కార్తీక దీపం 2 నేటి (మార్చి 5) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తాను జ్యోత్స్నపై కోపంతో అరిచానని, కొట్టానని కార్తీక్‍తో దీప చెబుతుంది. ఏం చేసినా సుమిత్రతో పాటు శివన్నారాయణ ఇంట్లో ఎవరూ నమ్మలేదని దీప అంటుంది. తనపై, శౌర్యపై జ్యోత్స్న దాడి చేసిందంటే నమ్మకుండా ఆధారాలు అడిగారని చెబుతుంది. “నీ కూతురు సాక్ష్యం సరిపోదు. నా కూతురు తప్పు చేసిందనడానికి ఆధారం ఉందా అని సుమిత్రే నన్ను అడిగారు. ఆధారాలను ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఎలా నిరూపించాలి” అని దీప అంటుంది.
సరైన ఆధారాలు, సాక్ష్యాలు కావాలన్నారు కదా.. పోలీస్ స్టేషన్‍కు వెళదాం పదా అని కార్తీక్ అంటాడు. నా భార్యను, కూతురిని చంపాలనుకుందని జ్యోత్స్నపై పోలీస్ స్టేషన్‍లో కంప్లైట్ ఇస్తానని చెబుతాడు. రెండు కుటుంబాలను కలిపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, ఏం చేసినా తనను, తన చెల్లిని దృష్టిలో పెట్టుకోవాలని దశరథ్ అన్న మాటలను దీప గుర్తు చేసుకుంటుంది. జ్యోత్స్నను తీసుకొచ్చి సెల్‍లో వేసి ఇంటరాగేట్ చేస్తే.. అప్పుడు సాక్ష్యాలు, ఆధారాలు తన్నుకుంటూ వస్తాయని కార్తీక్ అంటాడు.
పోలీస్ స్టేషన్‍కు వద్దని దీప అంటుంది. జ్యోత్స్నపై కంప్లైట్ ఇవ్వొద్దని, కేసు పెట్టొద్దని చెబుతుంది. జ్యోత్స్నకు పడాల్సినవి పడ్డాయని అంటుంది. అవి సరిపోవని, వార్తల్లోనో.. మాటల్లోనో సమాజంలో జరుగుతున్న ఘోరాల గురించి రోజూ వింటూనే ఉన్నాం కదా అని కార్తీక్ అంటాడు. వివిధ కారణాలతో కొందరు మనుషుల ప్రాణాలు తీసుకున్నారు కదా అని చెబుతాడు. ఇప్పుడు మనం వదిలేస్తే జ్యోత్స్న ఇక్కడితో ఊరుకుంటుందని నమ్మకం ఏంటని అడుగుతాడు. మరోసారి మన జోలికి రాదని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నిస్తాడు. ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు అని దీపను అడుగుతాడు.
జ్యోత్స్నపై కేసు వద్దనేందుకు మీ మామయ్య (దశరథ్) కారణం అని దీప అంటుంది. జోత్స్నపై పోలీస్ కంప్లైట్ ఇస్తేనే శౌర్య జోలికి రాకుండా ఉంటుందని తాను కూడా గొడవ తర్వాత అనుకున్నానని దీప చెబుతుంది. కానీ ఇంట్లో నుంచి బయటికి వస్తుంటే దశరథ్ ఆపారని అంటుంది. కూతురుగా అనుకొని అడుగుతున్నా.. నన్ను క్షమించు అంటూ తన చేతులు పట్టుకొని దశరథ్ అడిగిన విషయాన్ని కార్తీక్‍తో దీప చెబుతుంది. అంత పెద్ద మనిషి క్షమాపణ అడిగితే.. ఇక కోపానికి, ఆవేశానికి ప్రాణం ఎక్కడ ఉంటుందని, అవి ఆ ఇంటి వాకిట్లోనే చచ్చిపోయానని దీప అంటుంది. శౌర్య మాట తప్ప మన దగ్గర ఆధారాలు లేవని చెబుతుంది.
తాను ఏ తప్పు చేయలేదని జోత్స్న ఇంట్లో వాళ్లందరినీ నమ్మించిందని కార్తీక్‍తో దీప చెబుతుంది. “అందుకే మన కూతురు కోసం జ్యోత్స్నపై నేను చేయి చేసుకుంటే.. తన కూతురు కోసం సుమిత్ర నా మీద చేయి చేసుకున్నారు” అని దీప చెబుతుంది. అత్త నిన్ను కొట్టిందా అని కార్తీక్ షాక్ అవుతాడు. కొట్టిన దాని కంటే అన్న మాటలే గట్టిగా తగిలాయని దీప చెబుతుంది. దశరథ్ మాటలు విన్నాక.. ఇది ఇక్కడితో వదిలేసి, జాగ్రత్తగా ఉండాలని అనిపించిందని దీప అంటుంది.
జోత్స్న మళ్లీ మన జోలికి వస్తే ఎలా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. “ఘోరాల గురించి వార్తాల్లో, మాటల్లో వింటున్నారని మీరు అంటున్నారు కదా.. మరొకసారి శౌర్య జోలికి వస్తే జ్యోత్స్న వస్తే ఎవరి గురించో మనం వినడం కాదు. నా గురించే జనం వింటారు.నెత్తురులో తడిచిన ఆవేశం నాలోపల నిద్రపోతోంది. దాన్ని అలాగే నిద్రపోనీయండి. ఆవేశానికి ఆకలి ఎక్కువ. లేచిందంటే బలికోరుతుంది. అది ఎవరికీ మంచిది కాదు” అని దీప అంటుంది. ఈ విషయాలను సుమిత్ర, కాంచనకు చెప్పొద్దని అంటుంది. జోత్స్నది ఏ తప్పు లేదని, తాను చూసింది వేరే వ్యక్తి అని శౌర్యకు చెప్పాలని దీప చెబుతుంది.
మీరు లేకపోతే నేను తనకు దక్కుతానని జోత్స్న అనుకుంటోందని కార్తీక్ అంటాడు. ఎప్పుడో ఒకసారి గట్టిగా సమాధానం చెబుతానంటాడు. కార్తీక్ బాబు అని దీప అనబోతే.. ఇప్పుడు కాదులే అని కార్తీక్ అంటాడు. ఇంటికి వెళ్లాక ఓ విషయం చెబుతానంటాడు. “నువ్వే నా ప్రాణదాతను అని నిజం తెలిసిందని చెబుతాను దీప” అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
జ్యోత్స్నను దీప కొట్టిన విషయాన్ని, వార్నింగ్ ఇచ్చిన మాటలను శివన్నారాయణ, సుమిత్ర గుర్తుచేసుకుంటుంటారు. దీపను ఊరికే వదలకూడదు, నా మనరాలిపై చేయి చేసుకున్నందుకు బుద్ధి చెప్పాల్సిందేనని శివన్నారాయణ అంటాడు. ఆధారాల కోసం వెళ్లింది కదా.. వదిలేయండి నాన్న అని దశరథ్ అంటాడు. ఇంట్లో ఉన్న మనిషి నేరం చేసిందని ఎలా ఆధారాలు తీసుకొస్తుందని శివన్నారాయణ చెబుతాడు.
తన కూతురు తనకు ఎంతో.. నా కూతురు నాకు అంతేగా అని దీప గురించి సుమిత్ర అంటుంది. జ్యోత్స్నను కొడితే తట్టుకోలేకపోయానని చెబుతుంది. ఒకవేళ జ్యోత్స్న తప్పు చేసిందని దీప ఆధారాలు తీసుకొస్తే ఏం చేస్తావని దశరథ్ అంటాడు. జోత్స్న తప్పు చేయలేదని తాను నమ్ముతున్నాను కాబట్టే.. చెంపదెబ్బ దీపకు తగిలిందని, లేకపోతే జోత్స్నకు తగిలేదని సుమిత్ర అంటుంది. తప్పు ఎవరు చేసినా సమర్థించనని చెబుతుంది. ఇది అంతా వింటూ ఏం చేయని దానిలా అమాయకంగా చూస్తూ నటిస్తుంటుంది జ్యోత్స్న.
దీప వేసిన నింద నిజమైతే ఏం చేస్తావని దశరథ్ అడుగుతాడు. అదే నిజమైతే దీప చేయాలనుకున్న పని తానే చేస్తానని, జ్యోత్స్నను పోలీసులకు పట్టిస్తానని చెబుతుంది. దీంతో జోత్స్న కంగారు పడుతుంది. అవసరం లేదని, జోత్స్న పొరపాట్లు చేస్తుందే కానీ పాపాలు చేయదని శివన్నారాయణ అంటాడు. అప్పుడు మత్తులో ఉండి జోత్స్న యాక్సిడెంట్ చేసిందని చెబుతాడు. నీ మనవరాలు ఇంకా ఇప్పటికీ మత్తులోనే ఉందని దశరథ్ అనుకుంటాడు. దీప, శౌర్యపై దాడి చేసింది జ్యోత్స్నే అని అనుమానిస్తాడు.
దీప చెప్పేది నిజం అనుకుంటే.. దీపను, శౌర్యను జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంటుందని దశరథ్ మనసులో అనుకుంటాడు. అది నిజం కాకపోతే దాసును ఎందుకు చంపాలనుకోవడానికి కారణం ఏంటి అని అనుకుంటాడు. ఈ రెండింటికి సంబంధం ఏంటని ఆలోచిస్తాడు. దాసు చెప్పే మాటలు బట్టే ఇదంతా జోత్స్న ఎందుకు చేస్తుందో తెలుస్తుందని దశరథ్ అనుకుంటాడు.
కార్తీక్, దీప ఎక్కడికి వెళ్లారని కాంచన, అనసూయ అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇద్దరూ వస్తారు. ఎక్కడికి వెళ్లారని కాంచన అడిగితే.. దీప చేతికి కట్టు మార్చేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లానని కార్తీక్ అంటాడు. శౌర్య భయపడిపోతోందని అనసూయ చెబుతుంది. బూచోడు రాడు అన్నా భయంగా చూస్తోందని అంటుంది. బూచోడు కాదు.. అంటూ జ్యోత్స్న పేరు చెప్పేందుకు శౌర్య సిద్ధమైతే దీప ఆపేస్తుంది. జరిగింది మరిచిపోవాలని అంటుంది.
శౌర్య ఇప్పటి నుంచి స్కూల్‍కు బస్సులో వెళుతుందని, ఇక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటాడు కార్తీక్. స్కూల్‍కు వెళుతుంటే ఎవరు అటాక్ చేసేందుకు లేకుండా ఇలా ప్లాన్ చేస్తాడు కార్తీక్. భయపడాల్సిన అవసరం లేదని అంటాడు. అటాక్ చేసింది జోత్స్న కాదని, ఆమెలా ఉండే వేరే మనిషి అని శౌర్యకు దీప నచ్చజెబుతుంది. తనను ఎవరో అని అంటుంది. నాకు జ్యోలా కనిపడిందే అని శౌర్య అంటే.. తాను కాదు అని దీప చెబుతుంది. ఈ విషయం మరిచిపోవాలని, ఎవరికీ ఏమీ చెప్పవద్దని అంటుంది. అక్కడ ఎవరిని చూశావని దీప అంటే.. నాకు తెలియదని శౌర్య అంటుంది. ఎవరు అడిగినా ఇలాగే చెప్పాలంటుంది దీప.
తన మెడలో ఉన్న లాకెట్ తెంపేశారని, పోయిందని శౌర్య అంటుంది. దీంతో దీప కోప్పడుతుంది. లాకెట్ పోయిందా అని కంగారుగా అంటుంది. కార్తీక్ బాబు వద్దన్నా మెడలో వేసుకున్నావని చెబుతుంది. రెండోసారి కూడా పోయిందని అంటుంది. దీంతో మొదటిసారి ఎప్పుడు పోయిందని దీపను ఇరకాటంలో పెడతాడు కార్తీక్. చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడినప్పుడు పోయిందని దీప చెబుతుందేమోనని వేచిచూస్తాడు. వేరే వాళ్లు పరేసుకున్నారని, ఇప్పుడు శౌర్య పడేసిందని, అంటే రెండోసారి పోయినట్టే కదా అని దీప అంటుంది.
నువ్వు పారేసుకున్నట్టు కంగారు పడుతున్నావ్ అని కార్తీక్ అంటాడు. నేనేందుకు పారేసుకుంటా.. అది మీ ప్రాణదాతది కదా అని దీప నిజం దాస్తుంది. నీది కాకూడదా అని కార్తీక్ అంటాడు. లాకెట్ పోగొట్టుకున్నా సారీ అని శౌర్య అంటే.. సారీ వెనక్కి తీసుకోవాలని కార్తీక్ చెబుతాడు. నా ప్రాణదాత నన్ను వదిలేసి వెళ్లదని, ఎప్పుడూ తనతోనే ఉంటుందని దీపను చూసి కార్తీక్ అంటాడు. “కార్తీక్ బాబు నన్ను చూసి ఇలా మాట్లాడుతున్నారేంటి. నిజం తెలిసిందా ఏంటి” అని దీప తికమక పడుతుంది. నా ప్రాణదాత నాతోనే ఉంటుంది కదా.. చెప్పు దీప అని అడుగుతాడు.
అమ్మేదో నీ ప్రాణదాత అయినట్టు అడుగుతావేంటి డాడీ అని కార్తీక్‍తో శౌర్య అంటుంది. మీ అమ్మే నా ప్రాణదాత అని కార్తీక్ అంటే.. దీప షాక్ అవుతుంది. ఏంటి అని శౌర్య అంటే.. అసలు విషయం చెప్పడు కార్తీక్. నేను ప్రాణదాతను ఏంటి.. ఆ లాకెట్ నాది కూడా అంటూ అబద్ధం చెబుతుంది దీప. నీదని నేను అన్నానా అని కార్తీక్ అంటాడు. అమ్మ నా పెద్ద ప్రాణదాత.. నన్ను కాపాడిన అమ్మాయి చిన్న ప్రాణదాత.. లాకెట్ చిన్నప్రాణ దాతదే అని కార్తీక్ అంటాడు. చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడింది దీపే అని తనకు తెలిసిందనే విషయం చెప్పకుండా దాగుడుమాతలు ఆడతాడు కార్తీక్.
ప్రాణం పోయినా ఆ చైన్‍ను పోగొట్టుకోనని కార్తీక్ అంటాడు. జేబులో నుంచి లాకెట్ తీస్తాడు. చైన్‍ను ప్రేమగా చూస్తాడు. దీప, శౌర్య సంతోషిస్తారు. నీకు దొరికిందా అని శౌర్య అంటే.. నా ప్రాణం కదా, ఎక్కడ ఉన్నా నన్ను వెతుక్కుంటూ వస్తుందని కార్తీక్ అంటాడు. ప్రాణదాత కూడా నన్ను వెతుక్కుంటూ వస్తుందని చెబుతుంది. ఎలా వస్తుందని శౌర్య అడిగితే.. చెప్పు దీప ఎలా వస్తుందని కార్తీక్ అంటాడు. దీప కంగారు పడుతుంది.
దేవుడిని అడుగుదామని శౌర్య అంటుంది. అడగకుండానే ఆ దేవుడు నా ప్రాణదాతను నా దగ్గరికి పంపిస్తాడనే నమ్మకం ఉందని దీపను చూస్తూ అంటాడు కార్తీక్. నిజం తెలిసిందా అన్నట్టు చూస్తుంటుంది దీప. “నువ్వు బయటపడవని అర్థమైంది దీప. మరి నేనెందుకు బయటపడాలి. నువ్వు నాతో దాగుడు మూతలు ఆడినట్టు.. నేనూ నీతో దాగుడు మూతలు ఆడతాను” అని లాకెట్ చూస్తు మనసులో అనుకుంటాడు కార్తీక్. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 5) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం