిస్థితి ఏంటి అని దీప బాధపడుతుంది. “నా కన్నతండ్రి, తాత శివన్నారాయణ పరిస్థితి ఏంటి వాళ్లంతా ఏమైపోతారు వాళ్ల గుండెలు తట్టుకోగలవా అని అడుగుతుంది. నా తండ్రి బుల్లెట్ గాయాన్ని తట్టుకోగలిగారు కానీ, పారిజాతం చేసిన గాయాన్ని తట్టుకోలేరు. జ్యోత్స్నను చూస్తుంటే అందుకే జాలేస్తోంది” అని దీప అంటుంది. జ్యోత్స్నను గట్టిగా మన స్టైల్‍లో మారుద్దామని కార్తీక్ అంటాడు.

గౌతమ్ మంచోడు కాదని, జ్యోత్స్న పెళ్లి చేసుకోనంటే ఏమైనా చేస్తాడని దీప అంటుంది. అప్పుడు గౌతమ్ నా విశ్వరూపం చూస్తాడు దీప అని కార్తీక్ చెబుతాడు. తర్వాత చేసేందుకు ఏమీ లేదని అంటాడు. మనం ఏదో చేయబోతున్నామని ఇంట్లో వాళ్లకు ఓ క్లారిటీ వచ్చిందని అంటాడు. జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేసిందని, తప్పులు ఎవరు చేసినా గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని దీప అంటుంది.

దాసును వెతకాలన్న పారిజాతం

తన కొడుకు దాసు ఎక్కడికో వెళ్లిపోయాడని, వెతకాలని దశరథ్‍ను పారిజాతం అడుగుతుంది. దాను పట్టించుకునేది నువ్వే.. వాడిని వెతికి పట్టుకో అని అంటుంది. దాసును జ్యోత్స్న మళ్లీ ఏమైనా చేసిందా అని దశరథ్ కంగారు పడతాడు. నేను, జ్యో ఇటీవలే దాసు ఇంటికి వెళ్లామని కూడా పారు అంటుంది. దీంతో దశరథ్ ఎందుకు వెళ్లారని కంగారుగా అడుగుతాడు.

ఈ మాట నాతో ఎందుకు చెబుతున్నాడు?

ఇవన్నీ పక్క నుంచి వింటూ ఉంటాడు కార్తీక్. మామయ్య ఎందుకు కంగారు పడుతున్నాడని అనుకుంటాడు. ఎవరి సాయం తీసుకొనైనా దాసును పట్టుకోవాలని పారిజాతం అడుగుతుంది. సరేనంటాడు దశరథ్. తప్పిపోయే ముందు రోజు దాసు మీ ఇంటికే వచ్చాయని పారిజాతం అంటే.. నువ్వు మా ఇంటికి వచ్చావా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. కాశీ చెప్పాడని పారు కవర్ చేస్తుంది. మా ఇంటిపై నిఘా ఉంచావా అనేలా మాట్లాడతాడు. కడుపున పుట్టిన వాళ్లు దూరమయ్యారని తెలిస్తే ఏ తల్లి అయినా బాధపడుతుందని కార్తీక్ అంటాడు. దీపను సుమిత్రకు చిన్నప్పుడే దూరం చేశావనే భావనతో అలా అంటాడు. ఈ మాట నాతో ఎందుకు చెబుతున్నాడని పారు మనసులో అనుకుంటుంది. మామయ్య ఎక్కడికి పోడులే అని కార్తీక్ అంటాడు.

దాసును నా కూతురే చంపాలనుకుంది

దాసు ఎక్కడికి వెళ్లాడో నీకు తెలుసా అని కార్తీక్‍ను దశరథ్ అడుగుతాడు. జ్యోత్స్న ఆ ఇంటికి ఎందుకు వెళ్లిందని నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఏమైందని అంటాడు. దీంతో కార్తీక్‍ను పక్కకు తీసుకెళతాడు దశరథ్. “నీకు తప్ప ఎవరికీ ఈ విషయం చెప్పుకోలేదు. దాసును కొట్టింది ఎవరో తెలుసా.. నాకు తెలుసు. నా కూతురే కొట్టింది” అని దశరథ్ చెబుతాడు. అంటే విషయం మామయ్యకు అసలు విషయం తెలుసా అని మనసులో అనుకుంటాడు కార్తీక్. దాసును జ్యోత్స్న చంపాలనుకుందని దశరథ్ అంటాడు. ఈ నిజం నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు, సుమిత్రకు తెలిస్తే తట్టుకోలేదని బాధపడతాడు.

నేనే కళ్లారా చూశా

దాసు మామయ్యను జ్యోత్స్న చంపాలనుకుందని నీకు ఎవరు చెప్పారని దశరథ్‍ను కార్తీక్ ప్రశ్నిస్తాడు. నేను నా కళ్లారా చూశానని దశరథ్ బుదులిస్తాడు. మేడ మీద ఉన్నప్పుడు అన్నయ్యా అని అరుపు వినిస్తే చూశానని, దాసును నా కూతురు కర్ర తీసుకొని కొట్టిందని చెబుతాడు. కారులో వేసుకొని వెళ్లిపోయి ఒక చోటు పడేసిందని, తాను వెనకే ఫాలో అయ్యానని అంటాడు. రాయితో కొట్టి దాసును చంపాలనుకుంటే ఆపి.. వైద్యం చేయించి బతికించానని నిజాలు చెప్పేస్తాడు దశరథ్. ఆ డాక్టర్ నా ఫ్రెండే కాబట్టి, నా కోసం అబద్ధం చెప్పాడని అంటాడు.

సుమిత్రకు తెలిస్తే బతుకుతుందా..

జ్యోత్స్న ఎలాంటిదో మామయ్యకు తెలిసిపోయిందా అని కార్తీక్ అనుకుంటాడు. “దాసుకు గతం గుర్చొచ్చి ఉంటే నిజాలు చెప్పేవాడు, అప్పుడు జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుందో తెలిసేది. ఇన్ని తెలిసినా జ్యోత్స్న ఏమీ అనలేకపోవడానికి కారణం బలహీనత. తండ్రిని కదా. తన మీద నేను పెంచుకున్న ప్రేమ నన్ను బలహీనుడిని చేసింది. కూతురు ఎలాంటిదో సుమిత్రకు తెలిస్తే.. అది బతుకుతుందా. మా నాన్న తట్టుకోగలడా. ఇవన్నీ తెలిసే దాసు చెప్పే వరకు జ్యోత్స్న గురించి బయటపెట్టడం లేదు” అని దశరథ్ చెబుతాడు.

నీ కూతురే కాదని తెలిస్తే ఏమైపోతావో

“దీనికే నువ్వు బాధపడితే.. అసలు జ్యోత్స్న నీ కూతురే కాదని తెలిస్తే ఏమైపోతావో మామయ్య. మీకు తెలియని ఎన్నో ఘోరాలు జరిగాయి. అన్నింటికి సాక్ష్యం దాసు మాయయ్యే” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 6) ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం