Karthika Deepam January 22nd Episode: శౌర్యను పంపనని ఏడ్చేసిన దీప.. కఠినంగా మాట్లాడిన కార్తీక్.. కాంచన, అనసూయకు అనుమానం
Karthika Deepam Today Episode January 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్యను ఎక్కడికీ పంపబోనని కార్తీక్‍కు దీప చెబుతుంది. దీంతో కార్తీక్ కాస్త గట్టిగానే మాట్లాడతాడు. శౌర్యను ఆసుపత్రికి తీసుకెళతాడు. అనసూయ, కాంచనకు అనుమానం వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చదివేయండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 22) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య రిపోర్టులను డాక్టర్ చూస్తాడు. వీలైనంత త్వరగా శౌర్యను ఆసుపత్రిలో చేర్చాలని కార్తీక్‍కు చెప్పేస్తాడు. జాయినింగ్ అమౌంట్ రెడీగా ఉందని, పాపను ఎప్పుడు జాయిన్ చేయాలని కార్తీక్ అడిగితే.. ఈరోజే జాయిన్ చేయాలని డాక్టర్ అంటాడు. దీంతో శౌర్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కార్తీక్ సిద్ధమవుతాడు. ఫ్రెండ్ ఇంటికి తీసుకెళుతున్నానని దీపకు చెప్పి శౌర్యను ఆసుపత్రిలో చేర్చాలని కార్తీక్ ఇప్పటికే అనుకొని ఉంటాడు. ఇప్పటికిప్పుడు శౌర్యను ఎందుకు తీసుకెళుతున్నారని కార్తీక్‍ను దీప ప్రశ్నిస్తుంది.

దీప ప్రశ్నలు.. కఠినంగా మాట్లాడిన కార్తీక్
శౌర్యను ఎప్పుడు తీసుకెళతారని అడిగితే తర్వాత చెబుతా అని, ఇప్పుడేమో అర్జెంట్ అంటున్నారేంటి అని కార్తీక్‍ను దీప అడుగుతుంది. దుస్తులను బ్యాగ్‍లో సర్దుతూనే ప్రశ్నిస్తుంది. కార్తీక్ పలకకపోతే.. సమాధానం చెప్పండి బాబు అని అంటుంది. టైమ్ లేదు త్వరగా వెళ్లాలంటాడు కార్తీక్. బీరువాలో నుంచి కార్తీక్ డబ్బు తీస్తుంటే.. ఎందుకని దీప అడుగుతుంది. “శౌర్యను ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ డబ్బుకు సంబంధం ఏంటి” అని ప్రశ్నిస్తుంది. వేరే వ్యక్తికి డబ్బు ఇవ్వాలంటూ ఇప్పుడు కూడా దాచేస్తాడు కార్తీక్. నేను వస్తానని దీప అంటే.. “మనం ఏమైనా ఫంక్షన్‍కు వెళుతున్నామా.. గుడికి వెళుతున్నామా అందరం కలిసి వెళ్లేందుకు. నేను శౌర్యను దించేసి వస్తా” అని కఠినంగా మాట్లాడతాడు కార్తీక్. ఆసుపత్రికి వెళుతున్నామనే నిజాన్ని దాచేందుకు దీపతో అలా మాట్లాడతాడు.
నేను పంపను
శౌర్య దుస్తులు, పుస్తకాలను బ్యాగ్‍ల్లో సర్దేస్తుంది దీప. దీంతో పద వెళదాం అని శౌర్యను తీసుకెళ్లేందుకు కార్తీక్ రెడీ అవుతాడు. దీంతో శౌర్య ఎక్కడికీ రాదు బాబు అంటూ దీప బాధపడుతుంది. ముందే చెప్పా కదా దీప అని కార్తీక్ అంటే.. ఏం చెప్పలేదు అని అంటుంది. “వెళ్లే చోటు తెలియదు. అక్కడి మనుషులు తెలియదు. ఇది అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అయినా శౌర్య ఎందుకు వెళ్లాలి. నేనెందుకు పంపాలి” అని దీప అంటుంది. తాను శౌర్యను పంపనని చెప్పేస్తుంది.
అడ్డుపడకు.. హక్కు నాకు ఉంది
శౌర్య ఆరోగ్యం కోసం పంపాలని దీపను కార్తీక్ అంటాడు. అక్కడికి వెళితే శౌర్య మళ్లీ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. “ఫ్రెండ్ ఇంటికి వెళ్లడానికి.. ట్యాబ్లెట్స్ మళ్లీ వేసుకోకుండా ఉండేందుకు సంబంధం ఏంటి” అని దీప ప్రశ్నిస్తుంది. అక్కడ వాతావరణం, సౌకర్యాలు బాగా ఉంటాయని కార్తీక్ అంటాడు. అడ్డుపొద్దని చెబుతాడు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే శౌర్యను తీసుకెళ్లాలని దీప అంటుంది. “శౌర్య నా కూతురు తీసుకెళ్లే హక్కు నాకు ఉంది. కావాలంటే వచ్చిన తర్వాత తీరుబడిగా అంతా చెబుతా. ఇప్పుడు టైమ్ లేదు వెళ్లనివ్వు” అని కార్తీక్ అంటాడు. అయినా శౌర్యను పంపించనని దీప అంటుంది.
ఎక్కడికీ రానని కార్తీక్‍తో చెప్పాలని శౌర్యను దీప అడుగుతుంది. దీంతో బాధగా దీపను శౌర్య కౌగిలించుకుంటుంది. బాయ్ అమ్మా అని అంటుంది. దీంతో దీప ఏడ్చేస్తుంది. నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు ఏడిస్తే నేనూ ఏడుస్తానమ్మా అని శౌర్య అంటుంది. నువ్వు పెట్టుకున్న నమ్మకానికైనా బతికించుకుంటానని కార్తీక్ మనసులో అనుకుంటాడు. శౌర్యను తీసుకొని కార్తీక్ వెళతాడు. నానమ్మలిద్దరికీ బాయ్ చెప్పాలని శౌర్యతో అంటాడు. కాంచన, అనసూయకు బాయ్ చెబుతుంది శౌర్య. సైకిల్‍పై శౌర్యను తీసుకొని కార్తీక్ వెళతాడు. కన్నీరు పెడుతూనే టాటా అంటూ చేయి ఊపుతుంది దీప.
మిమ్మల్ని చూడకుండా ఉండలేను
దారి మధ్యలో దేవుడిని దండం పెట్టుకొని వెళదామని శౌర్యకు చెప్పి చిన్న గుడి దగ్గర ఆపుతాడు కార్తీక్. మనం ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం లేదని శౌర్యకు నిజం చెబుతాడు. మిమ్మల్ని వదిలేసి ఎక్కడా ఉండలేనని శౌర్య అంటుంది. కార్తీక్‍ను కౌగిలించుకుంటుంది. ఎవరి ఇంటికి వెళ్లాలని లేదని, సౌకర్యాలు లేకపోయినా మన ఇంట్లోనే ఉంటానని అంటుంది. నిన్ను, అమ్మను చూడలేకుండా ఉండలేనని చెబుతుంది. తాను రోజు వస్తానని, అమ్మ రాదని అంటాడు. అమ్మ ఎందుకు రాదని శౌర్య ప్రశ్నిస్తుంది. ఒక్క వారమే కదా అని సముదాస్తాడు కార్తీక్. అన్నీ నేను చూసుకుంటానంటూ ఎమోషనల్‍గా అంటాడు. నా ఆయుష్షు పోసైనా నిన్ను కాపాడుకుంటానని మనసులో అనుకుంటాడు కార్తీక్.
అందుకే అడ్డుచెప్పలేదు
శౌర్యను ఫ్రెండ్ ఇంటికి దగ్గర వదిలిపెడతానని కార్తీక్ అంటే ఎందుకు అంగీకరించావని కాంచనను అనసూయ ప్రశ్నిస్తుంది. కార్తీక్ పదో తరగతి చదివే సమయంలో ఇంట్లో చెప్పకుండా ఓ వ్యక్తికి చేసిన మంచి గురించి కాంచన వివరిస్తుంది. కార్తీక్ ఏం చేసినా మంచి కోసమే అయి ఉంటుందని చెబుతుంది. వాడు ఓ నిర్ణయం తీసుకున్నాడంటే.. అది సరైనదే అయి ఉంటుంది.. వాడి మీద నాకు అంత నమ్మకం అని కాంచన అంటుంది. దీంతో గతంలో తన కూతురు ప్రవర్తించిన తీరును అనసూయ గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ లాంటి కొడుకు ఉన్నందుకు అదృష్టవంతురాలివి చెల్లెమ్మా అని చెబుతుంది. అందుకే కార్తీక్ తీసుకున్న నిర్ణయాలకు తాను అడ్డుచెప్పలేదని అంటుంది. శౌర్యను ఫ్రెండ్ ఇంట్లో పెడతానని అడిగాడని.. ఏ కారణం ఉందో మనకు తెలియదు కదా అంటుంది.
అనసూయ, కాంచనకు అనుమానం
అదే తన భయం అని అనసూయ అంటుంది. శౌర్యకు ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్య అని మనకు కూడా తెలుసు కదా అని అనసూయ అంటుంది. “ఇప్పుడు చంటిదాన్ని వారం రోజులు ఫ్రెండ్ ఇంట్లో పెడతానని అనడం, డబ్బులు తీసుకెళ్లడం.. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది చెల్లెమ్మా. కార్తీక్ బాబు మనకు చెప్పకుండా ఇంకేదో బాధను మోస్తున్నట్టే ఉంది. బాబు ముఖంలో నవ్వు లేదు. రెండు రోజుల నుంచి ఇంట్లో సరిగా ఉండడం లేదు. ఎప్పుడూ ఫోన్‍లో మాట్లాడుతూ తిరుగుతున్నాడు. నువ్వు ఓసారి కార్తీక్ బాబుతో మాట్లాడు చెల్లెమ్మా” అని అంటుంది అనసూయ. నిజంగా శౌర్యకు ఏమైనా అయి ఉంటుందంటావా అని కాంచన కూడా అనుమానిస్తుంది. మనం బాధపడతామని కార్తీక్ అబద్ధం చెప్పాడేమోనని అనసూయ చెబుతుంది. ఇంటికి వచ్చాక దీపకు తెలియకుండా కార్తీక్‍తో మాట్లాడతానని కాంచన అంటుంది.
ఆసుపత్రిలో శౌర్య.. నచ్చజెప్పిన కార్తీక్
శౌర్యను ఆసుపత్రికి తీసుకొస్తాడు కార్తీక్. ఇక్కడికి తీసుకొచ్చావేంటి నాన్న అని శౌర్య అడుగుతుంది. కాశీ అప్పటికే ఆసుపత్రిలో ఉంటాడు. ఆసుపత్రిలో డబ్బు కట్టేస్తాడు కార్తీక్. దీంతో శౌర్యను హాస్పిటల్‍లో జాయిన్ చేస్తాడు. ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చావని కార్తీక్‍ను శౌర్య ప్రశ్నిస్తుంది. ఫ్రెండ్ ఇంటికి పంపిస్తానని చెబితే తనకు బాధేసిందని, ఇప్పుడేమో ఆసుపత్రికి తీసుకొచ్చావని అంటుంది. ఈ వారం ఎక్కడ ఉండాలని అడుగుతుంది. దీంతో ఈ వారం నువ్వు ఇక్కడే ఉంటావని కార్తీక్ అంటాడు. ఆసుపత్రిలో ఎందుకు అని శౌర్య ప్రశ్నిస్తుంది. రోజూ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఉండాలంటే.. శౌర్యను ఆసుపత్రిలో చేర్పించి వారం రోజులు ఉంచాలని డాక్టర్ చెప్పారని కార్తీక్ అంటాడు. “వారం రోజులు ఇక్కడే ఉంచండి. అన్ని టెస్టులు చేయిస్తే ఇక ట్యాబెట్లు అవసరం లేదని డాక్టర్ చెప్పారు” అని శౌర్యను కార్తీక్ సముదాయిస్తాడు.
శౌర్యతో ప్రామిస్ చేయించుకున్న కార్తీక్
ఇక్కడే ఉంటే అమ్మను, నిన్ను ఎలా చూడాలని అని శౌర్య అడుగుతుంది. నేను వస్తాను రా.. నేను లేని టైమ్‍లో కాశీ ఉంటాడని కార్తీక్ అంటాడు. అమ్మ అని శౌర్య.. అమ్మ రాదని కార్తీక్ చెబుతాడు. టెస్టులు చేసేటప్పుడు అమ్మ ఇక్కడే ఉంటే.. కంగారు పడి బాధపడుతుందని కార్తీక్ అంటాడు. అమ్మను బాధపెట్టడం నీకు ఓకేనా అని అంటే.. నాట్ ఓకే అని అంటుంది శౌర్య. అమ్మకు ఈ విషయం చెప్పకూడదు.. ప్రామిస్ అని కార్తీక్ చేయి చాపితే.. కాస్త ఆలోచించి ప్రామిస్ వేస్తుంది శౌర్య. అమ్మకు ఎప్పుడు చెప్పాలంటే.. తాను తర్వాత చెబుతానంటాడు కార్తీక్. నాకు సూదులు గుచ్చుతారా.. అలా అయితే నేను ఏడుస్తానని శౌర్య అంటుంది. అలాంటివి ఏమీ ఉండవని అంటాడు. “నీకేం కాదమ్మా.. నీకు ఏ బాధలు లేకుండా చేసేందుకే కదా తీసుకొచ్చింది” అంటూ శౌర్య నుదిటిపై ముద్దు పెడతాడు కార్తీక్. రేపటి నుంచి దీపకు ఎలా సర్దిచెప్పాలో.. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు కొన్ని ఇబ్బందులు తప్పవు అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇంట్లో కంగారుగా ఉంటుంది దీప. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 22) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం