దీప కోసం సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీ ప్లాన్ చేస్తాడు కార్తీక్. భర్త సర్‌ప్రైజ్‌కు దీప థ్రిల్లవుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత శౌర్య, కార్తీక్‌లలో ఎవరికి ముందుగా తినిపించాలో తెలియక డైలమాలో పడుతుంది. దీప సమస్యను కార్తీక్ అర్థం చేసుకుంటాడు. భర్త కంటే బిడ్డలే ముద్దు అని శౌర్యకే మొదట కేక్ తినిపించమని అంటాడు. నాన్నకే ముందు తినిపించమని శౌర్య పట్టుపడుతుంది. చివరకు దీప, కార్తీక్ ఇద్దరు కలిసి శౌర్యకు కేక్ తినిపిస్తారు. ఆ తర్వాత దీపకు కేక్ తినిపించిన కార్తీక్...ప్రియమైన శ్రీమతికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని విషెస్ చెబుతాడు.
దీపకు బర్త్‌డే గిఫ్ట్‌గా గాజులు కొంటాడు కార్తీక్. వాటిని తానే స్వయంగా దీప చేతికి తొడుగుతాడు. ఆ సీన్ చూసి కాంచన, అనసూయ ఆనందపడతారు. ఎవరికైనా మంచి భర్త...బావగా వస్తాడు. నాకు మాత్రం బావ మంచి భర్త అయ్యాడని మనసులో దీప మురిసిపోతుంది.
జ్యోత్స్న బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో కార్తీక్, దీప డెకరేషన్ పనుల్లో బిజీగా ఉంటారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను అడ్డుపెట్టుకొని దీప, కార్తీక్‌లను దెబ్బకొట్టాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఏం చేయబోతున్నాదని పారిజాతం అడుగుతుంది. ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా అని అంటుంది. మళ్లీ జ్యోత్స్న ఏం గొడవ చేస్తుందోనని పారిజాతం కంగారు పడుతుంది.
తన పుట్టినరోజు నాడు సుమిత్ర ఆశీర్వాదం తీసుకోవాలని దీప అనుకుంటుంది. తల్లి కాళ్లకు మొక్కబోతుంది దీప. కానీ సుమిత్ర వెనక్కి జరుగుతుంది. సుమిత్ర, శివన్నారాయణ కలిసి దీపను మాటలతో బాధపెడతారు. దీవెనలు అందుకునే మనిషిపైనే ప్రేమ, జాలి ఉండాలి.
దీపపై నాకు ఆ రెండు లేవని సుమిత్ర అంటుంది. ఆశ్రయం ఇచ్చిన వాళ్లను బాధపెట్టు...అన్నం పెట్టిన వాళ్లను చంపు అని దీవించాలా దీపను ఏమని దీవించాలని అని అంటుంది. సుమిత్ర మాటలతో దీప ఎమోషనల్ అవుతుంది.నువ్వు నమ్ముకున్న దేవుడు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇప్పిస్తాడని దీపను ఓదార్చుతాడు కార్తీక్.
కేక్ కట్ చేయడానికి వచ్చిన జ్యోత్స్న సడెన్‌గా ప్లేట్ ఫిరాయిస్తుంది. బొమ్మల విషయంలో అమ్మనాన్నలతో పాటు దీపను బాధపెట్టానని అంటుంది. నా తప్పును నేనే సరిచేసుకుంటానని అంటుంది.
బొమ్మలు మాత్రం తిరిగి ఇచ్చేది లేదని కార్తీక్ అంటాడు. బొమ్మలు నీ దగ్గర ఉంటే ఏంటి..నా దగ్గర ఉంటే ఏంటి...మనమంతా ఒక్కటే కదా బావ అని కార్తీక్‌తో ప్రేమగా మాట్లాడుతుంది జ్యోత్స్న. ఓరి దీని వేషాలు...మళ్లీ ఏదో ప్లాన్ చేసిందని అలెర్ట్‌గా ఉండాలని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
ఈ బర్త్‌డే కేక్‌ను నాతో పాటు దీప కూడా కట్ చేస్తుందని, ఇద్దరం కలిసే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటామని జ్యోత్స్న అంటుంది. దీప కేక్ కట్ చేయడానికి ఒప్పుకోదు. జ్యోత్స్న వినకుండా దీప చేయి పట్టుకొని బలవంతంగా కేక్ ఉన్న టేబుల్ దగ్గరకు తీసుకొస్తుంది. టేబుల్‌పై దీప తూలి పడేలా చేస్తుంది. ఎవరూ చూడకుండా కేక్‌ను కిందపడేస్తుంది పారిజాతం. ఆ తప్పును దీపపై నెట్టేస్తుంది.
ఇష్టం లేదంటే పక్కకు వెళ్లిపోవాలి కానీ ఇలా కేక్‌ను కిందపడేస్తావా అంటూ దీపను నానా మాటలు అంటుంది. పుట్టిన రోజు పూట నేను నిన్ను బాధపెట్టకూడదనుకుంటే నువ్వు నన్ను బాధపెడతావా అని జ్యోత్స్న కూడా సడెన్‌గా మాట మార్చేస్తుంది. నా లైఫ్‌లోకి ఏ సంతోషాన్ని రానివ్వవా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా డ్రామా ఆడుతుంది. నేను ఈ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోలేనని తన రూమ్‌లోకి వెళ్లిపోతుంది.
దీప, కార్తీక్‌లను వెంటనే ఇంట్లోనుంచి పంపించేయాల్సిందేనని పట్టుపడుతుంది పారిజాతం. దీపను మెడపట్టి గెంటేయబోతుంది. పారిజాతాన్ని ఆపుతాడు కార్తీక్. జ్యోత్స్న బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుందని, ఆమెను తాను కిందికి తీసుకొస్తానని అంటాడు. జ్యోత్స్న రూమ్‌లోకి వెళ్లి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి రమ్మని పిలుస్తాడు. రానని జ్యోత్స్న బెట్టు చేస్తుంది. దీప నా బర్త్‌డే కేక్‌ను కిందపడేసిందని అంటుంది. పుట్టినరోజు అని ఆలోచిస్తున్నాను కానీ లేదంటే లాగిపెట్టి రెండు కొట్టేవాడిని అని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్.
పారిజాతం కేక్ కిందపడేసిన వీడియోను జ్యోత్స్నకు చూపిస్తాడు. నువ్వు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాయి. దీపకు సారీ చెప్పి బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం కిందకు రాకపోతే ఈ వీడియోను మీ అమ్మనాన్నలతో పాటు తాతకు చూపిస్తానని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. దీపకు సారీ చెప్పేది లేదని మొండిపట్టుపడుతుంది. నువ్వు రాకపోతే ఈ వీడియోను అందరికి చూపిస్తానని కార్తీక్ కిందకు వెళతాడు.నిజంగానే అన్నంత పనిచేస్తాడని భయపడి జ్యోత్స్న కిందకు దిగుతుంది.
కాళ్లు పట్టుకొని జ్యోత్స్నకు క్షమాపణల చెప్పావా కార్తీక్‌పై శివన్నారాయణ సెటైర్లు వేస్తాడు. అమ్మనాన్నల గురించి ఆలోచించి కిందకు వచ్చానని జ్యోత్స్న అంటుంది. దీప కావాలని కేక్ కిందపడేయలేదని, ఆమెను అనవసరంగా బాధపెట్టానని దీపకు సారీ చెబుతుంది.
కేక్ లేదుగా ఇప్పుడు ఎలా కట్ చేయాలని అని జ్యోత్స్న అప్పుడే. చిటికిస్తే ఇప్పుడే వస్తుందని కార్తీక్ అంటాడు.కార్తీక్ చిటికె వెయగానే డెలివరీ బాయ్ కేక్ తీసుకొస్తాడు. ఆ కేక్‌పై జ్యోత్స్నతో పాటు దీప పేరు రాసి ఉంటుంది. అది చూసి జ్యోత్స్న షాకవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం