Karthika Deepam 2 Serial March 22: తాత మనవళ్ల మాటల యుద్ధం.. ఆలోచన కనిపెట్టేసిన కార్తీక్.. దీపను పిలిచేందుకు సుమిత్ర నో-karthika deepam 2 serial today episode march 22 karthik shivanarayana war words deepa hurts star maa jiohotstar today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial March 22: తాత మనవళ్ల మాటల యుద్ధం.. ఆలోచన కనిపెట్టేసిన కార్తీక్.. దీపను పిలిచేందుకు సుమిత్ర నో

Karthika Deepam 2 Serial March 22: తాత మనవళ్ల మాటల యుద్ధం.. ఆలోచన కనిపెట్టేసిన కార్తీక్.. దీపను పిలిచేందుకు సుమిత్ర నో

Karthika Deepam 2 Serial Today March 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న నిశ్చితార్థానికి సుమిత్రను పిలిచేందుకు వస్తారు శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర పారిజాతం. ఈ తరుణంలో తాతతో కార్తీక్ వాదన సాగుతుంది. సుమిత్ర మాటలతో దీప బాధపడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Serial March 22: తాత మనవళ్ల మాటల యుద్ధం.. ఆలోచన కనిపెట్టేసిన కార్తీక్.. దీపను పిలిచేందుకు సుమిత్ర నో

కార్తీక దీపం 2 నేటి (మార్చి 22) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న నిశ్చితార్థానికి తన పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారేమోనని వేచిచూస్తుంటుంది కాంచన. బంధాలు నిలబడాలంటే రాజీ పడాలని, కానీ ఎవరికి ఆ మనస్తత్వం లేదని, కానీ ప్రేమలు ఉన్నాయని కార్తీక్ అంటాడు. వద్దనుకునే వారి కోసం ఎదురుచూడొద్దని, ఎవరూ రారు చెబుతాడు. ఇంతలో కార్తీక్ ఇంటికి కాంచన అన్న దశరథ్, వదిన సుమిత్ర వస్తారు. వారిని చూసి కాంచన సంతోషిస్తుంది. పారిజాతం కూడా అడుగుపెడుతుంది. స్వయాన మీ నాన్నే వచ్చారని కాంచనతో పారు అంటుంది. ఏంటి నాన్న వచ్చాడా అని సంబరపడుతుంది కాంచన. సంతోషంగా వీల్‍చైర్‌లో నుంచి లేచేందుకు ప్రయత్నిస్తుంది. గుమ్మం దగ్గరే శివన్నారాయణ నిలబడి ఉంటాడు.

కోతిలాగైనా మారిపోతాడు

అక్కడే ఆగిపోయావే.. లోపలికి రా నాన్న అని శివన్నారాయణను కాంచన పిలుస్తుంది. మనం కలవడం అంటూ జరిగితే ముందుగా నువ్వు నా ఇంటి గుమ్మం తొక్కాలే కానీ.. నేను నీ ఇంటి గుమ్మం తొక్కనని నీ కొడుకు ఛాలెంజ్ చేశాడని, అది కూడా నీ కోడలి కోసమే అని శివన్నారాయణ అంటాడు. “ఆ మాటకు వస్తే దీప కోసం వీడు కొండ మీద కోతినైనా తీసుకొస్తాడు. లేకపోతే వాడే కోతిలా మారిపోతాడు” అని శివన్నారాయణ వెటకారంగా అంటాడు. వాళ్లం ఇంటికి వెళితేనే కాదు.. మన ఇంటికి వచ్చినా ఇలాగే పద్ధతులు, పలకరింపులు ఉంటాయని తల్లి కాంచనతో కార్తీక్ అంటాడు.

కార్తీక్ కోపం

“మనం గుమ్మంలోకి వెళ్లి పేరు పెట్టి పిలిచినా ఎగిరిపడతారు. వీళ్లు మాత్రం గుమ్మంలో నిలపడి కోతి, కొండముచ్చు అంటూ పేర్లు పెట్టొచ్చు” అని తాత మాటలపై కార్తీక్ కోప్పడతాడు. ఇన్ని మెట్లు దిగొచ్చిన మా ఆయనను అవమానిస్తారా అని గొడవ పెంచేందుకు పారిజాతం ప్రయత్నిస్తుంది. గతం గురించి మేం మాట్లాడామా అంటూ కార్తీక్ ఆగ్రహిస్తాడు. “ఆవేశపడింది నువ్వు, ప్రగల్భాలు పలికింది నువ్వు.. గీతలు గీసుకొని బయట నిలబడింది నువ్వు.. సవాల్ చేసింది నువ్వు” అని కార్తీక్‍ను అంటాడు శివన్నారాయణ. తాను సవాల్ చేయలేదని, చేసిన వాళ్లు నిలబెట్టుకోండని అంటాడు.

ఆస్తి గొడవ రేపేందుకు పారు ప్రయత్నం

మొత్తానికి కార్తీక్ ఇంట్లోకి శివన్నారాయణ అడుగుపెడతాడు. ఇలా కూర్చొండని దీప.. అంటే నాకు ఎవరి మర్యాదలు అవసరం లేదని చెబుతాడు. ఇప్పుడు నీ కూతురు పేదింటిదే నాన్న.. ఇక్కడ కూర్చుంటే నీకు అవమానంగా ఉంటుందని కాంచన అంటుంది. ఆస్తి పంచలేదని మనసులో పెట్టుకొని కాంచన ఈ మాటలు అంటోందని గొడవ పెద్దది చేసేందుకు పారిజాతం ప్రయత్నిస్తుంది. లేనిపోని గొడవ పెట్టేందుకు కాకపోతే ఈ మాటలు ఎందుకమ్మా అని అనసూయ అంటుంది. శ్రీధర్ వచ్చి ఆస్తిలో వాటా కోసం రెచ్చగొట్టినా మాది కాని ఆస్తి మాకొద్దని కార్తీక్, కాంచన అన్నారని అనసూయ చెబుతుంది. ఇలాంటి కూతురు, మనవడు ఈ కాలంలో ఎక్కడా ఉండరని చెబుతుంది. నువ్వు, నీ కోడలు, నీ మనవరాలు కలిసి వీళ్లను బాగానే అదృష్టవంతులను చేశారని దెప్పిపొడుస్తుంది పారిజాతం.

తాత, మనవళ్ల హోరాహోరీ

అత్తయ్య మనం వచ్చిన పనేంటి..మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటని పారిజాతంతో సుమిత్ర అంటుంది. అవతలి వాళ్ల మాటలకు జవాబులమ్మా అని శివన్నారాయణ వెనుకేసుకొస్తాడు. నీడ కోసం జారపడిన వాళ్లు మాట్లాడుతుంటే.. తప్పు చేసిన వారిలా మనమెందుకు నిలబడి చూడాలని శివన్నారాయణ అంటాడు. ఇక్కడ నీడకోసం ఎవరూ జారపడలేదు, మీరే మీ అవసరాల కోసం ఇంటికి తెచ్చుకున్నారని గతం గురించి కార్తీక్ గుర్తు చేస్తాడు. మీ ఇంటి మహాలక్ష్మి ప్రాణాలు కాపాడిందనే దీపను ఇంటికి తెచ్చుకున్నారని అంటాడు. ఏదో ఒకటి ఇచ్చి వదిలించుకోవాలని ఆరోజే చెప్పా కదా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు గతాన్ని తవ్వుకోవాల్సిన అవసరం లేదని, వచ్చిన పని చూసుకొనిపోతే మంచిదని శివన్నారాయణ అంటాడు.

జ్యోత్స్న మనసుకు ఎవరు ఎన్ని గాయాలు చేసినా తట్టుకొని నిలబడి నా మాట ప్రకారం పెళ్లికి ఒప్పుకుందని కాంచనతో శివన్నారాయణ అంటాడు. “కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు మీ మనవరాలు మీకు ముద్దు. ఆవిడ మీద మీ ప్రేమ చూపిందుకు ఇతరుల మీద నిందలు వేయొద్దు” అని తాతకు కౌంటర్ ఇస్తాడు కార్తీక్. జ్యోత్స్నను కోడలిగా చేసుకోవాలని మీ అమ్మే అనుకుంది రా అని శివన్నారాయణ చెబుతాడు. తాను జ్యోత్స్ను ఇష్టపడలేదని, మీ బంధాల కోసమే అప్పుడు ఓకే అన్నానని కార్తీక్ అంటాడు.

ఇప్పుడు శత్రువు.. నీ కొడుకే కదా

నా మేనత్త, బావ నా నిశ్చితార్థానికి రావాలని, ఇది నా కోరిక అని జ్యోత్స్న తనను అడిగిందని శివన్నారాయణ అంటాడు. అందుకే పిలవడానికి వచ్చాననేలా మాట్లాడతాడు. మీ మనవరాలు అడగకపోతే నీకు నీ కూతురు గుర్తురాదా అని తాతను కార్తీక్ అడుగుతాడు. ఇప్పుడేం మాట్లాడొద్దని కాంచన ఆపేస్తుంది. వ్యాపారంలో ఇప్పుడు నాకు శత్రువు నీ కొడుకే కదా అని కాంచనతో శివన్నారాయణ అంటాడు. ఆ మాత్రం ఉక్రోషం ఉంటుందని చెబుతాడు. కార్తీక్ బాబు ఎప్పుడూ మిమ్మల్ని అయిన వారిగానే చూశాడు తాతయ్య అని దీప అంటుంది.

కాంచనను ఆహ్వానించిన సుమిత్ర

మనం వచ్చింది గతాన్ని తవ్వుకొని గొడవ పడేందుకు కాదని, నిశ్చితార్థానికి పిలిచేందుకుని సుమిత్ర అంటుంది. పిలవండని శివన్నారాయణ అంటాడు. వీళ్లైతే గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్లిపోతారని వెటకారంగా అంటుంది పారిజాతం. దంపతులిద్దరూ కలిసి పిలవండని సుమిత్ర, దశరథ్‍కు శివన్నారాయణ చెబుతాడు. వదిన అంటూ ఆప్యాయంగా సుమిత్ర చేయి పట్టుకుంటుంది కాంచన. మనసులో కోపం లేదు కదా అని సుమిత్ర అంటే.. ఎమోషనల్ అవుతుంది కాంచన. రేపు నీ మేనకోడలి నిశ్చితార్థానికి రావాలని, ఇంటి ఆడపడుచువైన నీ ఆశీర్వాదం లేకుండా నీ పుట్టింట్లో ఏ శుభకార్యం జరగదని చెబుతుంది. బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. నువ్వు, కార్తీక్, దీప అని సుమిత్ర అంటుంటే.. పిలుపులు అంత వరకు చాల్లే సుమిత్ర అని పారిజాతం అంటుంది. దీపను ఆహ్వానించొద్దనేలా మాట్లాడుతుంది.

మర్యాదస్తులనే పిలవాలి

పిన్ని మర్యాదకైనా పిలుస్తాం కదా అని దశరథ్ అంటాడు. మర్యాదకు మర్యాదస్తులనే పిలవాలని, కనిపించిన వారందరినీ కాదని దీపను బాధపెట్టేలా శివన్నారాయణ మాట్లాడతాడు. నేను నా భార్య ఎవరి పిలుపుల కోసం చూడడం లేదని, మీరు మీ కూతురు కోసం వచ్చారు పిలిచారు అని తాతపై కార్తీక్ ఫైర్ అవుతాడు. కాంచన కొడుకుగా నీకు ఎలాగూ ఆహ్వానం ఉంది.. ఇక దీప అంటావా క్యాటరింగ్ మీదే కదా ఎలాగూ వస్తుందని శివన్నారాయణ అంటాడు.

నీ తెలివితేటలకు జోహార్లు.. తాత ఆలోచన చెప్పేసిన కార్తీక్

నీ తెలివి తేటలకు జోహార్లు తాత అని కార్తీక్ అంటాడు. “జ్యోత్స్న రెస్టారెంట్ ఉండగా.. సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి ఎదురు ఆర్డర్ చేశారా అని అనుకున్నా. నీకు తెలియకుండానే అది జరిగింది. నీకు తెలిసిన తర్వాత వద్దంటావనుకున్నా. కానీ ఇప్పుడర్థమైంది. మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఒకటే అని మగపెళ్లి వాళ్ల ముందు మీ మర్యాద కాపాడుకునేందుకు” అని కార్తీక్ అంటాడు. తాత ఆలోచనను సరిగ్గా కనిపెడతాడు. వచ్చిన పని అయింది కదా అని శివన్నారాయణ అంటాడు.

భోజనాల విషయంలో చెడ్డపేరు రాకుండా చూడండని శివన్నారాయణ అంటాడు. మీ రెస్టారెంట్ నుంచి కాకుండా మా రెస్టారెంట్‍కు ఆర్డర్ ఇచ్చారంటేనే అర్థమవుతోంది కదా అని తాతకు పంచ్ వేస్తాడు కార్తీక్. అప్పడంతో సహా అన్ని స్పెషల్‍గానే ఉంటాయని చెబుతాడు. చెడ్డపేరైతా రానీయకండని శివన్నారాయణ అంటే.. వంటలు అద్భుతంగా ఉన్నాయని గుర్తుండిపోతాయని కార్తీక్ చెబుతాడు. దీప చేతి వంటలు అలా ఉన్నాయని చెబుతాడు. మంచి నీళ్లైనా తాగు నాన్న అని కాంచన అంటే.. వద్దంటాడు శివన్నారాయణ. బయటికి వెళతాడు.

దీపను ఆహ్వానించని కాంచన

ఉంటాను వదినా అని కాంచనతో సుమిత్ర అంటుంది. కార్తీక్‍కు కూడా చెబుతుంది. అంతేనా అత్త.. ఇంట్లో నువ్వు బొట్టు పెట్టి పిలవాల్సిన వాళ్లు ఎవరూ లేరా అని అడుగుతాడు. ఒకప్పుడు ఉండే వారు.. ఇప్పుడు వాళ్ల మనసులు మారిపోయానని దీపను ఉద్దేశించి సుమిత్ర అంటుంది. దీపను ఆహ్వానించదు. నువ్వు తప్పకుండా రావాలని దశరథ్ అంటే.. వస్తాను అన్నయ్య అని కాంచన అంటుంది. నా భార్యకు ఆహ్వానం లేదని, అంతేనా అని దశరథ్‍తో కార్తీక్ అంటాడు. పారిజాతం మళ్లీ గొడవ పెట్టేందుకు మాట్లాడుతుంటే.. సుమిత్ర అడ్డుకుంటుంది. మా మనవరాలి వైభోగం చూసేందుకు తప్పకుండా రా అని అని పారిజాతం వెళుతుంది. మీ మేనకోడలిని నువ్వు ఆశీర్వదించాలి గుర్తు పెట్టుకో అని చెప్పి సుమిత్ర కూడా బయలుదేరుతుంది.

మనవడిగా కాదు.. కార్తీక్‍గానే వెళతా

చెల్లెమ్మ నీకు ఇప్పుడు సంతోషమేనా.. మీ నాన్న, అన్నయ్య, వదిన వచ్చి పిలుచారని కాంచనతో అనసూయ అంటుంది. మనవరాలి కోసమే పిలుచారని కార్తీక్ అంటాడు. ఎలాగైతే ఏం పిలిచారు కదా అని దీప అంటుంది. నేను మనవడిగా కాదు.. కార్తీక్‍గానే వెళతానని చెబుతాడు. రేపు వంటలకు సరుకులు రిస్ట్ రాసుకుందాం దా దీప అని కార్తీక్ అంటాడు.

నిజం చెప్పని కార్తీక్

దీప మీద వదిన సుమిత్ర ఎందుకు కోపంగా మాట్లాడుతోందని కార్తీక్‍ను సుమిత్ర అడుగుతుంది. మెనూ రాసుకునేందుకు వెళ్లినప్పుడు గొడవ జరిగిందని అంటాడు. దీప, శౌర్యను చంపేందుకు ప్రయత్నించిన జ్యోత్నను దీప కొట్టడం, దీపను సుమిత్ర కొట్టిన నిజాన్ని దాచేస్తాడు. చిన్న గొడవే అంటాడు. చిన్న తగాదా అయితే వదిన అలా దూరం చేసినట్టు అలా ఎందుకు మాట్లాడుతుంది. నేను వదిననే అడిగి తెలుసుకుంటానని అనసూయతో కాంచన చెబుతుంది.

శ్రీధర్ మళ్లీ ప్లాన్

తెల్లవార్లు టీవీ చూస్తుంటే కూర్చుంటే రేపు ఫంక్షన్‍లో గ్లామర్ దెబ్బ తినదు అని కావేరిత శ్రీధర్ అంటాడు. ఫంక్షన్ ఏంటని కావేరి అడిగితే జ్యోత్స్న ఎంగేజ్‍మెంట్ కదా మనం వెళుతున్నామని శ్రీధర్ చెబుతాడు. పిలవలేదు కదా అని కావేరి అంటుంది. తాను సీజన్ లాంటోడనని, వెళతానని వాగేస్తాడు శ్రీధర్. తాను రానని కావేరి తెగేసి చెబుతుంది. నేను వెళతానని శ్రీధర్ అంటాడు. ఇద్దరూ వాదులాడతారు. జ్యోత్స్న ఎంగేజ్‍మెంట్‍కు వెళ్లి రచ్చ చేయాలని శ్రీధర్ ప్లాన్ చేసుకుంటాడు.

మామయ్యే చంపాడేమో..

రేపు చుట్టాలందరూ వస్తారు.. నన్ను అందరి ముందు పొమ్మనగలరా అని శ్రీధర్ అంటాడు. మేనకోడలిపై ప్రేమతో మీరు వెళ్లాలనుకోవడం లేదని, ఆయనపై పగ తీర్చుకునేందుకు కదా అని కావేరి అంటుంది. అవును అని శ్రీధర్ అంటాడు. రెండో పెళ్లి చేసుకున్నందుకు కొట్టారు తప్పా అని కావేరి అంటుంది. శివన్నారాయణ కూడా రెండో పెళ్లి చేసుకున్నారని, ఆయనను కూడా కొట్టాలి కదా అని శ్రీధర్ అంటే.. భార్య చనిపోయాక చేసుకున్నాడని కావేరి అంటుంది. “ఏమో ఎవరికి తెలుసు.. పెద్దత్తయ్య చనిపోయారో.. మామయ్యే చంపేశారో” అని శ్రీధర్ నోటికి వచ్చినట్టు మాట్లాతాడు. ఈ మాట వింటే ఆయన మిమ్మల్ని బతకనిస్తారా అని కావేరి అంటుంది. నేనైతే రానని తెగేసి చెబుతుంది. ఎవరి కోసం తాను ఆగనని, ఎవరినీ వదిలిపెట్టనని శ్రీధర్ అనకుంటాడు. శివ డార్లింగ్ రేపు మనం ఎంగేజ్‍మెంట్‍లో కలుస్తున్నామంటూ సంబరపడతాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగిసింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం