కార్తీక దీపం 2 సీరియల్ నేటి (ఏప్రిల్ 7) ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దాసు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫోన్ చేయాలని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో దశరథ.. దశరథ అంటూ ఉత్సాహంగా అరుస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఫోన్ పెట్టేస్తుంది పారు. ఏదో అయిందని అనుకుంటుంది. ఇంతలో ఏమైంది నాన్న అని దశరథ్ అడుగుతాడు. గుడ్‌న్యూస్ అంటాడు శివన్నారాయణ.
గౌతమ్ తనకు కాల్ చేశాడని ఆనందంగా అంటాడు శివన్నారాయణ. రింగ్ విసిరేసి వెళ్లాడు కదా అని విసుగ్గా అంటుంది పారు. అలా చేసిందుకే గౌతమ్ తనకు సారీ చెప్పాడని, ఎవరో నా మీద నిందేశారని బాధపడ్డానని అన్నాడని శివన్నారాయణ చెబుతాడు. జ్యోత్స్నను పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గౌతమ్ చెప్పాడని, ఒకే అనుకుంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టించమన్నాడని అంటాడు. దీంతో పారిజాతం, సుమిత్ర కూడా సంతోషిస్తారు.
గౌతమ్‌పై దీప వేసిన నింద నిరూపణ కాలేదు కదా అని దశరథ్ అంటాడు. అది ఎప్పుడూ నిరూపణ కాదని, అప్పట్లో తమను చంపేందుకు జ్యోత్స్న ప్రయత్నించిందని దీప రచ్చ చేసిందని, దాన్ని నిరూపించిందా అని శివన్నారాయణ అడుగుతాడు. గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగిందని చెబుతాడు. రమ్యను తీసుకొచ్చినట్టు పెళ్లి మండపంలోకి ఇంకో అమ్మాయిని దీప తీసుకొస్తే అని పారిజాతం అంటుంది. అలా చేస్తే దీపను పోలీసులకు అప్పగిస్తానంటాడు శివన్నారాయణ. దీపను రావొద్దని అంటే సరిపోతుందని దశరథ్ అంటాడు.
ముహూర్తాల గురించి జ్యోత్స్నకు చెప్పాలని సుమిత్రకు శివన్నారాయణ అంటాడు. ఇప్పటికే నిశ్చితార్థం ఆగిన బాధలో జ్యోత్స్న బాధలో ఉందని, ముందు గౌతమ్ తల్లిదండ్రులతో మాట్లాడి అన్నీ కుదిరాక చెబుదామంటుంది సుమిత్ర. శివన్నారాయణ ఓకే అంటాడు.
ఈ మాటలను జ్యోత్స్న పక్క నుంచి వింటూనే ఉంటుంది. “ఈ గౌతమ్ గాడికి పెళ్లికి ఆరాటంగా ఉన్నట్టుంది. ముందుదీప సంగతి చూడమంటే ఫోన్ చేసి పెళ్లికి ముహూర్తాలు పెట్టించమంటున్నాడు. నా పెళ్లి జరిగేది బావతోనే. ముందు గౌతమ్‌ను అడ్డుపెట్టుకొని దీపను వదిలించుకోవాలి. ఏం చేస్తే ఆ ఇంట్లో గొడవ అవుతుందో ఆలోచించాలి” అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.
ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది దీప. కార్తీక్ అక్కడికి వస్తాడు. దీపను తదేకంగా చూస్తాడు. దీప కూడా కార్తీక్‌ను నవ్వుతూ చూస్తుంది. నా ప్రాణదాతను నువ్వు అని కార్తీక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని దీప మురిసిపోతుంది. ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో దీప దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కార్తీక్. ముగ్గు వేయడంలో సాయం చేయనా అని అడుగుతాడు. మీరు ముగ్గు పెట్టడం ఎవరైనా చూస్తే బాగోదని దీప అంటుంది. పెళ్లానికి సాయం చేసే మగాళ్లను చూస్తే ఆడవాళ్లు కుళ్లుకుంటారని అని సరదాగా మాట్లాడతాడు కార్తీక్.
కార్తీక్, దీప ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముగ్గు వేస్తారు. కళ్లలోకి చూసుకుంటూ, నవ్వుతూ చేతులు పట్టుకొని ముగ్గు దిద్దుతారు. చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు. కలిసి ముగ్గు పూర్తి చేస్తారు.
చాలు కార్తీక్ బాబు.. ఎవరైనా చూస్తారు అని దీప అంటుంది. ఎవరు వస్తారని కార్తీక్ అంటాడు. నేను చూశాను కదా.. ఫొటోలు కూడా తీశానని శౌర్య అంటుంది. ముందు చెప్పి ఉంచి పోజ్ ఇచ్చేవాడని కదా అని కార్తీక్ చెబుతాడు. దీప భుజంపై చేయి వేసి ఫొటోకు పోజ్ ఇస్తాడు కార్తీక్. అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు. కార్తీక్ బాబు.. ఒక బైక్ కొనొచ్చు కదా అని దీప చెబుతుంది. ఏ బైక్ కొనాలన్న లక్షపైనే ఉందని, ఇందుకోసం కొన్ని డబ్బులు పక్కన పెట్టానని కార్తీక్ చెబుతాడు. కిటికీ ఉన్న కారు కొందామని శౌర్య అడుగుతుంది. కిటికీ ఏంటి గుమ్మాలు కూడా పెట్టిద్దామని సరదాగా అంటుంది దీప. శౌర్యను తీసుకొని కార్తీక్ వెళతాడు.
జ్యోత్స్నకు కాల్ చేస్తూ ఉంటాడు గౌతమ్. జ్యోత్స్న మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. కట్ చేస్తూ ఉంటుంది. దీప గురించి ఏం చేశావని మెసేజ్ చేస్తుంది. ముందు దీప సంగతి చూడరా అంటే వీడికి పెళ్లి కావాల్సి వచ్చిందని అనుకుంటుంది. నువ్వు ఏ1 ఫ్రాడ్ అని నాకు తెలుసు, కానీ అలాగని ఇంట్లో చెప్పలేనని అనుకుంటుంది. అప్పుడు పారిజాతం అక్కడికి వస్తుంది. గౌతమ్ కాల్ చేస్తున్నాడే, లిఫ్ట్ చెయ్ అంటుంది. ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసి నేను చేసి మెసేజ్‌కు రిప్లే కావాలని గౌతమ్‌తో జ్యోత్స్న అంటుంది. దీప సంగతి చూడాలని రెచ్చగొట్టేస్తుంది.
జ్యో ఈ పెళ్లికి ఓకే చెప్పాలంటే.. దీపను కంట్రోల్ చేయాలి, ఈ దీప ఏంటి నన్నుఇలా తగులుకుందని గౌతమ్ అనుకుంటాడు. గౌతమ్‌కు ఏం మెసేజ్ చేశావ్, ఏ రిప్లే ఇవ్వాలని ఆత్రుతగా అడుగుతుంది పారిజాతం. నేను చాలా చిరాకులో ఉన్నానని, కాస్త ఒంటరిగా వదిలేయాలని జ్యోత్స్న అంటుంది. గౌతమ్ పెళ్లికి ఓకే చెప్పాడంట అని పారిజాతం అంటే.. దీప నా పెళ్లి జరగనివ్వదు కదా అని మళ్లీ నాటకాలు ఆడుతుంది జ్యోత్స్న. గౌతమ్ తప్పు చేసి ఉంటాడా, దీపను నమ్ముతున్నావా అని అడుగుతుంది పారిజాతం. చేసి ఉంటే అని జ్యోత్స్న అంటుంది. ఏం చేస్తున్నానో తర్వాత తెలుస్తుందిలే అని చెబుతుంది. దీపను ఏం చేయలేకున్నాం కదా అని పారిజాతం అంటుంది. నేం చేశాను గ్రానీ.. దీపను బాధపెట్టేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోనని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
తనకు ఓ మాట ఇవ్వాలని దీపను కాంచన అడుగుతుంది. కార్తీక్ నిన్న నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియదు కానీ, అప్పటి నుంచి నీ ముఖంలో కొత్త ఆనందం చూస్తున్నానని కాంచన అంటుంది. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటానని మాట ఇవ్వాలని అడుగుతుంది. కాంచన చేతిలో చేయి వేసి మాట ఇచ్చేలోపే తలుపు తట్టిన శబ్దం వస్తుంది. నేను చూస్తానని దీప వెళుతుంది.
దీప ఇంటికి గౌతమ్ వచ్చి ఉంటాడు. తలుపు తెరవగానే గౌతమ్ కనిపించడంతో కోపంగా చూస్తుంది దీప. ఎవరు అని అనసూయ అంటే.. ఆగిపోయిన నిశ్చితార్థం పెళ్లి కొడుకు అని కాంచన చెబుతుంది. ఎందుకు వచ్చావని గౌతమ్‌ను దీప అడుగుతుంది. అలాగే లోపలికి వచ్చి అంతా బాగున్నారా అని గౌతమ్ అడుగుతాడు. కుర్చీ తీసుకొని కాలిమీద కాలేసుకొని కూర్చుంటాడు. ముందుకు ఎందుకొచ్చావని దీప అడుగుతుంది. కార్తీక్‌ను పిలవాలని గౌతమ్ అంటాడు. కార్తీక్ లేడని దీప చెబుతుంది.
అసలు ఎందుకొచ్చావని గౌతమ్‌ను కాంచన కోపంగా అడుగుతుంది. మీ కోడలి కోసం అని గౌతమ్ అంటాడు. నాతో నీకేంటి పని అని దీప ప్రశ్నిస్తుంది. మరి నాతో నీకేంటి పని అని అంటాడు గౌతమ్. “నువ్వు తప్పు చేశావ్, అది ఆపడం నా వల్ల కాలేదు, నువ్వు రెండో తప్పు చేసినప్పుడు ఆపాలని చూశా.. తప్పించుకున్నావ్. కానీ మూడోసారి నీవల్ల తప్పు జరగకుండా ఆపాను. కానీ నువ్వు తప్పు చేశావని నిరూపించలేకపోయాను” అని దీప అంటుంది. నిజం చెప్పేందుకు సిన్సియర్‌గా ట్రై చేస్తున్నావ్ కదా అని గౌతమ్ అంటాడు. రమ్య నిజం చెప్పకుండా సత్తిపండును గౌతమే పంపాడని అనుకొనేలా దీప అంటుంది. ఎవరి పేరో చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని గౌతమ్ అంటాడు.
ఆడపిల్లలకు అన్యాయం చేసి తప్పించుకోవద్దని గౌతమ్ అంటాడు. నీ ఫ్రెండ్‌నో, చెల్లినో మోసం చేసినట్టుఅంత గింజుకుంటావేంటి అని అడుగుతాడు. నువ్వు ఎవరినైనా ఉద్దరించుకో.. నా జోలికి రావొద్దని గౌతమ్ అంటాడు. ఆల్రెడీ వచ్చానని దీప అంటుంది. “అక్కడితో ఆగు.. వెళుతున్న రోడ్డులో నా కారుకు ఎవరైనా వస్తేనే చిరాకు పడతా. అలాంటి నా లైఫ్‌కే అడ్డు వస్తున్నావ్. ఎంత డేంజరో ఆలోచించు” అని గౌతమ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇక్కడి నుంచి వెళ్లాలని అనసూయ కోపంగా అంటుంది.
దీపను ఏమైనా చేస్తానేమోనని భయపడుతున్నావా అని గౌతమ్ అంటే.. అది మిమ్మల్నిఏమైనా చేస్తుందోమోనని భయపడుతన్నానని అనసూయ చెబుతుంది. మీరు పేట్రేగిపోతే అది పెట్రోల్లా మండిపోతుందని అంటుంది. వంకరగా మాట్లాడిన ఎంతో మందిని వాయించేసిందని, నాలుకను అదుపులో పెట్టుకోకపోతే దెబ్బలు పడతాయని అంటుంది. నీ కోడలిని అదుపులో పెట్టుకో అని గౌతమ్ అంటాడు. ఎవర్ని అదుపులో పెట్టుకోవాలని దీప కోపంగా అంటుంది. ఇంటికి వచ్చిన వాడిని కొడితే బాగోదని అనసూయ అంటుంది. కొడితే ఊరుకుంటానా అని కుర్చీని కాలితో తంతాడు గౌతమ్.
ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలియదా అని గౌతమ్ అంటాడు. బెదిరిస్తున్నావా అని అంటుంది దీప. “నువ్వు ఇక్కడితో ఆగకపోతే ఎక్కడికి వెళతానో నాకే తెలియదు. కార్తీక్ ఉన్న రెస్టారెంట్కైనా వెళ్లొచ్చు. నీ కూతురు చదివే స్కూల్‌కైనా వెళ్లొచ్చు. నేను ఎక్కడికి వెళ్లకూడదంటే నువ్వు ఇక్కడితో ఆగాలి” అని బెదిరించేలా మాట్లాడతాడు గౌతమ్.
బెదిరించిన గౌతమ్‌కు గట్టి కౌంటర్ ఇస్తుంది దీప. “రేయ్ గౌతమ్. నాకు సంబంధం లేని వారి జోలికి వెళితేనే నీ చెంప పగులగొట్టా. నా కుటుంబం జోలికి వస్తే నీకు ముత్యాలమ్మ జాతరే” అని కోపంగా అంటుంది దీప. నువ్వు ఏమైనా చేసుకో నా జోలికి రావొద్దని గౌతమ్ చెబుతాడు. ఈ గౌతమ్ చెడ్డవాని నువ్వు చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తాయని, నేను రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే చాలా నష్టపోతావని గౌతమ్ మళ్లీ బెదిరిస్తాడు. నేను డబ్బు ఇస్తే అన్నీ జరిగిపోతాయని పొగరుగా అంటాడు.
ఏంట్రా బెదిరిస్తున్నావా, చంపేస్తావా అని గౌతమ్ టీషర్ట్ పట్టుకుంది దీప. ఆగాలని కాంచన, అనూసయ అంటారు. బాబు నువ్వు వెళ్లిపో.. నేను దీన్ని ఎంత సేపు అదుపు చేయలేని అని గౌతమ్‌కు చెబుతుంది అనసూయ. గొడవ జరగడం ఇష్టలేదంటుంది. బయటి నుంచి కూడా నేను ఏమైనా చేయగనని, ఓసారి చెప్పేందుకు వచ్చానని గౌతమ్ చెబుతాడు. మళ్లీ కలిసే అవకాశం రానివ్వనని ఆశిస్తూ సెలవు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు గౌతమ్.
గౌతమ్ గురించి నువ్వు చెప్పిన మాటలతో నమ్మామని, ఇప్పుడు వాడు ఎలాంటి వాడో కళ్లారా చూశామని కాంచన అంటుంది. నిజం బయటపడుతుందనే భయంతో గౌతమ్ వచ్చాడని అనసూయ అంటుంది. బలుపుతో గౌతమ్ వచ్చాడని, అందుకే బెదిరించాడని దీప చెబుతుంది. నువ్వు ఆపకుండా ఉండాల్సిందని అంటుంది. నువ్వు వాడి ఒంటిపై చేయి వేస్తే.. నింద ఎందుకు వేశారని అడిగేందుకు వస్తే దీప కొట్టిందని ఆ ఇంట్లో చెప్పుకుంటారని అనసూయ అంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 7) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం