కార్తీక దీపం 2 సీరియల్ నేటి (జూన్ 11, 2025) ఎపిసోడ్‍లో.. శౌర్యకు తన చిన్నప్పటి బొమ్మలు, డ్రెస్‍ను ఇవ్వడంతో జ్యోత్స్న గొడవ చేస్తుంది. దశరథ్, సుమిత్ర బాధపడతారు. తన చిన్ననాటి బొమ్మలు, డ్రెస్‍లు చెత్తకుప్పలో పాడేస్తానని జ్యో పొగరుగా అంటుంది. అయితే, అవి తాము తీసుకెళతామని కార్తీక్ చెబుతాడు.భోజనానికి మా ఇంటికి వెళతామని కార్తీక్ అంటాడు. వెళ్లొస్తానని అన్నావదినలకు కాంచన చెబుతుంది. ఉండొచ్చు కదా అని దశరథ్ అంటే.. “నేను ఈ ఇంట్లో చోటు కోరుకోవడం లేదు అన్నయ్యా. నీ మనసులో చోటు ఉంది కదా చాలు” అని కాంచన అంటుంది. సుమిత్ర బాధగా కనిపించినా ఏమీ మాట్లాడదు. వెళ్లు అంటూ శౌర్యను నెడుతుంది పారిజాతం.
కోపంగా తన గదిలోకి వెళుతుంది జ్యోత్స్న. తప్పు చేశావే అని పారిజాతం వారిస్తుంది. నా బొమ్మలు దీప కూతురికి ఇవ్వడం ఏంటి అని జ్యో అంటుంది. “ఇన్ని రోజులు దీప ఆవేశాన్ని నువ్వు అనుకూలంగా వాడుకున్నావ్. ఇప్పుడు ఆ పని వాళ్లు చేస్తున్నారు” అని పారిజాతం అంటుంది. దీప, కార్తీక్ నీతో వరుసగా తప్పులు చేయిస్తున్నారని చెబుతుంది. లోతుకు పాతుకుపోయావని చెబుతుంది.
అగ్రిమెంట్ రాసి దీపను కాపాడడం తప్పు అని పారిజాతం అంటుంది. ఆరోజు నేను వెళ్లపోతే మమ్మీ వెళ్లేది.. దొరికిన అవకాశాన్ని వాడుకుందామనుకున్నానని జ్యో బదులిస్తుంది. అవకాశం దొరికింది నీకు కాదు.. కార్తీక్‍కు అని పారిజాతం అంటుంది. బావ ఈ ఇంట్లో డ్రైవర్, దీప మన ఇంట్లో పని మనిషి అని జ్యో చెబుతుంది. కార్తీక్, దీప ప్రవర్తన పూర్తిగా మారిందని పారు అంటుంది. అది తనకు అర్థమవుతోందని అంటుంది జ్యో. దీపను ఇంట్లో పెట్టడం చాలా తప్పు అని పారు గట్టిగా చెబుతుంది.
మీ తాత వాళ్ల కూతురితో మాట్లాడడం లేదు కానీ, దీప కూతురితో మాట్లాడుతున్నాడని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఆ బొమ్మలన్నింటికి విసిరేసి మరో తప్పు చేశావంటుంది. వాటికే విలువ ఇవ్వని జ్యోత్స్న.. రేపు మమల్ని పట్టించుకుంటుందా అని దశరథ్, సుమిత్ర అనుకుంటారని చెబుతుంది. అంత తెలివైన వాళ్లు అయితే ఇప్పటికే కనిపెట్టాలి కదా అని జ్యో అంటుంది. వాళ్లు మంచోళ్లు కాబట్టే మనం ఇంకా ఇలా తప్పించుకొని తిరుగుతున్నామని పారు చెబుతుంది.
మీ అమ్మానాన్న దృష్టిలో గొప్పగా కనిపించేలా ఏదో ఒకటి చేయాలని, లేకపోతే నీకే నష్టమని జ్యోత్స్నకు సూచిస్తుంది పారిజాతం. మీ అమ్మానాన్న ప్రేమను మళ్లీ గెలవాలని చెబుతుంది. "గ్రానీ చెప్పింది కూడా కరెక్ట్.. మనం చాలా బ్యాడ్ పొజిషన్‍లో ఉన్నాం. ఏదో ఒకటి చేసి మమ్మీడాడీని ఇంప్రెస్ చేయాలి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలతో శౌర్య ఆడుకుంటూ ఉంటుంది. మనిషికి కోపాలు ఉండొచ్చు కానీ.. మూర్ఖత్వం ఉండకూడదని అనసూయతో జ్యోత్స్న గురించి కాంచన అంటుంది. నీ మేనకోడలికి ఉన్నది మూర్ఖత్వం కాదు.. అహంకారం అని కార్తీక్ అంటాడు. ఇంట్లో అందరూ జ్యోను వెనకేసుకొస్తున్నారని చెబుతాడు. జ్యోత్స్న ఏం చెప్పినా చేస్తున్నావ్.. నీ భార్యను కూడా తీసుకెళుతున్నావ్.. ఎందుకు అని కార్తీక్‍ను కాంచన నిలదీస్తుంది.
జ్యోత్స్న చెప్పినట్టు చేయడం వెనుక అగ్రిమెంట్ కాకుండా ఇంకా ఏమైనా కారణం ఉందా అని అడుగుతుంది కాంచన. ఉందని కార్తీక్ అంటాడు. దీంతో తాను సుమిత్ర, దశరథ్‍ల అసలు కూతురు అని కార్తీక్ బాబు చెప్పేస్తారా అని దీప టెన్షన్ పడుతుంది. దీప కారణం అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత దీపతో పాటు నువ్వు కూడా కారణం అమ్మ అని కార్తీక్ చెబుతాడు. నిన్ను మళ్లీ పుట్టింటికి మళ్లీ దగ్గర చేసేందుకు ఇలా చేస్తున్నామని వివరిస్తాడు.
దీప ఎలా కారణం అని సుమిత్ర అంటుంది. “దీపకు కూడా అది పుట్టిల్లే కదా” అని కార్తీక్ అంటాడు. ఏంటి బాబు అంటున్నారని అనసూయ ఆశ్చర్యపోతుంది. దీప అనాథలా మిగిలినప్పుడు ఆ ఇల్లు చేరదీసింది కదా అని కార్తీక్ కవర్ చేస్తాడు. దీపను సుమిత్ర ఒకప్పుడు కూతురిలా చూసిందని, మళ్లీ వాళ్లకు దగ్గర చేసేందుకు ఇలా చేస్తున్నామని అంటాడు. కానీ ఆ ఇంటి అసలైన వారసురాలు దీప అనే నిజాన్ని మాత్రం దాచేస్తాడు.
వచ్చే సంక్రాంతికి మనమంతా కలిసి పండుగ జరుపుకుంటామని కార్తీక్ అంటాడు. ఆ మాట అంటుంటే సంతోషంగా ఉందని కాంచన చెబుతుంది. అవుతుందమ్మా అని కార్తీక్ అంటాడు. అలా చేయడానికే దీప, నేను ఇలా చేస్తున్నామని, మీరు ఆనందించేందుకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెబుతాడు. నన్ను అదుపు చేసుకోమంటున్నారు కానీ, మీరే నిజాలు బయటపెట్టేలా ఉన్నారని కార్తీక్‍తో దీప అంటుంది.
బొమ్మలు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది. జ్యోత్స్న సొంత కూతురు కాదు కాబట్టి వద్దనుకుంది.. అసలు కూతురు నువ్వు అని నాకు తెలుసు కాబట్టి చిన్నవయసులో నీకు దొరకని ప్రేమ నా కూతురికి దక్కాలనుకున్నానని చెబుతాడు. ఈరోజు అత్త ప్రేమతో కొన్న బొమ్మలను నా కూతురికి ఇచ్చినట్టే.. ఏదో ఒకరోజు అత్తను నీకు ఇస్తానని కార్తీక్ మాటిస్తాడు. “ఇది నా అదృష్టం అనొద్దు. నా మేనకోడలిని తన కుటుంబంతో ఆ ఇంటి వారసురాలిగా చూడాలన్న స్వార్థం” అని కార్తీక్ అంటాడు.
నిద్రలో ఉండగా దీపను లేపుతాడు కార్తీక్. “మీ అత్తయ్యను ఏమన్నావ్. ఇంట్లో ఉండనని బట్టలు సర్దుకొని బయలుదేరుతోంది. ఆవిడతో పాటు మా అమ్మ కూడా తయారైంది” అని కార్తీక్ చెబుతాడు. రాత్రి 11.52 అయింది, ఈ టైమ్‍లో వెళ్లాల్సిన అవసరం ఏంది అని దీప కంగారు పడుతుంది. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా అని చెబుతుంది. అంత మాట ఎందుకు అన్నావని కార్తీక్ అంటే.. నేనేమీ అనలేదని దీప చెబుతుంది. ఆవిడనే అడుగుతానని అంటుంది.
కాంచన, అనసూయ, శౌర్య ఒకే చోట ఉంటారు. అదిగో తేల్చుకో అని కార్తీక్ చెబుతాడు. ఇంతలో అనసూయ, శౌర్య వెళ్లి బెలూన్స్ తీసుకొస్తారు. దీప ఏమైందని చూస్తుంటుంది. ఇతంలో కేక్‍ను కూడా తీసుకొస్తారు. ఏంటిది అని దీప అడుగుతుంది. హ్యాపీ బర్త్‌డే టు యూ అంటూ కార్తీక్, కాంచన, శౌర్య, అనసూయ చప్పట్లు కొడతారు. దీపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు.
ముఖం అలా పెట్టావేంటే అని దీపను అనసూయ అడుగుతుంది. సర్‌ప్రైజ్‍గా ఉండాలని తనకు ఓ మాట చెప్పి తీసుకొచ్చానని కార్తీక్ అంటాడు. దీప పుట్టిన రోజు ఈ రోజే అని మీకు ఎలా తెలుసని అనసూయ అడుగుతుంది. భార్య పుట్టిన రోజు భర్తకు తెలియకుండా ఉంటుందా అని కార్తీక్ అంటాడు. “అయినా మరదలు పుట్టిన రోజు భార్య గుర్తుపెట్టుకోకపోతే ఎలా” అని చెబుతాడు. మరదలా అని కాంచన, అనసూయ, శౌర్య ఆశ్చర్యంగా అడుగుతారు. అంటే ఈరోజు జ్యోత్స్న పుట్టిన రోజు కూడా కదా.. అదే రోజు దీప పుట్టింది కాబట్టి అలా గుర్తు పెట్టుకున్నానని అని కవర్ చేస్తాడు కార్తీక్. జ్యో గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిదని కాంచన చెబుతుంది.
ఈ టైమ్‍లో వీళ్లందరినీ ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఈ ఏర్పాట్లు అవసరమా అని దీప అంటుంది. ఇవన్నీ నీ కోసం నాన్నే చేశాడని శౌర్య అంటుంది. పుట్టిన రోజును ఇలా సంబరంగా చేసుకునే అలవాటు తనకు లేదని దీప అంటుంది. చేయించే అలవాటు మాకు ఉందని కార్తీక్ చెబుతాడు. నీ జీవితం ఓ సాహసం అని దీప గురించి గొప్పగా మాట్లాడతాడు కార్తీక్. జీవితంలో దీప ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి గుర్తు చేస్తాడు. “అన్నీ దాటుకొని నీ గొంతును ఈ ప్రపంచానికి వినిపించావ్ చూడు. అదే నిన్ను ప్రత్యేకంగా నిలిపింది. మరి నీ పుట్టిన రోజును జరుపుకోవాలా లేదా” అని కార్తీక్ అంటాడు.
చాలా బాగా చెప్పావని కాంచన అంటుంది. నీ పెంపకం గొప్పతనం ఇది అని అససూయ సంతోషిస్తుంది. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువు, సంస్కారమే అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత క్యాండిల్ వెలిగిస్తాడు కార్తీక్. ఈ తర్వాత దీపతో కేక్ కట్ చేయిస్తాడు కార్తీక్. హ్యాపీ బర్త్‌డే దీపా.. అని కార్తీక్, కాంచన, అనసూయ, శౌర్య సంబరంగా అంటారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 11) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం