Karthika Deepam 2 Serial: శౌర్య ట్రీట్‌మెంట్‌కు జ్యోత్స్న డబ్బు సాయం - కార్తీక్‌కు దూరం కానున్న దీప - కాంచన కన్నీళ్లు
కార్తీక దీపం 2 జనవరి 30 ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు కోసం కార్తీక్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. అవేవి ఫలించవు. దీపకు సాయం చేయడానికి జ్యోత్స్న ముందుకొస్తుంది. కానీ కార్తీక్‌తో ఏం సంబంధం లేదని రాసిన పేపర్స్‌పై దీపను సంతకం చేయమని అంటుంది.
శౌర్య అనారోగ్యం గురించి తనకు జ్యోత్స్న చెప్పిందని కార్తీక్‌తో దీప అంటుంది.జ్యోత్స్న మంచిపనే చేసిందని, లేదంటే ఇప్పటికి నేను అబద్ధంలోనే బతికేదానినని ఆవేదనకు లోనవుతుంది. నిజం దాచింది నీ మీద ప్రేమతోనేనని, కోపంతో కాదని దీపతో కార్తీక్ చెబుతాడు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే శౌర్య కూడా తట్టుకోలేదని, తనకు ఈ విషయం తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డానని కార్తీక్ జరిగింది వివరిస్తాడు.

అంతేకానీ మిమ్మల్ని మోసం చేయలేదని చెబుతాడు. శౌర్యకు ఎదన్నా అయితే నువ్వు బతకవని నిజం దాచాల్సివచ్చిందని అంటాడు. నిన్ను, శౌర్యను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని దీపతో కార్తీక్ అంటాడు. ఆపరేషన్‌కు డబ్బులు కావాలి కదా అని దీప అంటుంది. వస్తాయని కార్తీక్ భార్యను ఓదార్చుతాడు.
జ్యోత్స్న మాటలు నమ్మోద్దు...
దీప, శౌర్య గురించి ఆలోచిస్తూ సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో, ఏది నమ్మాలో తెలియడం లేదని భర్తతో తన బాధను పంచుకుంటుంది. జ్యోత్స్న మాటలు నమ్మాల్సిన పనిలేదని, అసలు నిజం ఏం జరిగిందో నువ్వే ఫోన్ చేసి తెలుసుకోమని సుమిత్రకు సలహా ఇస్తాడు దశరథ్. దీపతో పాటు కాంచన, కార్తీక్‌కు సుమిత్ర ఫోన్ చేస్తుంది. ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేయరు. నిజం చెప్పి నిన్ను బాధపెట్టడం తప్ప ఏం ఉండదని సుమిత్ర కాల్‌ను కార్తీక్ కట్ చేస్తాడు. జరిగిందానికి వాళ్లు బాధపడినట్లుగా ఉందని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని దశరథ్ అంటాడు.
ఇల్లు బేరం...
శౌర్య ఆపరేషన్ కోసం ఊళ్లోని ఇళ్లును అమ్మేయాలని అనసూయ అనుకుంటుంది. ఇరవై లక్షల ఇళ్లును పది లక్షలకే బేరం పెడుతుంది. కానీ డబ్బులు వెంటనే ఇవ్వడం కుదరదని బుల్లెబ్బాయి అంటాడు. ఉన్న ఒక్క అవకాశం చేజారిపోవడంతో అనసూయ ఎమోషనల్ అవుతుంది.
హాస్పిటల్ బిల్....
శౌర్య ఆపరేషన్ కోసం యాభై లక్షలు కార్తీక్ ఎక్కడి నుంచి తెస్తాడు, ఎవరు ఇస్తారు అని దీప ఆలోచనలో పడుతుంది. నిజంగా డబ్బు తెస్తాడా? ఆపరేషన్‌కు డబ్బులు లేవంటే నేను బాధపడతానని కార్తీక్ నిజం దాస్తున్నాడా అని మనసులో అనుకుంటుంది. అదే టైమ్‌లో ఏమైంది ఇంతవరకు ఎందుకు హాస్పిటల్ బిల్ కట్టలేదు అని కార్తీక్‌ను అడుగుతాడు డాక్టర్.
నువ్వు నా స్నేహితుడివనే కారణంతోనే డబ్బులు కట్టకున్నా ట్రీట్‌మెంట్ కంటిన్యూ చేశానని, రేపు ఉదయమే శౌర్యకు ఆపరేషన్ అని, ఆ లోపు డబ్బులు కట్టాల్సిందేనని కార్తీక్‌తో డాక్టర్ చెబుతాడు. తాను కూడా ఇకపై ఏం చేయలేనని డాక్టర్ అంటాడు. బ్యాలెన్స్ నలభై ఐదు లక్షలు రేపటిలోగా కట్టాలని డెడ్‌లైన్ పెట్టి వెళ్లిపోతాడు డాక్టర్.
అబద్ధాలు తప్ప డబ్బులు లేవు...
డబ్బులు దొరుకుతాయనే నమ్మకం మీ ముఖంలో కనిపించడం లేదని, ట్రీట్‌మెంట్ ఆగకూడదని డాక్టర్‌కు ఎలాగైతే అబద్ధం చెప్పారో...నాకు అలాగే చెబుతున్నారా అని కార్తీక్‌ను నిలదీస్తుంది దీప. నా కూతురిని బతికించుకోవడానికి నా దగ్గర అబద్దాలు తప్ప డబ్బులు లేవని కార్తీక్ అంటాడు. కాశీ, అనసూయతో తాను డబ్బుల కోసం వెతుకుతున్నామని కార్తీక్ అంటాడు.
శౌర్యను బతికిస్తానని నీకు మాటిచ్చాను...నా మాట మీద నమ్మకముంచమని దీపకు చెప్పి హడావిడిగా కార్తీక్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోతాడు. కార్తీక్‌తో పాటు తాను కూడా డబ్బుల కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలని దీప నిర్ణయించుకుంటుంది.
కాంచన కన్నీళ్లు....
ఇళ్లు అమ్మి డబ్బులు తెస్తానని వెళ్లిన అనసూయ ఉత్త చేతులతోనే తిరిగి వస్తుంది. అది చూసి కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. డబ్బు కోసం కార్తీక్ ఏం చేయాలో అవన్నీ చేశాడని, ఇక చేసేది ఏం లేదని కాంచన అంటుంది. హాస్పిటల్‌కు వెళదామని కాంచనతో అంటుంది అనసూయ.
ఆపరేషన్‌కు డబ్బులు కట్టలేక కూతురి కోసం ఏడుస్తున్న కొడుకు, కోడలిని చూడమంటావా? చావు కోసం దీనంగా ఎదురుచూస్తున్న మనవరాలిని చూడమంటావా?ఎవరిని చూడటానికి హాస్పిటల్‌కు రావాలి అని కాంచన అంటుంది. తన తండ్రి కోటీశ్వరుడు అయినా మనవరాలిని కాపాడుకోలేని పరిస్థితుల్లో తాను ఉన్నానని, శౌర్యకు ఏమన్నా అయితే మన బతుకులకు అర్థమే లేదని కాంచన బాధపడుతుంది.
దేవుడికి మొర....
పదేళ్ల వయసు నుంచి కష్టాలతో పోరాడుతూ పడిపోకుండా నిలబడుతూ వచ్చానని, కానీ ఈ సారి కాలం కొట్టిన దెబ్బ తన కడుపుకు తగిలిందని, నిలబడటానికి ధైర్యం సరిపోవడం లేదని దీప ఎమోషనల్ అవుతుంది. దేవుడికి తన బాధను మొరపెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కూతురిని బతికించుకోవడానికి దారి చూపించమని అంటుంది.
జ్యోత్స్న ఎంట్రీ...
అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. దేవుడు కరుణించాడు దీప. నీకు సాయం చేయడానికి నన్ను పంపించాడని అంటుంది. జ్యోత్స్న మాటలు దీపకు అంతుపట్టవు. నీ కూతురిని కాపాడుకోవాలంటే నీకు యాభై లక్షలు కావాలి. మా బావను పేదవాడిని నువ్వే చేశావు. ఇప్పడు యాభై లక్షలు తేలేని పరిస్థితుల్లో ఉన్నాడని దీపతో అంటుంది జ్యోత్స్న. నా పరిస్థితి గుర్తు చేయడానికి వచ్చావా అని జ్యోత్స్నను అడుగుతుంది దీప.
ప్రాణాలు కాపాడటానికి వచ్చా...
నేను మంచిదానిని, సాయం చేయడానికే వచ్చానని జ్యోత్స్న సమాధానమిస్తుంది. నువ్వు నన్ను కొట్టిన, తిట్టిన అన్ని మర్చిపోయి నీ కూతురు ప్రాణాలను కాపాడటానికి వచ్చానని జ్యోత్స్న అంటుంది. నమ్మకం కుదరకపోతే నువ్వే చూడు అని చెక్‌ను దీపకు చూపిస్తుంది. ఈ చెక్ ఎక్కడో చూసినట్లు ఉంది కదా అని అంటుంది. కార్తీక్ వదిలిపెట్టడానికి నీకు ఎంత కావాలో చెప్పు అంటూ గతంలో దీపకు జ్యోత్స్న చెక్ ఇస్తుంది. కానీ ఆ చెక్‌ను దీప తిప్పికొడుతుంది. ఈ చెక్ అది కాదని, వేరేది రాసుకొచ్చానని జ్యోత్స్న అంటుంది.
కోటి రూపాయలు...
నిన్ను సుమిత్ర పంపించారా అని జ్యోత్స్నను అడుగుతుంది దీప. అసలు శౌర్య అనారోగ్యం గురించి వాళ్లకు తెలియదని, నేను అబద్ధం చెప్పి వాళ్లను రాకుండా ఆపేశానని జ్యోత్స్న చెబుతుంది. ఇక నేను తప్ప నీకు సాయం చేసే వారు ఎవరు లేరని అంటుంది. కోటి రూపాయల చెక్ ఇస్తుంది. ఆ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని అంటుంది.
మంగళసూత్రానికి ఖరీదు
ఆ తర్వాత తన హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి కొన్ని పేపర్స్ తీసి దీపకు చూపిస్తుంది. వాటిపై సంతకం పెట్టమని అంటుంది. నీ కూతురు ప్రాణం ఖరీదు యాభై లక్షలు. కానీ నేను కోటి రూపాయలు ఎందుకు ఇచ్చానో తెలుసా...మిగిలిన యాభై లక్షలు నీ మెడలో ఉన్న మంగళ సూత్రానికి నేను కట్టిన ఖరీదు అని దీపతో జ్యోత్స్న అంటుంది. నీ కూతురు నీకు ప్రాణం...నీ మెడలో తాళి కట్టిన కార్తీక్ అంటే నాకు ప్రాణం. అందుకే రెండు ప్రాణాలకు కలిపి నీకు డబ్బు ఇచ్చానని జ్యోత్స్న అంటుంది.
నాకు కార్తీక్‌కు ఎలాంటి సంబంధం లేదని ఈ పేపర్‌లో రాసి ఉందని, వీటిపైసంతకం చేసి కోటి రూపాయలు తీసుకోమని దీపకు ఆఫర్ ఇస్తుంది జ్యోత్స్న. ఈ డబ్బు తీసుకొని కార్తీక్‌ను నాకు వదిలేసి వెళ్లిపోమని దీపకు చెబుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.